Spongy Idly Preparation Tips : చాలా మంది ఉదయాన్నే ఎంతో ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలలో ఇడ్లీలు కూడా ఒకటి. సాఫ్ట్‌గా, లైట్‌గా ఉండడంతో పాటు, ఆరోగ్యానికి మంచిదని వీటిని తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇంట్లో రెగ్యులర్‌గా ఇడ్లీలు చేస్తుంటారు. అయితే, ఇంట్లో చేసినప్పుడు ఇడ్లీలు సాఫ్ట్‌గా కాకుండా, కొద్దిగా గట్టిగా వస్తుంటాయి. దీంతో కొంతమంది వీటిని చేయడానికి కాస్త వెనకడుగు వేస్తారు. అయితే, ఈ స్టోరీలో చెప్పిన విధంగా కొన్ని టిప్స్, కొలతలు పాటిస్తూ చేసుకుంటే హోటల్ మాదిరిగా ఎంతో మృదువుగా వస్తాయి. అలాగే ఇడ్లీ పిండి త్వరగా పులిసిపోకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఇడ్లీలు సాఫ్ట్‌గా రావడానికి పిండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
- మినప్పప్పు-కప్పు
- సన్నని ఇడ్లీ రవ్వ-2 కప్పులు
- మెంతులు-2 టీస్పూన్లు
ఇడ్లీలు మృదువుగా రావడానికి పిండి ఇలా ప్రిపేర్ చేసుకోండి..
- ముందుగా మినప్పప్పును రెండు మూడుసార్లు బాగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే మెంతులను కూడా కడిగి మినప్పప్పులో వేసుకుని నీళ్లు పోసుకోవాలి. 4 నుంచి 5 గంటల పాటు మినప్పప్పు నానబెట్టుకోవాలి. ఇంకా ఎక్కువ సేపు నానబెట్టుకున్నా మంచిదే.
- ఇడ్లీ పిండిలో కలపడానికి సన్నని రవ్వను తీసుకోండి. ఈ రవ్వలో కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి బాగా కడిగి గంటపాటు నానబెట్టండి.
- ఇప్పుడు మిక్సీ గిన్నెలో నానిన మినప్పప్పు వేసుకోవాలి. ఇందులో కొద్దికొద్దిగా కూల్ వాటర్ యాడ్ చేసుకుంటూ.. మినప్పప్పు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇడ్లీ పిండి మరీ పల్చగా, గట్టిగా ఉండకుండా నీళ్లను యాడ్ చేసుకోవాలి.
- గ్రైండ్ చేసుకున్న మినప్పప్పుని ప్లాస్టిక్ కంటైనర్‌లోకి తీసుకోండి. ఇడ్లీ పిండి ప్లాస్టిక్ కంటైనర్‌లో పెట్టుకోవడం వల్ల తాజాగా ఉంటుంది. అలాగే తొందరగా పులియకుండా ఉంటుంది.
- తర్వాత ఇడ్లీ రవ్వని చేతితో నీళ్లు లేకుండా పిండి.. మినప్పప్పు పిండిలో కలుపుకోండి. ఇడ్లీ రవ్వ, పిండి బాగా కలిసేలా కలిపి మూత పెట్టండి.
- మీరు ఉదయం చేసుకోవాలనుకుంటే ఈ పిండిని మొత్తం రాత్రే ప్రిపేర్ చేసుకోవాలి. సుమారు 8 గంటల తర్వాత ఇడ్లీ పిండి చక్కగా పులిసిపోతుంది. ఇడ్లీ పిండి పొంగితే, బాగా పులిసిందని అర్థం.
- ఇడ్లీలు చేసుకునే ముందు పిండిని అవసరమున్నంత తీసుకుని.. అందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. మిగతా పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి.
- ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకుని అందులోకి కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి. లేదంటే వైట్ కాటన్ క్లాత్ తీసుకుని బాగా తడిపి పిండి ఇడ్లీ ప్లేట్లలో పెట్టి పిండి వేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్ రెడీ చేసుకోవాలి.
- ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో కొద్దిగా నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్లు పెట్టి స్టవ్‌ను మీడియంలో పెట్టి ఓ 5 నిమిషాలు, సిమ్‌లో పెట్టి మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓ 5 నిమిషాలు వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకుని తింటే సూపర్ సాఫ్ట్ అండ్ టేస్టీగా హోమ్మేడ్ ఇడ్లీలు రెడీ.
- ఈ విధంగా పక్కా కొలతలు, టిప్స్‌తో మీరు ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకుంటే ఎన్ని ఇడ్లీలైనా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు.
- నచ్చితే మీరు కూడా ఇలా ఓ సారి ట్రై చేయండి.
పప్పు నానబెట్టి రుబ్బాల్సిన పనే లేదు - ఈ పదార్థాలతో నిమిషాల్లో అతి మృదువైన ఇడ్లీలు రెడీ!
ఇడ్లీ/దోశ పిండి బాగా పులిసిపోయిందని పారేస్తున్నారా ? - ఇలా చేస్తే తాజాగా మారిపోతుంది! -