Sitting All Day Weight Gain : ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు మన జీవితంలో భాగమైపోయాయి. ఈ గ్యాడ్జెట్స్ వాడకుండా ఏ పనైనా చేయడం కష్టం. ఆన్లైన్లో చెల్లింపుల నుంచి మొదలు ఫుడ్ డెలివరీ వరకు ప్రతి ఒక్కదానికి ఇంటర్నెట్పై ఆధారపడాల్సి వస్తోంది. అయితే, రోజంతా కంప్యూటర్ స్క్రీన్లలను చూడడం వల్ల కళ్లపై ఎంత ప్రభావం పడుతుందో మనందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల వెల్లడైన పరిశోధన ప్రకారం.. ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వారు వెల్లడించారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఒక నివేదిక ప్రకారం.. 2024 వరకు భారత్‌లో 75.15 కోట్ల మంది ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది మన జనాభాలో దాదాపు 52.4 శాతం. అయితే, మన దేశంలో చాలా మంది అమెరికా, చైనీయుల కంటే ఎక్కువ సేపు మొబైల్లో మునిగిపోతున్నారు. సగటున చైనాలో 5.3 గంటలు ఫోన్ ఉపయోగిస్తే.. అమెరికాలో 7.1 గంటలు వాడుతున్నారు. కానీ మన దేశంలో మాత్రం సగటున ఒక వ్యక్తి రోజుకి 7.3 గంటలు ఫోన్‌లో గడుపుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మన దేశంలో స్మార్ట్‌ఫోన్ వాడకం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
స్క్రీన్ టైమ్‌కి బరువు పెరగడానికి మధ్య సంబంధం ఏంటి ?
స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల బరువు ఎందుకు పెరుగుతారు.. అనే విషయంపై ఒక పరిశోధనను అమెరికాలో నిర్వహించారు. ఈ పరిశోధన 2017లో "pediatrics" జర్నల్లో ప్రచురితమైంది. ఈ పరిశోధన ప్రకారం.. చిన్నతనంలో రోజుకి రెండుగంటలకి పైగా టీవీ చూడటం వల్ల పెద్దైన తర్వాత ఊబకాయం వచ్చే అవకాశం 17 శాతం ఉందని పరిశోధకులు గుర్తించారు.
అలాగే ఈ రీసెర్చ్‌లో టీవీ ఎక్కువగా చూడటం వల్ల.. 10 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో.. దాదాపు 60 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నట్లు కనుగొన్నారు. అయితే, ఈ పరిశోధన కేవలం టీవీ చూడటంపై జరిగింది. కానీ, ఇప్పుడు ప్రతి ఇంట్లో స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. పిల్లలు సరిగ్గా తినట్లేదని చాలా మంది తల్లిదండ్రులు వారి చేతులకి మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు.
దీన్ని బట్టి చూస్తే పిల్లల్లో ఊబకాయం ఇంకా పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశోధనలో స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీకీ చెందిన "డాక్టర్ థామస్ ఎన్. రాబిన్సన్" పాల్గొన్నారు.
బరువు పెరగడానికి కారణాలు:
- టీవీలు, స్మార్ట్‌ఫోన్లు చూస్తూ తినడం వల్ల ఎంత తింటున్నామో తెలియకుండానే ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. దీనివల్ల క్రమంగా బరువు పెరుగుతారు.
- స్క్రీన్ చూస్తూ తినడం వల్ల ఆహారాన్ని ఎక్కువ సేపు నమలకుండానే మింగుతారు. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే ఆహార పదార్థాలలోని పోషకాలు కూడా సక్రమంగా అందవు.
- అదే పనిగా ఫోన్లు, టీవీలు చూడటం వల్ల అందులో జంక్‌ఫుడ్‌కి సంబంధించిన యాడ్స్ వచ్చినప్పుడు.. మనసులో అవి తినాలని కోరిక కలుగుతుంది. వాటిని ఎక్కువగా తినడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
- ఎక్కువసేపు స్క్రీన్ చూస్తూ కూర్చోవడం వల్ల శరీరంలో క్యాలరీలు బర్న్ కావు. ఇది క్రమంగా ఊబకాయానికి దారితీస్తుంది. ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు, హైపర్ టెన్షన్, గుండె జబ్బులు, మధుమేహం వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.
- ఇంకా ఒంటరిగా కూర్చుని తినే వారు ఫోన్లో మునిగిపోయి.. మెల్లిగా ఎక్కువ ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
- కాబట్టి, భోజనం చేసేటప్పుడు మొబైల్ ఫోన్లు చూడటం తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
హెచ్చరిక : మీ పిల్లలు ఫోన్, టీవీ చూస్తున్నారా? - మెదడుకు ఏం జరుగుతుందో తెలుసా?
ఇండియన్స్ లో అధిక బరువుకు కారణాలు ఇవేనట - వెల్లడించిన రీసెర్చ్!