AP MLA Pinnelli EVM Destroy : ఒకప్పుడు ఎన్నికల్లో ఓటమి భయంతో బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు పోయడం, బ్యాలెట్ పత్రాలపై ఇంకు పోయటం, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోవడం వంటి ఘటనలు జరిగేవి. ఆయా పార్టీలు పురమాయించిన దుండగులు అలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారు. తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే స్వయంగా పోలింగ్ కేంద్రంలో ప్రవేశించిన ఈవీఎంను ధ్వంసం చేసి, అక్కడున్న సిబ్బందిని బెదిరించిన దృశ్యాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ అంటేనే అరాచక పార్టీ అని, మాచర్లలో మాఫియా సామ్రాజ్యం స్థాపించిందని గత ఐదేళ్లుగా ఏపీ పౌరసమాజం నెత్తీనోరు బాదుకుని చెప్పింది. ఇప్పుడు అదే నిజమని నిరూపణైంది. చీఫ్ సెక్రటరీ సహా మొత్తం యంత్రాంగాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తున్న సీఎం జగన్ రెడ్డి ఆప్తుడైన ఈ ఎమ్మెల్యే పొలిటికల్ క్రిమినల్‌లాగా వ్యవహరిస్తుంటే మన వ్యవస్థలు ఏం చేస్తున్నాయో నేటి ప్రతిధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం.
వైఎస్సార్సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మే 13న పబ్లిగ్గా పోలింగ్ బూత్‌లో జొరబడి ఈవీఎం పగలకొడితే ఇన్నిరోజుల వరకు ఎందుకు వెలుగు చూడలేదు? మన వ్యవస్థల ఘోర వైఫల్యం కాదా ఇది? మాచర్లలో వైఎస్సార్సీపీ మాఫియా సామ్రాజ్యాన్ని పిన్నెల్లి నడిపిస్తున్నారని నెత్తీనోరు కొట్టుకుని ప్రతిపక్షాలు, మేథావులు చెబుతూనే వస్తున్నారు. అయినా కానీ ఈసీ ఏం ముందస్తు చర్యలు తీసుకున్నట్టు? మే 13వ తేదీ ఈవీఎం పగలకొడితే అతని మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈసీ ఏం చేస్తోంది? పోలీస్ యంత్రాంగం ఏం చేస్తోంది?
పల్నాడు జిల్లాలో గొడవలు జరుగుతాయని ముందే తెలిసినా అక్కడ పరిస్థితిని సమీక్షించి జాగ్రత్తలు తీసుకోవడంలో సీఎస్ జవహర్‌రెడ్డి, ప్రస్తుత డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాల వైఫల్యం లేదా? ఆ వీడియో బయటకు రాకపోతే ఎన్నికల సంఘం, పోలీసులు, పోలింగ్ సిబ్బంది అందరూ శుద్ధపూసలే! ఇంతకాలం పోలీసులు పల్నాడులో ఎంత ఏకపక్షంగా పని చేశారో చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ కాదా? పిన్నెల్లి సోదరులు పొరుగు రాష్ట్రానికి పరారయ్యేందుకు పోలీసులే సహకరించారని అనుకోవచ్చా.
మాచర్ల నియోజకవర్గంలో మొత్తం ఏడు చోట్ల ఈవీఎంల ధ్వంసం జరిగింది. మిగతా ఆరు చేసిందెవరు? బాధ్యులపై ఇంతవరకు చర్యల్లేవు. ప్రజాస్వామ్యం ఇంతగా అపహాస్యం పాలైన ఈ సంఘటనల్లో డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ఎన్నికల సంఘం ఎవరి పాత్ర ఎంతెంత ఉంది? మీకు పల్నాడు గురించి బాగా అవగాహన ఉంది కదా. అక్కడ ఏఏ ప్రాంతాల్లో వైసీపీ రౌడీ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది? అక్కడ వాళ్లు ఎటువంటి అరాచకాలకు పాల్పడుతూంటారు? పల్నాడులో గత ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ గొడుగు కింద పిన్నెల్లి సోదరులు చేసిన అక్రమాలు ఏవేంటి? మీరు బాధితుల తరపున న్యాయపోరాటం చేశారు కదా! ఈ అనుభవాలేంటి. మాచర్ల రాజధానిగా పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సామ్రాజ్యం. పుంగనూరు రాజధానిగా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఇష్టారాజ్యం. ఇలా వైసీపీ నాయకులు ఎలాంటి నేరసామ్రాజ్యాలని నిర్మించారు? వాటిని కూలదోయలాంటే కొత్త ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి అనే విషయాలను తెలుసుకుందాం.