Pratidhwani : గుండె లయ తప్పుతోంది. పైగా ఒకప్పుడు అదేదో పెద్దలకే పరిమితం అనుకున్న పరిస్థితుల నుంచి చిన్నవయస్సుల్లోనే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. హృదయ సంబంధ అనారోగ్యాలు. ఒకరో ఇద్దరో కాదు! ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.7 కోట్ల మందిని బలి తీసుకుంటున్నాయి గుండె సమస్యలు. భారత్‌లోని గుండెపోటు కేసుల్లో సగం 50ఏళ్ల లోపు వారే. 40ఏళ్ల లోపు వారూ 25% వరకు ఉంటున్నారు. చివరకు 30లు, 20ల్లోనూ హార్ట్ ఎటాక్‌లు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అప్పటి వరకు నిక్షేపంగా ఉన్నవాళ్లు వ్యాయామాలు, ఆటపాటల్లో సందడిగా తిరిగిన వారే హఠాత్తుగా మరణిస్తున్నారు. మరి ఎందుకీ పరిస్థితి? భయపెడుతున్న గణాంకాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణులు ఏం చెబుతున్నారు? సెప్టెంబర్-29 వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఛీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి. రమేష్‌బాబు, కిఫీ హాస్పిటల్స్ సీనియర్ వైద్యులు డా. కె. సుబ్రహ్మణ్యం పాల్గొంటున్నారు.
ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు అంతా ఉరుకులు, పరుగుల జీవితం. దీంతో శరీరం అలసిపోతుంది. అలాగని అదేం శారీరక శ్రమ కాదు. ఆకలైతే ఏదో ఒకటి తింటాం, అయితే అది ఆరోగ్యకరమైన ఆహారంతో కాదు. నిద్ర వస్తే నిద్రపోతున్నాం, కానీ మనసు తేలికపడేంతలా కాదు. ఫలితంగా తీవ్ర ఒత్తిడి, ప్రతికూల దృక్పథాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది 30 ఏళ్లు నిండకుండానే అనేక మంది అధిక రక్తపోటు, గుండెపోటు, పక్షవాతం, మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రపంచం మొత్తం మీద ఎక్కువ శాతం మరణాలకు, శారీరక రుగ్మతలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు సృష్టం చేస్తున్నారు. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. జీవనశైలిని కాస్త మార్చుకుంటే చాలని సంతోషం, సంతృప్తి ఈ రెండింటినీ పుష్కలంగా పొందుతున్న వారిలో గుండెపోటు, పక్షవాతం వంటివి కనిపించడంలేదని తాజా పరిశోధనలో తేలింది. ఎంత ఆనందంగా ఉంటే గుండెకు అంత మేలు చేకూరుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
అధిక వ్యాయామంతో గుండెపోటు!- ఈ లక్షణాలు కనిపిస్తే డేంజరే - HEART ATTACK SYMPTOMS