How to Make Thotakura Pakodi : పకోడి.. మెజార్టీ పీపుల్ ఫేవరెట్ స్నాక్ ఐటమ్. అందుకే తినాలనిపించినప్పుడు, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు చాలా మంది దీనిని తయారు చేస్తుంటారు. ఎందుకంటే నిమిషాల్లో తయారవ్వడమే కాదు.. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే.. పకోడి అంటే చాలా మందికి ఆనియన్, పాలక్, చికెన్, పల్లీ, సగ్గుబియ్యంతో చేసినవే గుర్తుకువస్తాయి. అయితే వీటితో మాత్రమే కాదు తోటకూరతో కూడా అద్దిరిపోయే పకోడి చేసుకోవచ్చు. తోటకూర తినని వారికి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడానికి పెద్దగా కష్టపడనవసరం లేదు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- అల్లం - కొద్దిగా
- వెల్లుల్లి - 15
- పచ్చిమిర్చి - 4
- సోంపు లేదా జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- తోటకూర - రెండు కట్టలు
- బియ్యప్పిండి - పావు కప్పు
- శనగపిండి - 200 గ్రాములు
- పసుపు - పావు టీ స్పూన్
- ఉప్పు- రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- కరివేపాకు - 4 రెమ్మలు
- పచ్చిమిర్చి - 2
- నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం:
- ముందుగా తోటకూరను శుభ్రంగా కడిగి కాడలు ఎక్కువ లేకుండా సన్నగా తరగి పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత మిక్సీజార్ తీసుకుని అందులోకి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, సోంపు లేదా జీలకర్ర వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఓ బౌల్లో.. కట్ చేసుకున్న తోటకూర, బియ్యప్పిండి, శనగపిండి, పసుపు, ఉప్పు, కొత్తిమీర తరుగు, రెండు రెమ్మల కరివేపాకు, గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి తోటకూరను గట్టిగా పిండుతూ పిండిని కలుపుకోవాలి. మధ్యమధ్యలో నీళ్లు అవసరమైతే కొద్దికొద్దిగా పోసుకుంటూ పిండిని గట్టిగానే కలుపుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిమొత్తంలో పిండిని తీసుకుని పకోడిలుగా వేసుకోవాలి.
- ఫ్లేమ్‌ను హైలో పెట్టి ఎర్రగా మారేవరకు పకోడీలను వేయించుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని పకోడీలుగా చేసుకోవాలి. ఆ తర్వాత కాగుతున్న నూనెలో పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్ తోటకూర పకోడి రెడీ. సైడ్ డిష్‌గా, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు చేసిపెడితే అద్దిరిపోతుంది. నచ్చితే మీరూ ట్రై చేయండి.
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే "బ్రెడ్ రోల్స్" - ఈ స్టైల్లో చేస్తే ఒక్కటి కూడా విడిచి పెట్టరు!
ఈవెనింగ్ స్నాక్స్‌గా "ఉల్లి వడలు" - ఇలా ప్రిపేర్ చేశారంటే పకోడిని మించిన టేస్ట్!