How to Make Ragi Bellam Cake at Home: కేక్.. ఈ పేరు వినగానే చాలా మందికి ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఇక పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. ఎందుకంటే సాఫ్ట్‌గా ఉండే ఈ కేక్‌ను అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది. అందుకే.. వేడుక ఏదైనా కేక్ మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే.
అయితే.. పదేపదే బేకరీల్లో లభించే కేక్ తింటే హెల్త్ పాడవడం ఖాయం. ఎందుకంటే.. ఆ కేక్ తయారీకి మైదా, పంచదార, ఇంకా ఇతర స్వీటనర్లు వాడుతుంటారు. దీనివల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇంట్లోనే కేక్ హెల్దీగా తినాలనుకునేవారి కోసం అద్దిరిపోయే రెసిపీ తీసుకొచ్చాం. ఇందులో మైదా, పంచదార అస్సలు వాడటం లేదు. ఆరోగ్యాన్నిచ్చే బెల్లం, రాగి పిండి ఉపయోగించి ఎంతో రుచికరంగా తయారు చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా మరెంతో హెల్దీగా ఉండే రాగి బెల్లం కేక్‌కు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
- చిలికిన పెరుగు - అర కప్పు
- బెల్లం తురుము - అర కప్పు
- బటర్ - 2 టేబుల్ స్పూన్లు
- వెనీలా ఎసెన్స్ - అర టీ స్పూన్
- రాగి పిండి - 1 కప్పు
- కోకో పౌడర్ - 2 టేబుల్ స్పూన్లు
- బేకింగ్ పౌడర్ - 1 టీ స్పూన్
- బేకింగ్ సోడా - అర టీ స్పూన్
- పాలు - 2 టీ స్పూన్లు
- బటర్ పేపర్ - 1
- జీడిపప్పు - 10
తయారీ విధానం:
- ముందుగా కేక్ ప్రిపేర్ చేసుకునే గిన్నెలో బటర్ పేపర్ పెట్టి చుట్టూ నూనె అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు మరో బౌల్ తీసుకుని అందులోకి చిలికిన పెరుగు, బెల్లం తురుము, కరిగించిన బటర్, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.
- ఓ 5 నిమిషాల తర్వాత మరోసారి కలిపిన జల్లించిన రాగి పిండి, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి.
- ఆ తర్వాత పాలు పోసి మరోసారి కలిపి ముందుగానే సిద్ధం చేసుకున్న కేక్ మౌల్డ్‌లో పోసుకోవాలి.
- ఇలా పోసుకున్న తర్వాత గిన్నెను ఓసారి టాప్ చేయాలి. ఇలా చేయడం వల్ల పిండి మధ్యలో గాలి లేకుండా ఉంటుంది.
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్‌లో పెట్టి కుక్కర్ పెట్టి అందులో ఉప్పు పోసి ఓ స్టాండ్ పెట్టి పావు గంట సేపు హీట్ చేయాలి.
- కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఆ స్టాండ్ మీద కేక్ మౌల్డ్ పెట్టుకుని బెల్టు, విజిల్ తీసేసిన కుక్కర్ మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో సుమారు 35 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి.
- 35 నిమిషాల తర్వాత మూత తీసి ఓ చాకు లేదా టూత్‌పిక్‌ను గుచ్చితే వాటికి పిండి అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయినట్లే.
- ఒకవేళ ఏమైనా అంటుకుంటే మూత పెట్టి మరో 5 నిమిషాలు బేక్ చేసుకోవాలి.
- చల్లారిన తర్వాత కేక్‌ను ఓ ప్లేట్లోకి తిప్పి పైన జీడిపప్పులతో డెకరేట్ చేసి తింటే టేస్టీగా, హెల్దీగా ఉండే రాగి బెల్లం కేక్ రెడీ.
- నచ్చితే మీరూ మీ పిల్లలకు ప్రిపేర్ చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. పైగా ఇది ఆరోగ్యం కూడా..
ఓట్స్‌తో ఈ బ్రేక్‌ఫాస్ట్ ట్రై చేశారంటే - ఫ్యామిలీ మొత్తం ఫిదా అవ్వాల్సిందే!
మీ పిల్లలకు కేక్స్ అంటే ఇష్టమా? - అయితే నోరూరించే ఎగ్‌లెస్ రవ్వ కేక్ ఇంట్లోనే తయారు చేసేయండిలా!