Etv Bharat Pratidwani : ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పండుగొచ్చినట్లే. స్వేచ్ఛగా, ప్రశాంతంగా ఎన్నికలు జరగాలంటే నిష్పాక్షిక యంత్రాంగం, పోలీసు వ్యవస్థ ఉండాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసుల్లో చాలామంది జగన్ భక్తుల్లా మారిపోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ వచ్చినా సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి జగన్ సేవలో తరిస్తున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. జగన్ భక్తబృందంలోని ఓ ఐజీ, ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసినా ఆ స్థానాలను మరికొందరు వీర విధేయులతో నింపేయడం సీఎస్, డీజీపీ స్వామిభక్తిని చాటుతోందనే చర్చ సాగుతోంది. సాధారణ ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలన్నా, ప్రలోభాలు-భయాలకు తావు లేకుండా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా ఈసీ ఏంచేయాలి? నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలేంటి? "ఈసీ కళ్లకు వైఎస్సార్సీపీ గంతలు" అనే అంశంపై ఇదీ నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో హైకోర్టు న్యాయవాది కె.రజని, ఏపీ టుమారో వ్యవస్థాపకులు ఎన్.చక్రవర్తి పాల్గొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ECI Appoints IPS Officers in Andhra Pradesh : వైఎస్సార్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలతో ఎన్నికల సంఘం వేటు వేసిన ఎస్పీలు, కలెక్టర్లల స్థానంలో కొత్త అధికారులను నియమించారు. అయితే నూతనంగా నియమించిన వారిలో చాలా మంది ఐదేళ్లలో అధికార వైఎస్సార్సీపీకు మద్దతుగా, ప్రతిపక్షాలను అణచివేసిన చరిత్ర ఉంది. జాబితాలో సగానికి పైగా వైఎస్సార్సీపీ మనుషులే ఉన్నారు. అలాంటి వారినే ఏరికోరి ఎంపిక చేశారు సీఎస్ జవహర్‌రెడ్డి. సీఈసీ ఆదేశించినా ముగ్గురి ప్యానెల్‌తో జాబితా పంపాల్సిందే తానే కాబట్టి దాన్నే అవకాశంగా మార్చుకున్న సీఎస్ వైఎస్సార్సీపీకు ఊడిగం చేసే అధికారులనే మళ్లీ ప్రతిపాదించారు. ఎన్ని విమర్శలు వచ్చినా స్వామి భక్తి చాటుకోవడానికే ఆయన తపన పడుతున్నారు.
EC No Actions on Key Officers : రాష్ట్రంలో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న కొందరు అధికారులపై వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తే వారు ఆ పోస్టుల్లో కొనసాగేందుకు ఎంత మాత్రం అర్హులు కాదన్న అభిప్రాయం కలుగుతోంది. ఆ అధికారుల్ని ఈసీ వెంటనే ఆ పోస్టుల నుంచి తప్పించాలని, లేకపోతే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరగవన్న డిమాండ్‌లు ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. అధికార పార్టీ ప్రయోజనాలను రక్షించడమే పరమావధిగా పనిచేస్తున్న ఆ అధికారులు తమ హోదాను, అధికారాల్ని ఉపయోగించి ఎన్నికలను ప్రభావితం చేయగలరన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ధనుంజయరెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్ ఆంజనేయులు, విజిలెన్స్ విభాగాధిపతి కొల్లి రఘునాథరెడ్డి, డీఆర్‌ఐ చీఫ్ రాజేశ్వర్‌రెడ్డి, సెర్ప్ సీఈఓ మురళీధర్‌రెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ ఎండీ వాసుదేవరెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ వంటివారు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విపక్షాలు, వివిధ సంఘాలు పదే పదే ఆరోపిస్తున్నాయి.
సీఎస్ జవహర్‌రెడ్డి : ఈ అధికారుల చర్యలూ వాటికి ఊతమిచ్చేలా ఉన్నాయి. వీరిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోవడానికి ఈసీ మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎస్ జవహర్‌రెడ్డికి అధికార పార్టీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన సీఎస్‌గా తన బాధ్యతల్ని నిష్పక్షపాతంగా నిర్వహించడం లేదన్న విమర్శలున్నాయి.
వాలంటీర్లలో అత్యధికులు అధికారపార్టీ కార్యకర్తలని తెలిసినా వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా చూడాలని విపక్షాల నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. పింఛన్లు సహా ప్రభుత్వ పథకాల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించిన తర్వాత, సీఎస్‌గా స్పందించి ఇంటింటికీ పింఛన్లు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సింది పోయి వైసీపీ ఆడుతున్న రాజకీయ క్రీడకు మద్దతిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ వెలువడటానికి ముందు ప్రభుత్వ పెద్దలు అస్మదీయుల కంపెనీలకు వేల ఎకరాల భూములు కట్టబెడుతున్నా సీఎస్‌గా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి అధికారి సీఎస్‌గా ఉంటే ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయని ఆశించలేమని, ఈసీ ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని ఆయనకంటే సీనియర్లు అయిన 10-12 మంది అధికారుల్ని పక్కనబెట్టి జగన్ అందలమెక్కించారు.
డీజీపీ రాజేంద్రనాథరెడ్డి : ఆయన ఇప్పటికీ ఇన్‌ఛార్జి డీజీపీనే. పోలీసు అధికారుల్లో చాలా మంది అధికార పార్టీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారంటే దాని వెనుక రాజేంద్రనాథరెడ్డి పాత్ర చాలా ఉందన్న ఆరోపణలున్నాయి. విపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్‌లు చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినవారిపైనా కేసులు పెట్టి వేధించడం వంటివి ఆయన హయాంలో కోకొల్లలుగా జరిగాయి. అధికార పార్టీ నాయకుల హింసాకాండపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీలోని ఎంత పెద్ద నాయకులు వచ్చినా ఆయన కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వరు.
విపక్ష నాయకులు, ఉద్యోగ, ప్రజాసంఘాల వారు ఏదైనా నిరసనకు పిలుపునిస్తే ముందు రోజు రాత్రే వారందరినీ గృహనిర్బంధం చేసేస్తారు. అదే వైసీపీ శ్రేణులు ఎంతగా పేట్రేగిపోతున్నా కేసులుండవు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక వైసీపీ నాయకులు మరింత రెచ్చిపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిరిగానే ఈ సార్వత్రిక ఎన్నికలనూ పోలీసుల అండతో వైసీపీ ఏకపక్షంగా మార్చేసే ప్రమాదం ఉంది. డీజీపీని మార్చితేనే ఆ పార్టీ ఆగడాలకు కొంతైనా అడ్డుకట్ట పడుతుందని పలువురు ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు.