How to Make Patiyala Chicken Recipe : దసరా వచ్చిదంటే చాలు.. ప్రతి ఇంటా జరిగే సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ పండగ వేళ మాంసాహారం తినే ప్రతి ఇంటా నాన్‌వెజ్ వంటకాలు ఘుమఘుమలాడాల్సిందే. ఈ విందు భోజనాల వేళ మీకోసం స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "పంజాబీ స్టైల్ పటియాలా చికెన్ కర్రీ". దీన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు. అంత రుచికరంగా ఉంటుంది! మరి, ఈ సూపర్ టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- చికెన్ - అరకిలో
- నూనె - పావు కప్పు
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
- దాల్చినచెక్క ముక్కలు - 2
- యాలకులు - 2
- బిర్యానీ ఆకు - 1
- లవంగాలు - 5
- మిరియాలు - అర టీస్పూన్
- ఉల్లిపాయ - 1(పెద్ద సైజ్)
- టమాటాలు - 3
- వేయించిన జీలకర్ర పొడి - 1 టీస్పూన్
- కారం - 1 టేబుల్‌స్పూన్
- పసుపు - పావు టీస్పూన్
- పెరుగు - 1 కప్పు
- కసూరి మేతి - 1 టేబుల్ స్పూన్
"ఆంధ్ర స్టైల్ మటన్ మసాలా" కర్రీ - ఒక్కసారి ఇలా చేసి చూడండి! - టేస్ట్ అద్దిరిపోతుంది!
పచ్చిమిర్చి పేస్ట్ కోసం :
- అల్లం - అంగుళం ముక్క
- వెల్లుల్లి - 10 నుంచి 12
- పచ్చిమిర్చి - 5
చికెన్ మారినేషన్ కోసం :
- కారం - 1 టేబుల్‌స్పూన్
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావు టీస్పూన్
- నెయ్యి/నూనె - 2 టీస్పూన్లు
ఫైనల్ తడ్కా కోసం :
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- నెయ్యి - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర - అరటీస్పూన్
- సన్నని వెల్లుల్లి తరుగు - 1 టీస్పూన్
- పచ్చిమిర్చి - 2
- ఉల్లిపాయ - 1(చిన్నది)
- క్యాప్సికం క్యూబ్స్ - 12
- జీడిపప్పు పేస్ట్ - 3 టేబుల్ స్పూన్లు
- బటర్ - 1 టేబుల్ స్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
తయారీ విధానం :
- ముందుగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్‌ను ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం.. మిక్సీజార్‌లో అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చిని తుంపి వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని శుభ్రంగా కడిగిన చికెన్ వేసుకోవాలి. ఆపై అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు వేసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. అలాగే.. నెయ్యి/నూనె వేసి కలిపి ఒక గంటపాటు అలా వదిలేయాలి.
- ఆలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, టమాటాలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- గంట తర్వాత స్టౌపై అడుగు మందంగా ఉండే పాన్ పెట్టుకొని ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. ఆ మిశ్రమం కాస్త వేడి అయ్యాక.. దాల్చినచెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు వేసి 30 సెకన్ల పాటు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కాస్త మెత్తబడి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
- ఆనియన్స్‌ను ఆవిధంగా వేయించుకున్నాక.. వేయించిన జీలకర్ర పొడి, కారం, పసుపు వేసి మసాలాలు మాడకుండా కాసేపు ఫ్రై చేసుకోవాలి.
- తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అందులో వేసి అవి పూర్తిగా మెత్తబడే వరకు వేయించుకోవాలి.
- టమాటాలు మంచిగా వేగి గుజ్జుగా మారాయనుకున్నాక.. అందులో నుంచి సగం టమాటా మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
గోంగూరతో చికెన్ కర్రీ మాత్రమే కాదు బిర్యానీ చేయవచ్చు - ఇలా ప్రిపేర్ చేయండి - టేస్ట్ సూపర్!
- అనంతరం మిగిలిన టమాటా మిశ్రమంలో.. మారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి హై ఫ్లేమ్ మీద 3 నుంచి 4 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత పావు కప్పు వాటర్ పోసి వేయించుకుంటే అడుగు మాడకుండా చికెన్ మంచిగా వేగుతుంది.
- చికెన్‌లో నీరు ఇగిరిపోయి ఆయిల్ తేలడం స్టార్ట్ అయ్యాక.. పెరుగుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టౌను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూతపెట్టి సుమారు 10 నుంచి 12 నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
- ఆవిధంగా మగ్గించుకున్నాక.. అందులో కసూరి మేతిని నలిపి వేసుకోవాలి. ఆపై ఒకటిన్నర కప్పుల వరకు వేడి నీరు యాడ్ చేసుకొని కలిపి నూనె తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టౌను లో ఫ్లేమ్‌లో ఉంచి అలా వదిలేయాలి.
- ఇప్పుడు మరో బర్నర్ మీద.. పాన్ పెట్టుకొని నూనె, నెయ్యి వేసుకోవాలి. ఆ మిశ్రమం బాగా వేడెక్కాక.. జీలకర్ర, సన్నని వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగు వేలి వెల్లుల్లి ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి.
- అప్పుడు అందులో పెద్ద పాయలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికం క్యూబ్స్ వేసుకొని అవి రంగుమారేంత వరకు వేయించుకోవాలి. అంతేకానీ.. మరీ మెత్తగా వేయించుకోకూడదు.
- ఆ తర్వాత.. జీడిపప్పు పేస్ట్ వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఇది మంచిగా వేగిందనుకున్నాక.. పక్కకు తీసుకొని పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని అందులో వేసి కలుపుకోవాలి. ఆపై అరకప్పు వేడి వాటర్ పోసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆ విధంగా ఉడికించుకున్నాక.. స్టౌ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని మరో బర్నర్ మీద సిమ్‌లో ఉంచిన చికెన్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి.
- ఆపై మీడియం ఫ్లేమ్ మీద ఒక నిమిషం పాటు ఉడికించాక.. బటర్, కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. జబర్దస్త్ టేస్టీగా ఉండే "పంజాబీ స్టైల్ పటియాలా చికెన్ కర్రీ" రెడీ!
- దీన్ని బటర్ నాన్, చపాతీ, రోటీలు, పులావ్‌తో కలిపి తింటుంటే ఆ టేస్ట్ సూపర్‌గా ఉంటుంది!