Ginger Peel Benefits : మన వంటింట్లో అందుబాటులో ఉండే అల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. దీన్ని కూరల్లో, ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగించడం చూస్తుంటాం. అయితే.. ఎందులో ఉపయోగించినా సరే.. ఎక్కువగా అల్లం పొట్టును తీసేసే వినియోగిస్తుంటారు. కానీ.. అల్లం పొట్టుతో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా అనేక ఇతర ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సహజ ఎరువుగా వాడొచ్చట
మన పెరట్లో లేదా కుండీల్లో పెంచుకునే మొక్కలకు సహజ ఎరువుగా అల్లం పొట్టును వాడొచ్చట. ఇది మొక్కలకు మంచి ఎరువులా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా లభించే ఫాస్ఫరస్.. మొక్కల ఎదుగుదలను ప్రేరేపించి క్రిమికీటకాల బారి నుంచి సంరక్షిస్తుందని చెబుతున్నారు.
రుచితోపాటు ఆరోగ్యం కూడా
మనం కూరలు వండే సమయంలో రుచిని పెంచడానికి కొత్తిమీర, పుదీనా, వెనిగర్, నిమ్మరసం.. లాంటి పదార్థాల్ని ఉపయోగిస్తుంటాం. వీటి స్థానంలో అల్లం పొట్టును కూడా వినియోగించవచ్చని చెబుతున్నారు నిపుణులు. కూర ఉడికేటప్పుడు చిటికెడు అల్లం పొట్టును వేయడం వల్ల కాస్త ఘాటుదనంతో పాటు రుచీ రెట్టింపు అవుతుందని తెలిపారు.
వీటిని ఉడికించేటప్పుడు..
చాలా మంది క్యాబేజీ, బ్రకోలీ, క్యాలీఫ్లవర్.. వంటి కాయగూరల్ని పచ్చి వాసన పోతుందని వండే ముందు ఉడికిస్తారు. అయితే ఈసారి వాటిని ఉడికించే సమయంలో కొద్దిగా అల్లం పొట్టును వేసి చూడండని సలహా ఇస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఒక రకమైన సువాసన వెదజల్లుతుందని తెలిపారు. ఇంకా కొన్ని వంటకాలను ఆవిరిపైనే ఉడికిస్తుంటారు. ఇలాంటప్పుడు ఆయా పదార్థాలపై కొద్దిగా అల్లం పొట్టును చల్లి ఉడికించడం వల్ల వాటికి కాస్త ఘాటుదనం వచ్చి.. రుచి కూడా పెరుగుతుందని వివరించారు.
అల్లంతో స్టాక్!
మనలో చాలా మంది సూప్స్, గ్రేవీ కర్రీస్, ఇతర వంటకాల్లోకి.. కాయగూరలతో తయారుచేసిన స్టాక్/ బ్రాత్‌ను వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల కూరకు చిక్కదనంతో పాటు మంచి రుచి కూడా వస్తుంది. అయితే ఈ బ్రాత్‌ను కేవలం కాయగూరతోనే కాకుండా అల్లం పొట్టుతో కూడా తయారుచేసుకోవచ్చని అంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఆరు కప్పుల నీటిలో అరకప్పు అల్లం పొట్టు వేసి అరగంటపాటు మరిగించాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారాక వడకట్టుకొని నిల్వ చేసుకోవచ్చని.. అవసరమైనప్పుడల్లా దీనిని సూప్స్, గ్రేవీస్, ఇతర కూరల్లోకి వాడుకోవచ్చని చెబుతున్నారు.
దగ్గు నుంచి రిలీఫ్!
అసలే వర్షాకాలం. ఈ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే వీటి నుంచి విముక్తి పొందడానికి చాలా మంది టీ తయారీలో అల్లం వాడుతుంటారు. అయితే.. అల్లం బదులుగా అల్లం పొట్టు, ఒకట్రెండు లవంగాలు, యాలకులు వేసి మరిగించిన టీ తాగితే దగ్గు, జలుబు నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. అలాగే.. అల్లం పొట్టును ఎండబెట్టి పొడి చేసుకుని.. టీస్పూన్ తేనె కలుపుకొని తీసుకున్నా ఈ సమస్యల నుంచి సత్వర ఉపశమనం కలుగుతుందని సూచిస్తున్నారు.