Prathidwani : ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేయాలన్న ఒకే ఒక్క డిమాండ్‌తో కొన్నినెలలుగా న్యాయవాదులు, ప్రజాసంఘాల నాయకులు కదం తొక్కుతున్నారు. ఇంత వ్యతిరేకత వస్తున్నా, ఎన్ని ఆందోళనలు జరుగుతున్నా జగన్ ప్రభుత్వం ప్రజల నెత్తిన రుద్దాలని చూస్తోన్న ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో ఏముంది? ఆ చట్టం ఎందుకు ఇంత వివాదాస్పదంగా మారింది? దీనివల్ల ప్రజలకు కలిగే నష్టమేంటి? కొత్త చట్టంతో ప్రజల భూములు, ఆస్తులను వారి చేతుల్లో నుంచి లాగేసుకుంటారనీ, కబ్జాకోరులు చెలరేగిపోతారనే భయాలు పెరుగుతుండటానికి కారణాలేంటి? భూవివాదాలను పూర్తిగా సివిల్ కోర్టుల పరిధి నుంచి తప్పించేసి, అధికారుల చేతుల్లో పెడితే ఏం జరుగుతుంది? ఆస్తుల రక్షణకు ప్రజల ముందున్న మార్గమేంటి? ఈ అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Opposition Land Titling Act : ల్యాండ్ టైటిలింగ్ చట్టం-2019 ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అది కార్యరూపం దాల్చితే భూ యాజమాన్య హక్కులకు ఒకే రికార్డు సరిపోనుంది. భూ పత్రాలు, దస్త్రాల ట్యాంపరింగ్ జరగకుండా ఈ చట్టం తోడ్పడుతుందని అధికారులు చెప్తున్నారు. భూమి ఉన్నా పట్టాదారు పాసు పుస్తకాలు లేకపోవడం, రికార్డుల్లో లోపాల కారణంగా చాలామంది యజమానులు పూర్తి స్థాయిలో హక్కులు పొందలేకపోతున్నారు. ఫలితంగా భూ వివాదాలు ఏర్పడితే సమస్యను పరిష్కరించలేని పరిస్థితి ఏర్పడుతోంది. భూ రికార్డులు సరిగా లేని కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ది పొందేందుకూ ఇబ్బంది పడుతున్నారు.
రాష్ట్రంలో భూ క్రయ, విక్రయాలు కాగితాల ఆధారంగానే జరుగుతున్నాయి. కొనుగోలుదారులు చాలా వరకూ హద్దులు, విస్తీర్ణాన్ని నిర్ధారించుకోవడం లేదు. ఫలితంగా సివిల్ కోర్టుల్లో 66 శాతం వరకూ భూ వివాదాల కేసులే ఉంటున్నాయి. ప్రస్తుత విధానంలో భూమిపై హక్కు నిరూపించుకోవాలంటే పట్టాదారు పాసుపుస్తకం ఉండాల్సిందే! 1బి, అడంగల్‌లోనూ పేరు నమోదై ఉండాలి. ఇవన్నీఉన్నా ఒక్కోసారి హక్కుల నిరూపణకు పూర్తి స్థాయి సాక్ష్యాలుగా పరిగణించలేని పరిస్థితి. కొత్తగా రాబోతున్న చట్టం ద్వారా భూ యాజమాన్య హక్కుల నిరూపణకు ఒకే రికార్డు సరిపోతుందని చెబుతున్నారు అధికారులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి రాగానే భూముల సమగ్ర సర్వే చేసి రికార్డులు రూపొందిస్తారు. తద్వారా టైటిల్ రిజిస్టర్ అందుబాటులోకి రానుంది.
ల్యాండ్ టైటిలింగ్ చట్టం పకడ్బంధీగా అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. గ్రామ సచివాలయాల్లోనే ల్యాండ్ సర్వే శాఖను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది. రాత పరీక్ష ద్వారా సిబ్బందిని ఎంపిక చేసి. 4 నెలల శిక్షణ అనంతరం విధుల్లోకి పంపుతామని అధికారులు చెబుతున్నారు.