What are the Ways to Keep Bananas Fresh : అరటి పండ్లు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యాన్ని అందిస్తాయి. కాలంతో సంబంధం లేకుండా అన్ని రోజుల్లో లభ్యమవడంతోపాటు.. పోషకాలు ఎక్కువగా ఉండటంతో చాలా మందిని వీటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే.. కొనడం వరకు బానే ఉన్నా.. వీటిని నిల్వ చేయడం సమస్యగా ఉంటుంది. మార్కెట్ నుంచి ఇంటికి తీసుకొచ్చే వరకు పండ్లు బాగానే ఉంటాయి. ఆ తర్వాతే వాటి పరిస్థితి మారిపోతుంది. మచ్చలు ఏర్పడి.. త్వరగా పాడైపోతుంటాయి. అయితే ఈ పరిస్థితి రాకుండా.. ఎక్కువ రోజుల పాటు అరటి పండ్లు నిల్వ ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కాడను చుట్టండి: చాలా మంది మార్కెట్ నుంచి తెచ్చిన అరటి పండ్లను కవర్లో నుంచి తీయకుండా అలాగే పెడుతుంటారు. ఇలా అస్సలు చేయవద్దు. వచ్చిన వెంటనే వాటిని కవర్ నుంచి వేరు చేయాలి. లేకపోతే పాడైపోతాయి. అలాగే అరటి పండ్లను కొన్న తరవాత వాటిని వేరువేరుగా విడదీయండి. ఆ తరవాత ఒక్కో అరటి పండు కాడ చుట్టూ సిల్వర్ ఫాయిల్ కాయిల్‌ను గానీ, లేదా ప్లాస్టిక్ కవర్‌ను చుట్టి రబ్బర్ వేయండి.
సూర్య కాంతి నుంచి దూరంగా: ఎండకు ఉంటే అరటి పండ్లు తొందరగా పాడవుతాయి. అందుకే వీటిని ఎండ తగిలే చోట, వేడిగా ఉండే వంటగదిలో నిల్వ ఉంచకండి. ఇంట్లో నిల్వ చేసేటప్పుడు ఒక క్లాత్‌లో చుట్టి పెడితే ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి.
బాగా పండిన అరటి పండ్లు పడేస్తున్నారా? మీరు ఆరోగ్యాన్ని కోల్పోతున్నట్లే! మరి ఎన్ని తినాలి?
వేలాడదీయండి: అరటి పండ్లను పండ్ల బుట్టలో ఒకదానిపై ఒకటి పెడితే తొందరగా పాడవుతాయి. అలాగే వాటి తొక్క నల్లగా అవుతుంది. అందుకే అరటి పండ్లను ఎప్పుడూ బాగా గాలి తగిలే ప్రదేశంలో వేలాడదీయండి. సాధారణంగా ఈ పండ్లను వేలాడతీయడం మనం అరటి పండ్ల వ్యాపారుల వద్ద గమనించవచ్చు.
ఫ్రిజ్‌లో వద్దు: అరటి పండ్లను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే వాటి కాడల నుంచి ఇథలీన్ వాయువు వేగంగా రిలీజ్ అవుతుంది. దీంతో అరటి పండ్ల తొక్క నల్లగా మారి పాడైపోతుంటాయి.
సోడా నీరు: అరటి పండ్లు కొన్ని రోజులు తాజాగా ఉండాలంటే మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే నీరు, సోడా మిశ్రమంలో 10 నిమిషాల పాటు పెట్టి తీసివేయాలి.
వెనిగర్: అరటి పండ్లు చాలా రోజులు పాడవకుండా ఉండాలంటే వాటిపై కొద్దిగా వెనిగర్ స్ప్రే చేయాలి.
ఇతర పండ్లకు దూరంగా: మనలో చాలా మంది అరటి పండ్లను ఇతర పండ్లు, కూరగాయలతో కలిపి నిల్వ చేస్తుంటారు. కానీ అరటి పండ్లు ఫ్రెష్‌గా ఉండాలంటే వీటిని వేరే పండ్లకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా అవకాడో, కివిస్, యాపిల్స్, టమాటల వద్ద వీటిని అస్సలు ఉంచకూడదు. ఎందుకంటే వీటి నుంచి విడుదలయ్యే ఎథిలిన్ గ్యాస్ అరటి పండ్లను త్వరగా పాడయ్యేలా చేస్తుంది.
ఇవి కూడా: అరటి పండ్ల గుత్తిలో ఏదైనా పాడైపోతే.. వెంటనే దానిని వేరు చేయండి. లేకపోతే మిగిలిన పండ్లు పాడయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో విడివిడిగా అమ్మే పండ్లను కొనకండి. ఇవి త్వరగా పాడవుతాయి.
అరటి పండ్లు ఆరోగ్యానికి మంచివే - కాని అతిగా తింటే ఈ ప్రాబ్లమ్స్ గ్యారెంటీ!