Tips to Remove Humidity from Home: వర్షాకాలంలో తరచూ కురిసే చిరుజల్లులు, భారీ వర్షాల కారణంగా ఇంట్లో తేమ అధికంగా ఉంటుంది. దీని కారణంగా గోడలు, స్లాబుల మీద చెమ్మగా ఉంటుంది. అంతేనా తేమ వల్ల గోడలపై ఫంగస్ పెరగడం, వస్తువులు బూజు పట్టడం జరుగుతుంది. దీంతో కొన్నిసార్లు మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇక చాలా మంది ఈ సమస్య నుంచి బయటపడేందుకు క్లీనర్స్ ఉపయోగిస్తుంటారు. అయితే అవేమి లేకుండా కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల సులభంగా ఇంట్లోని తేమను దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
కిటికీలు, తలుపులు తెరవండి : కొంతమంది వర్షాకాలంలో చల్లని గాలి వస్తుందని ఇంట్లోని కిటికీలు, తలుపులు అన్నీ మూసేస్తారు. దీనివల్ల తేమ పెరిగిపోతుంది. అందుకే గాలి ధారాళంగా ప్రసరించేందుకు కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ మొక్కలతో మేలు!: ఇండోర్ మొక్కలు వాతావరణంలోకి తేమను ఎక్కువగా విడుదల చేస్తాయి. వీటివల్ల ఇంట్లో హ్యుమిడిటీ స్థాయులు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వర్షాకాలంలో ఇంట్లో మొక్కలు లేకుండా చూసుకోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఒకవేళ అంతగా పెంచుకోవాల్సి వస్తే కలబంద, స్నేక్ ప్లాంట్, కాక్టీ, స్పైడర్ ప్లాంట్, పీస్ లిల్లీ.. వంటివి ఎంపిక చేసుకోవడం మంచిదంటున్నారు. ఎందుకంటే ఇవి ఇంట్లో తేమ స్థాయుల్ని క్రమబద్ధీకరిస్తాయని సూచిస్తున్నారు.
- ఇక ఇంట్లో అధికంగా తేమ ఉండే ప్రదేశాల్లో బాత్రూమ్ ఒకటి. గదిలో వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల తేమ ఎక్కువగా ఉంటుంది. అయితే, తేమ దూరమవడానికి షవర్‌ని తక్కువగా ఉపయోగించడం లేదంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ని ఉపయోగించడం.. వంటి చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
- వంటింట్లో వాడే టవల్స్, మనం ఉపయోగించే టవల్స్, ఇతర దుస్తులు.. వంటివన్నీ పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఇవి తడిగా ఉంటే వాటిని ఇంట్లో కాకుండా ఆరుబయట ఆరేయాలంటున్నారు.
- వర్షాకాలంలో షూస్, బ్యాగ్స్ నుంచి ఒకరకమైనటు వంటి దుర్వాసన వస్తుంటుంది. అయితే, కొన్నిసార్లు తేమ అధికంగా ఉండడం వల్ల కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఈ సమస్యకి చెక్ పెట్టాలంటే.. బ్యాగ్స్, షూస్.. వంటి వాటిలో ఉన్న తేమను తొలగించడానికి సిలికా జెల్ ప్యాకెట్లను ఉపయోగించమని చెబుతున్నారు.
- తేమ ఎక్కువగా ఉండడం వల్ల ఇంటి మూలలు, అల్మరా మూలల్లో ఫంగస్ పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి, ఆ ప్రదేశాల్లో రాక్‌సాల్ట్, బేకింగ్ సోడా.. వంటి వాటిని మూటగట్టి పెట్టాలి. ఇలా చేస్తే ఇంట్లో తేమ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ టిప్స్ పాటించడం వల్ల ఇంట్లో తేమను దూరం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
వర్షాకాలంలో పానీపూరీ తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా ?
సింపుల్ టిప్స్ : వర్షాకాలంలో దుస్తులు త్వరగా ఆరడం లేదా? - ఇలా చేస్తే ఫాస్ట్‌గా ఆరతాయి!