Cyber Crimes in Telangana : పిల్లల చదువుల కోసం దాచుకున్న కష్టార్జితాన్ని క్షణాల్లో తన్నుకు పోతున్నారు. అమ్మాయి పెళ్లికోసం పైసా పైసా కూడబెట్టినది అంతా మాయ చేసి దోచేస్తున్నారు. రిటైర్‌మెంట్ జీవితం కోసం కడుపు కట్టుకుని చేసుకున్న పొదుపులను ఒడుపుగా కొట్టుకెళ్లిపోతున్నారు. పేట్రేగిపోతున్న సైబర్ ఆర్థికనేరాల విశ్వరూపం ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే జీవితకాల కష్టం క్లిక్ దెబ్బతో ఆవిరై పోతోంది. భవిష్యత్ స్వప్నాలు క్షణాల వ్యవధిలో చెల్లాచెదురు అయిపోతున్నాయి. తెలియక, అవగాహన లేక కొందరు అత్యాశకు పోయి ఎందరో వీరి బారిన పడుతున్నారు. ఇంకొందరు కొత్త చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. వందల కోట్లకు చేరిన ఈ మోసాల నుంచి మనల్ని మనం కాపాడు కోవడం ఎలా? పోలీసులు సైబర్ క్రైమ్ నిపుణులు ఈ విషయంలో ఏం సూచిస్తున్నారు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
సైబర్ నేరాలు రోజురోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. ప్రముఖవ్యక్తుల సోషల్ మీడియా ఖాతాల డీపీలు ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఖాతాదారుల ప్రమేయం లేకుండానే బ్యాంకు అకౌంట్ల నుంచి కోట్ల రూపాయలు అపరిచతుల మ్యూల్ ఖాతాలకు బదిలీ అవుతున్నాయి. కొరియర్ పార్సిళ్లలో డ్రగ్స్ ప్యాకెట్లు వచ్చాయంటూ బెదిరించి, డబ్బులు గుంజుతున్నారు. అయితే సైబర్ నేరస్థులు సొమ్ములు కొట్టేసినా, భయపడకుండా సత్వరమే ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు వెనక్కి తీసుకొస్తోంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో