How to Make Paneer Jalebi: మరికొన్ని రోజుల్లో దీపావళి రానుంది. ఈ క్రమంలో చాలా మంది స్వీట్స్ చేస్తుంటారు. అయితే స్వీట్స్‌లలో ఎక్కువ మంది జిలేబీ చేస్తుంటారు. ఇక జీలేబీ అంటే మినపప్పు, మైదాతో చేస్తుంటారని తెలుసు. కానీ పనీర్‌తో కూడా జిలేబీ చేసుకోవచ్చు. ఏంటీ పనీర్‌తో కూరలు చేసుకోవచ్చని తెలుసు కానీ.. జిలేబీ కూడా చేసుకోవచ్చా? అని మీకు డౌట్ రావచ్చు. కానీ పనీర్‌తో కూడా అద్దిరిపోయే జిలేబీ ప్రిపర్ చేసుకోవచ్చు. పైగా దీని టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. మరి మీరూ ఈ దీపావళికి జిలేబీ చేయాలనుకుంటే.. ఓసారి పనీర్‌తో ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- చిక్కటి పాలు - లీటరున్నర
- నీళ్లు - పావు కప్పు
- వెనిగర్- పావు కప్పు
- పంచదార - 2 కప్పులు
- నీరు - అర కప్పు
- ఆరెంజ్ ఫుడ్ కలర్ - చిటికెడు
- యాలకుల పొడి - అర టీ స్పూన్
- మైదా - 2 టేబుల్ స్పూన్లు
- కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు
- బేకింగ్ సోడా - చిటికెడు
తయారీ విధానం:
- ముందుగా నీళ్లు, వెనిగర్ సమపాళ్లలో కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి చిక్కటి పాలు పోసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టి గరిటెతో కలుపుతూ పాలు ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి.
- పాలు ఒక పొంగు వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ముందే కలిపి పెట్టుకున్న వెనిగర్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఇలా వెనిగర్ పోస్తే పాలకు పాలు, నీళ్లకు నీళ్లు సెపరేట్ అవుతాయి. అప్పుడు ఓ 5 నిమిషాలు వదిలేయాలి.
- ఆ తర్వాత విరిగిన పాల మిశ్రమాన్ని ఓ తెల్లటి కాటన్ క్లాత్లోకి తీసుకుని దానిని జల్లెడలో పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోకి చల్లటి నీళ్లు పోసుకుంటూ పనీర్‌ను ఆ క్లాత్‌లోనే కడగాలి.
- కడిగిన పనీర్‌ను గట్టిగా పిండాలి. అయితే అప్పటికీ అందులో కొద్దిగా నీరు అనేది ఉంటుంది. కాబట్టి పూర్తి నీరు పోయేందుకు పనీర్ మిశ్రమం ఉన్న క్లాత్‌ను ఓ 20 నిమిషాలు వేలాడదీయాలి. ఇలా చేస్తే అందులో ఉన్న నీరు పూర్తిగా తొలగిపోతాయి.
- ఈలోపు పంచదార పాకం సిద్ధం చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పంచదార పోసుకోవాలి. అందులోకి అరకప్పు నీళ్లు పోసుకుని పంచదారను కలుపుకోవాలి.
- పంచదార కరిగి ఆముదం లాంటి జిగురు వచ్చే వరకు కలుపుతూ మరిగించాలి.
- అనుకున్న పాకం వచ్చిన తర్వాత అందులోకి ఫుడ్ కలర్, యాలకుల పొడి వేసి కలిపి దించేసి పక్కకు పెట్టాలి.
- ఇప్పుడు పనీర్ ముద్దను ఓ ప్లేట్లోకి తీసుకుని చేతి మణికట్టు సాయంతో ఓ నాలుగు నిమిషాలు బాగా నలుపుకోవాలి.
- ఇప్పుడు అందులోకి మైదా, కార్న్‌ఫ్లోర్ వేసి పనీర్‌లో బాగా కలిసేలా ఒత్తుకోవాలి.
- ఇప్పుడు ఓ గిన్నెలోకి బేకింగ్ పౌడర్, టీస్పూన్ నీళ్లు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పనీర్‌లో పోసి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు ఇందులోకి రెండు మూడు టేబుల్స్పూన్ల నీళ్లు పోసి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ కాస్త చిక్కగానే ఉండాలి.
- ఇప్పుడు పైపింగ్ బ్యాగ్సో నాజిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ పైపింగ్ బ్యాగ్‌లోకి పనీర్ మిశ్రమాన్ని కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని క్లోజ్ చేసి నాజిల్ ఉన్న సైడ్ పైపింగ్ బ్యాగ్ చివర కట్ చేయాలి.
- ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత పైపింగ్ బ్యాగ్ సాయంతో పనీర్ మిశ్రమాన్ని నూనెలోకి జిలేబీలుగా ఒత్తుకోవాలి.
- ఇలా చేసిన జిలేబీలను రెండు వైపులా ఎర్రగా కాల్చి.. ముందే ప్రిపేర్ చేసుకున్న పంచదార పాకంలో వేసుకోవాలి. ఓ ముప్పై సెకన్ల తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పనీర్ జిలేబీ రెడీ!!
దీపావళి స్పెషల్ : నోట్లో వేసుకుంటే కరిగిపోయే "పెసరపప్పు హల్వా" - సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోండిలా!
స్వీట్ లవర్స్ ఫేవరెట్ - వందల ఏళ్ల నాటి "పాల పూరీలు" - ఇలా చేస్తే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం!
మరమరాలతో చాట్ రొటీన్ - ఇలా సూపర్ "బర్ఫీ" చేయండి - టేస్ట్ అద్దిరిపోతుంది!