Loksabha Elections 2024 Bihar Begusarai Politics : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిహార్‌లోని బెగుసరాయ్ స్థానంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇక్కడ ఎన్నికల వాతావరణం భిన్నంగా ఉంటుంది. బీజేపీ నుంచి గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఫైర్ బ్రాండ్ గిరిరాజ్ సింగ్ మళ్లీ బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రత్యర్థి కూటమి నుంచి ఎవరు పోటీలో ఉంటారో అని బెగుసరాయ్ ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల సమీకరణాలతో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గిరిరాజ్ సింగ్‌కు పోటీగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ నుంచి ఏ అభ్యర్థిని బరిలో దింపుతారనేది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న.
కన్హయ్యకు తోడుగా సినీనటుల ప్రచారం
Kanhaiya Kumar Lok Sabha : 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యువనాయకుడు కన్హయ్య కుమార్. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరుఫున బెగుసరాయ్ నుంచి బరిలో నిలిచారు. మోదీ పాలనను వ్యతిరేకిస్తూ లెఫ్ట్ పార్టీలకు చెందిన చాలామంది నాయకులు బెగుసరాయ్‌లో కన్హయ్య తరుఫున ప్రచారం కూడా చేశారు. పలువురు సీనియర్ నాయకులు, షబానా అజ్మీ, ప్రకాష్ రాజ్ వంటి సినీనటులు బెగుసరాయ్‌లో కన్హయ్య గెలుపుకోసం ప్రచారం చేశారు. దీనికి తోడు లెఫ్ట్ పార్టీల స్టార్ క్యాంపెయినర్లు కూడా కన్హయ్య గెలుపు మీద ధీమా వ్యక్తం చేశారు. ఒక దశలో బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్‌ను కన్హయ్య ఓడిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
BJP vs RJD Begusarai : కానీ కన్హయ్య కుమార్ గెలుపు అంత సులభం కాదు, ఎందుకంటే ప్రతిపక్ష కూటమి ధర్మాన్ని కాదని బెగుసరాయ్‌లో ఆర్జేడీ తన అభ్యర్థిని బరిలో దింపింది. దీంతో కన్హయ్య కుమార్‌కు పడాల్సిన ఓట్లు పూర్తిగా చీలిపోయాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గిరిరాజ్ సింగ్‌కు 6లక్షల 92వేల ఓట్లు వచ్చాయి. కన్హయ్య కుమార్‌కు 2లక్షల 69వేల ఓట్లు వచ్చాయి. ఆర్జేడీ తరపున పోటీచేసిన తన్వీర్ హాసన్‌కు లక్షా 98వేల ఓట్లు వచ్చాయి. దింతో కన్హయ్య కుమార్ దాదాపు నాలుగు లక్షల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
బెగుసరాయ్‌ని లెనిన్ గ్రాడ్ అని ఎందుకు పిలుస్తారు?
బెగుసరాయ్‌ను మినీ మాస్కో లేదా లెనిన్ గ్రాడ్ ఆఫ్ ఈస్ట్ అని కూడా పిలుస్తారు. నిజానికి స్వాతంత్ర్యానికి ముందు భూమిహార్ భూస్వాములకు వ్యతిరేకంగా వామపక్షాలు ఫ్రంట్‌ను ఏర్పాటు చేశాయి. ఈ లెఫ్ట్ పార్టీలో భూమిహార్ నాయకులు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో కామ్రేడ్ చంద్రశేఖర్ సింగ్ ఈ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారని చెబుతారు. ఆయన తండ్రి రామచరిత్ర సింగ్ బిహార్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖతో పాటు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కామ్రేడ్ చంద్రశేఖర్ సింగ్ వామపక్ష ఉద్యమంలో కొనసాగారు. అప్పటి నుంచి బెగుసరాయ్‌లోని అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో వామపక్ష భావజాలం కనిపించడం ప్రారంభించింది. ఈ కారణంగానే బెగుసరాయ్‌ను లెనిన్ గ్రాడ్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు.
ముందు టికెట్ వద్దన్నారు- కానీ
Bihar Politics : 1952 నుంచి 2019 వరకు సీపీఐ నుంచి యోగేంద్ర శర్మ 1967లో ఒక్కసారి మాత్రమే ఎంపీ అయ్యారు. ఎనిమిది సార్లు కాంగ్రెస్ ఎంపీలు గెలవగా, మిగిలిన సమయంలో జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్, బీజేపీ పార్టీ ఎంపీలు ఇక్కడ జెండా ఎగురవేశారు. బెగుసరాయ్‌లో 2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు బీజేపీ పార్టీ ఆధిపత్యం చలాయించింది. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత భోలా సింగ్ విజయం సాధించారు. అయన మరణాంతరం ఈ సీటు గిరిరాజ్ సింగ్‌కు దక్కింది. గిరిరాజ్ సింగ్ గతంలో నవాడా నుంచి ఎంపీగా ఉన్నారు. బెగుసరాయ్ నుంచి పోటీకి గిరిరాజ్ సింగ్ ముందు విముఖత చూపించారు. అయితే పార్టీ ఆయనను బుజ్జగించి ఒప్పించింది. దీంతో ఆయన బెగుసరాయ్ నుంచి ఎన్నికల బరిలో దిగడానికి ముందుకు వచ్చారు. ఆ తర్వాత భారీ మెజారిటీతో గెలిచి మోదీ క్యాబినెట్లో మంత్రి హోదా కూడా సంపాదించారు.
భూమిహార్లదే ఆధిపత్యం
బెగుసరాయ్‌లో కుల సమీకరణాల కోణాన్ని పరిశీలిస్తే భూమిహార్లదే ఆధిపత్యం. అభ్యర్థి ఏ పార్టీలో ఉన్న ఇక్కడ భూమిహార్ల వర్గం అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. బెగుసరాయ్‌లో 5 లక్షలకుపైగా భూమిహార్ ఓటర్లు ఉన్నారు. దాదాపు 2.4 లక్షల మంది ముస్లిం ఓటర్లు కూడా ఉన్నారు. ఇక్కడ 2 లక్షలకుపైగా కుర్మీకుష్వాహా వర్గం వారు ఉన్నారు. యాదవులు సంఖ్య కూడా దాదాపు 1.5 లక్షల వరకు ఉంది. అంతేకాకుండా దళిత ఓటు బ్యాంకు కూడా గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుంది. బ్రాహ్మణులు, రాజపుత్రులు, కాయస్తుల సంఖ్య కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉంటుంది.
రేసులో రాజ్యసభ సభ్యుడు
బెగుసరాయ్ పోటీలో ప్రతిపార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టాలని కోరుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ఇక్కడ బీజేపీ తరుఫున గిరిరాజ్ సింగ్ పోటీ చేయవచ్చు. అయితే బీజేపీ నుంచి మరో అభ్యర్థి రాకేశ్ సిన్హా కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆయనను బీజేపీ రాజ్యసభ సభ్యుడిని చేసింది. కానీ ఆయన బెగుసరాయ్‌కు చెందిన వ్యక్తి కావడం వల్ల ఈ మధ్య ఎక్కువగా బెగుసరాయ్‌లో వివిధ ప్రజాకార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. గత ఎన్నికల్లో వామపక్షాల నుంచి కన్హయ్య కుమార్ బరిలో నిలిచారు. అయితే ప్రస్తుతం కన్హయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల ఈసారి కాంగ్రెస్ పార్టీ తరుపున కన్హయ్య బరిలో దిగనున్నారు. అయితే ఆర్జేడీ పార్టీ ఈసారి కూడా తమ అభ్యర్థిని బరిలో దింపుతుందా లేక కాంగ్రెస్, వామపక్షాల అభ్యర్థికి మద్దతు పలుకుతుందా అనేది చూడాలి.
పోటీలో నిలిచేదెవరు?
ఇప్పటికే బీజేపీ నుంచి గిరిరాజ్ పోటీకి సిద్ధం కావడం వల్ల ప్రత్యర్థులెవరో అనేదానిపైనే ప్రస్తుతం చర్చంతా. కాంగ్రెస్ నుంచి కన్హయ్య కుమార్ పోటీలో ఉంటారని వార్తలు వినిపిస్తున్నప్పటికీ గతంలో రాష్ట్ర కాంగ్రెస్ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా ఉన్న అమృత భూషణ్ కూడా పోటీకి రెడీ అవుతున్నారు. అయితే కమ్యూనిస్ట్ పార్టీ గతంలో మాదిరిగానే ఈసారి కూడా బెగుసరాయ్‌లో తమ అభ్యర్థి బరిలో ఉంటారని చెబుతూ వస్తోంది.
గతంలో బెగుసరాయ్‌లో కన్హయ్య కుమార్‌కు వచ్చినవి లెఫ్ట్ పార్టీ ఓట్లని అటువంటి పరిస్థితుల్లో బీజేపీకి కేవలం సీపీఐ మాత్రమే పోటీ ఇవ్వగలదని వామపక్ష నేతలు అంటున్నారు. అయితే ఆర్జేడీ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అష్పాక్ కరీమ్, తన్వీర్ హసన్, రాజవంశీ మహతో ఆర్జేడీ నుంచి పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నారు.
2024 లోక్‌సభ పోల్స్: ఎన్డీఏ Vs ఇండియా- మోదీ జోరును విపక్ష కూటమి ఆపేనా?
వారణాసి టు వయనాడ్- రసవత్తర పోరుకు అంతా రె'ఢీ'- లోక్‌సభ హాట్ సీట్లు ఇవే!