JOBS IN SBI : చాలా మందికి బ్యాంకుల్లో ఉద్యోగం లక్ష్యంగా పెట్టుకుంటారు. అలాంటి లక్ష్యంతో ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా 1511 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎస్‌బీఐలో డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు అభ్యర్థులను నియమించనున్నారు. వీటి కోసం ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ రిక్రూట్‌మెంట్‌లో పోస్టులు, అభ్యర్థుల అర్హతలు, ఫీజు వివరాలు తెలుసుకుందామా?
స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాలలో B.Tech లేదా B.E. డిగ్రీ కలిగి ఉండాలి. ఈ పోస్టుల కోసం ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 1511 ఖాళీలలో 1497 సాధారణ ఖాళీలు, 14 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉండగా.. అక్టోబర్ 4, 2024 వరకు sbi.co.inలో దరఖాస్తు చేసుకునే వీలుంది.
వయో పరిమితి వివరాలివీ..
డిప్యూటీ మేనేజర్ పోస్ట్‌కి వయోపరిమితి 25 - 35 సంవత్సరాలు, అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ 21 నుంచి 37 సంవత్సరాలుగా నిర్ణయించారు. 2024 జూన్ 30 వయస్సును లెక్కగటి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక ఎలా ఉంటుందంటే?
డిప్యూటీ మేనేజర్ పోస్టు పరీక్ష షార్ట్‌లిస్టింగ్-కమ్-టైర్డ్/లేయర్డ్ ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా, అర్హత మార్కులను బ్యాంక్ నిర్ణయిస్తుంది. మార్కుల ఆధారంగా మాత్రమే ఎంపిక ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే కటాఫ్ మార్కులు సాధించినట్లయితే వయస్సు ప్రకారం ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ ఆధారంగా మార్కులు
ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ప్రకారం అసిస్టెంట్ మేనేజర్ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. నవంబర్ నెలలో రాత పరీక్ష ఉండొచ్చు. పరీక్ష వ్యవధి 75 నిమిషాలు కాగా, 60 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 100. ఆన్‌లైన్ రాత పరీక్ష మార్కుల ఆధారంగా బ్యాంక్ కేటగిరీల వారీగా నిర్ణయించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి ఎంపిక అవుతారు. ఇంటర్వ్యూ మార్కులు 25.
దరఖాస్తు ఫీజు జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించే వీలుంది. అదనపు సమాచారం కోసం SBI sbi.co.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
పోస్టుల వివరాలివీ...
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్) – ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ & డెలివరీ: 187 ఖాళీలు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్) – ఇన్‌ఫ్రా సపోర్ట్ & క్లౌడ్ ఆపరేషన్: 412 ఖాళీలు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్) - నెట్‌వర్కింగ్ ఆపరేషన్: 80 ఖాళీలు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్) - IT ఆర్కిటెక్ట్: 27 ఖాళీలు
డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్) - ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 7 ఖాళీలు
అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్) - 784 ఖాళీలు