Union Cabinet Approves Jamili Elections : ఒకటే దేశం ఒకటే ఎన్నికలు! దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీలకు జమిలిగా ఎన్నికలు నిర్వహించే ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం 3.0లోనే అందుకు అవకాశం ఉందన్న సమాచారం జాతీయస్థాయిలో రాజకీయంగా వేడి రగిల్చింది. ఇప్పటికే జమిలీ ఎన్నికలపై ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ఇచ్చి ఉండడం, ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో కూడా ప్రధానమంత్రి మోదీ దీని గురించి మాట్లాడం అనంతర పరిణామాలే అందుకు కారణం. ఒకటైతే స్పష్టం జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. కానీ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావివర్గంలో ఉన్న భిన్నాభిప్రాయాల మాటేంటి? ఒకే దేశం- ఒకే ఎన్నిక ఆచరణ సాధ్యం కావాలంటే జరగాల్సిన రాజ్యాంగ ప్రక్రియలు ఏంటి? ఇదే నేటి ప్రతిధ్వని.
Union Cabinet Approves Proposal For Jamili Elections : జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకొంది. ఏకాభిప్రాయ సాధన ద్వారా ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన కాలంలోనే ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నట్లు కేంద్ర సమాచార- ప్రసారశాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. తొలిదశలో పార్లమెంటు-అసెంబ్లీ ఎన్నికలను, అవి పూర్తయిన వంద రోజుల్లో రెండో దశలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న కమిటీ సిఫార్సుల ప్రకారం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయనుంది. ఈ విధానం అమల్లోకి వచ్చాక దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలకూ ఒకే ఓటరు జాబితాను ఉపయోగిస్తారు.