Prathidwani Debate on Fake Propaganda in Social Media: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు మళ్లీ బుసలు కొడుతున్నాయి. ఇటీవలి ఎన్నికల తర్వాత కాస్త చల్లబడ్డాయి అనుకున్న అసత్యాలు, అబద్దపు ప్రచారాల పోస్టులు ఉన్నట్లుండి తిరిగి హోరెత్తుతున్నాయి. వాటి చాటున విద్వేషపు మంటల్లో చలికాచుకునేందుకు శవరాజకీయాలకూ తెరలేస్తోంది. వినుకొండలో వ్యక్తిగతకక్షల కారణంగా జరిగిన ఒక హత్యోదంతం కేంద్రంగా విపక్ష వైఎస్సార్సీపీ ప్రారంభించిన హంగామా ఈ పరిణామాలకు పరాకాష్టగా నిలుస్తోంది.
దానివెంటనే మాజీ సీఎం జగన్ ప్రారంభించిన ఓదార్పుయాత్ర అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. బాబాయి హత్య నుంచి అనేకానేక అబద్ధపు ప్రచారాల్లో ఆరితేరిపోయిన వారి నైపుణ్యాన్నీ చర్చకు పెడుతోంది. అసలు కొద్దిరోజులుగా రాష్ట్రంలో పరిణామాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాల్లో ఏది నిజం? ఏది అబద్ధం? ఎందుకీ ఫేక్ ప్రోపగాండ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. నేటి చర్చలో మహాసేన వ్యవస్థాపకుడు సరిపెల్ల రాజేష్, జనసేన వీరమహిళ రాయపాటి అరుణ పాల్గొన్నారు.
ఎన్నికల ఫలితాలతో చల్లాబడ్డాయనుకున్న సోషల్‌మీడియా రాజకీయ ఫేక్ ప్రచారాలు మళ్లీ పరాకాష్ఠకు చేరాయా? ప్రభుత్వాన్ని వైసీపీ సోషల్ మీడియా టార్గెట్ చేస్తోందా అని అనుమానం కలుగుతోంది. వినుకొండ ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెనుసంచలనంగా ఉంది. ఆ విషాద ఘటన కేంద్రంగా వైసీపీ ఎలాంటి ప్రచారాలు చేస్తోంది. దీనిపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అంటేనే ఫేక్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని దుయ్యబడుతున్నారు. వైఎస్సార్సీపీ పుట్టుక నుంచి ప్రస్థానం వరకు అక్కడ నుంచి నేటి పతనం వరకు ఫేక్ పాలిటిక్స్‌నే జగన్ మోహన్ రెడ్డి నమ్ముకున్నారని మండిపడుతున్నారు.
ఇప్పటికైనా ఫేక్ ప్రచారాలు, అవాస్తవాలు మానాలని తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తున్నారు. మరోవైపు జగన్ వ్యవహారశైలిని టీడీపీ శ్రేణులు, ఆ పార్టీ సానుభూతిపరులు సామాజిక మాధ్యమాలలో తప్పుపడుతున్నారు. ఫేక్ పాలిటిక్స్ పేటెంట్‌తో మరోసారి తన పార్టీ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. చివరికి జగన్ మోహన్ రెడ్డి మాట, నడక, నవ్వు, నమస్కారం అన్నీ ఫేక్ అని, ఆయనను గమనించిన వాళ్లు ఎవరైనా ఈ విషయం చెప్పగలరంటున్నారు.
నూతన ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే పింఛన్లు దగ్గర్నుంచి తల్లికివందనం పథకం వరకు కూటమే లక్ష్యంగా ఫేక్ ప్రచారాలను మొదలు పెట్టింది. దీంతో ప్రభుత్వం మీద ఇంత పచ్చిగా విషప్రచారం జరుగుతుంటే అలాంటి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కామన్ మాన్ అనుకుంటున్నారు. ప్రతిపక్షానికి చెందిన పత్రిక, ఛానెల్స్, సోషల్ మీడియాలో ఇంతగా చెత్త ఎత్తిపోస్తుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారని ప్రభుత్వాన్ని కూటమి మద్దతుదారులే ప్రశ్నిస్తున్నారు.