Reasons for Delayed Speech in 4 Year Old : ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ సందడి వేరుగా ఉంటుంది. వారి నవ్వులు, ముద్దుముద్దు మాటలతో కుటుంబ సభ్యులందరూ ఎన్ని కష్టాలైనా మర్చిపోయి హాయిగా నవ్వుకుంటారు. సాధారణంగా ఏడాది వయసు నుంచి చిన్న పిల్లలు తాత, అత్త అంటూ చిన్నచిన్న పదాలు పలుకుతూ ఉంటారు. రెండేళ్ల తర్వాత మాటలు బాగా వస్తాయి. కానీ, కొంతమంది పిల్లలు నాలుగేళ్లయినా కూడా అమ్మ, అత్తలాంటి పదాలే తప్ప మిగతా మాటలు పలకరు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అయితే, పిల్లలకు మాటలు రాకపోవడానికి కారణాలు ఏంటి ? మాటలు త్వరగా రావడానికి ఏమైనా స్పీచ్ థెరపీలు చేయాల్సి ఉంటుందా ? అనే ప్రశ్నలకు ప్రముఖ మానసిక నిపుణురాలు 'డాక్టర్ మండాది గౌరీదేవి' ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
పిల్లల్లో మెదడు అభివృద్ధి ఎక్కువగా ఐదేళ్లలోపు జరుగుతుంది. ఈ క్రమంలోనే మాటలు నేర్చుకోవటం, తమ పనులు తాము చేసుకోవటం వంటివన్నీ దశల వారీగా జరుగుతుంటాయి. అయితే, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పోషకాహారం తీసుకోకపోయినా, జన్యులోపాలున్నా, డెలివరీ టైమ్లో శిశువు మెదడుకి దెబ్బ తగిలినా లేదా పుట్టిన తర్వాత బిడ్డలో బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్లు, పచ్చకామెర్లు లాంటివి వచ్చినా న్యూరో డెవలప్‌మెంటల్ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల మాటలు రావడం, శారీరక ఎదుగుదల వంటివి లేట్ కావొచ్చు.
"పిల్లల్లో బుద్ధి మాంద్యతకు సంబంధించి లోపాలుంటే దానిని 'గ్లోబల్ డెవలప్‌మెంటల్ డిలే' అని పిలుస్తారు. దీనివల్ల శారీరకంగా, మాటల పరంగానూ లోపాలు కనిపిస్తాయి. అయితే, కొంతమంది పిల్లలకు మాటలు మాత్రమే ఆలస్యమవుతాయి. దానిని 'స్పెసిఫిక్ స్పీచ్ డిలే' అంటారు. చిన్నపిల్లల్లో మాటలు, కలివిడితనం, చుట్టుపక్కల విషయాలకు స్పందించటం లాంటివి లోపిస్తే 'ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్' గా పరిగణిస్తారు." - డాక్టర్ మండాది గౌరీదేవి (మానసిక నిపుణురాలు)
పిల్లలకు మాటలు లేట్ అవ్వడానికి ఈ మూడింటిలో ఏ కారణమైనా అయి ఉండొచ్చు. కాబట్టి, పిల్లలకు మాటలు రావడం ఆలస్యమైతే వెంటనే పిల్లల మానసిక నిపుణులను కలవండి. వైద్యులు పుట్టిన దగ్గర్నుంచీ ఇప్పటివరకూ పిల్లల ఎదుగుదల ఎలా ఉందో తెలుసుకుంటారు. స్పీచ్ అసెస్‌మెంట్, డెవలప్‌మెంటల్, ఆటిజం వంటివి టెస్ట్ చేస్తారు. ఒకవేళ ఏమైనా థెరపీలు అవసరమైతే సూచిస్తారని మండాది గౌరీదేవి చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
'మా వారు అప్పుడే కోపంగా, అంతలోనే ప్రశాంతంగా మారిపోతారు!'- ఆయన సమస్య పిల్లలకు వస్తుందా ?