Pratidwani: ఒక్కసారిగా ఊహించని రీతిలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు మూట గట్టుకున్నాయి. ఒక్క రోజు వ్యవధిలో 15 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో సోమవారం ఆరంభంలోనే ఏకంగా 2,400 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ ఒకదశలో 2600 పాయింట్ల వరకు నష్టాల్లోకి జారుకుంది. ఓ దశలో 24 వేల స్థాయిని కూడా కోల్పోయింది. తర్వాత కాస్త కోలుకున్నా తీవ్ర నష్టాలు తప్పలేదు. 24 వేల ఎగువన ముగిసింది. దలాల్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా ఏర్పడిన కుదుపు కారణంగా రూ.15 లక్షల కోట్లు ఆవిరైంది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.457 లక్షల కోట్ల నుంచి రూ.442 లక్షల కోట్లకు పడిపోయింది.
Debate on Stock Market : మార్కెట్‌ను నిరంతరం ఎన్నో వార్తలు ప్రభావితం చేస్తుంటాయి. కొన్నింటికి పాజిటివ్, మరికొన్నింటికి ప్రతికూలంగానూ మార్కెట్ స్పందిస్తుంది. ఈ కదలికల్ని ఎలా గమనించాలి? ఇటీవలి కాలంలో మార్కెట్ లాభాలు చూసిన చాలామంది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లతో పాటు, నేరుగా షేర్లలోనూ ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటివాళ్ళు ఇప్పుడేం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
సోమవారం (05-08-2024) దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. దాదాపు అన్ని సెక్టార్లు నష్టాలను చవిచూశాయి. దీనితో మదుపరులు ఏకంగా రూ.14 లక్షల కోట్లు మేర నష్టపోయారు. అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందనే భయాలు ఉండడం, పశ్చిమాసియాలో నానాటికీ ఉద్రిక్తతలు పెరుగుతుండడమే ఇందుకు కారణం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, వివిధ కంపెనీలు విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలు ఏ మాత్రం ఉత్సాహభరితంగా లేకపోవడం వల్ల మదుపరులు కూడా డీలా పడ్డారు. ఇవన్నీ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టివేశాయి. చివరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 2222 పాయింట్లు నష్టపోయి 78,759 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 662 పాయింట్లు కోల్పోయి 24,055 వద్ద ముగిసింది.
'బేర్'మన్న స్టాక్ మార్కెట్లు - రూ.14 లక్షల కోట్లు నష్టపోయిన మదుపరులు! - Stock Market Today