Good Parenting Tips : చిన్నతనంలో పిల్లలు రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు. కొందరు పిల్లలు అల్లరి చేష్టలు ఎక్కువగా చేస్తుంటారు. మరికొందరు.. మొండిగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు మాత్రం ఇంట్లో అందరితో సాధారణంగా ఉంటూ.. ఎవరైనా ఇంటికి వస్తే బయటకు రాకుండా సిగ్గుతో దాచుకుంటుంటారు. ఇంటికి చుట్టాలు, అమ్మనాన్న కోసం స్నేహితులు వచ్చినప్పుడు.. వారిని చూసి బిడియంతో గది నుంచి బయటకు రారు.
మీ పిల్లలు కూడా ఇంట్లో అందరితో సాధారణంగా ఉంటూ.. ఇతరుల ఎదుట ఇలా బిడియపడుతుంటే వెంటనే గుర్తించి ఆ లక్షణాన్ని దూరం చేయడానికి ప్రయత్నించాలంటున్నారు మానసిక నిపుణులు. లేదంటే.. ఆ లక్షణం పిల్లల్లో పెరిగి పెద్దదై.. ఇంట్రావర్ట్‌లుగా మార్చే ప్రమాదం ఉంటుందంటున్నారు. అయితే, పిల్లల్లో అలాంటి లక్షణం పోగొట్టాలంటే పేరెంట్స్‌గా ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇతరులతో పోల్చడం చేయరాదు : పిల్లల్లో ఇలాంటి లక్షణం రాకుండా ఉండాలంటే ఇతరులతో పోల్చడం అస్సలు చేయొద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇలా చేయడం ద్వారా వారికంటే తాము తక్కువనే భావన పిల్లల్లో ఏర్పడుతుంది. అంతేకాదు.. ఇతరులతో పోల్చడం, చదువులో లేదా చురుకుదనంలో అవతలి వారికన్నా తక్కువ అన్నట్లు విమర్శించడం వంటివన్నీ పిల్లల్లో ఆత్మన్యూనత భావాన్ని పెంచుతాయంటున్నారు. దాంతో వారు అందరి ముందుకు రావడానికి సిగ్గుపడతారు. కాబట్టి.. అలా కాకుండా పిల్లలు తమలోని భావోద్వేగాలను గుర్తించడానికి, వాటిని బహిర్గతం చేయడానికి పేరెంట్స్‌గా మీరు వారికి సహాయపడాలని సూచిస్తున్నారు.
మీ పిల్లలు దూకుడుగా వ్యవహరిస్తున్నారా? - ఈ టిప్స్‌తో సెట్ చేయండి - లేదంటే ఇబ్బందులే!
ఫ్రెండ్లీగా ఉండాలి : నేటి రోజుల్లో చాలా మంది పేరెంట్స్ ఉద్యోగ, వ్యాపార పనుల వల్ల గజిబిజి జీవితం గడుపుతున్నారు. దాంతో.. పిల్లలు ఏదైనా సమస్య గురించి చెప్పినా కసురుకుంటుంటారు. కానీ, అలాకాకుండా.. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటూ ఎప్పటికప్పుడు వాళ్ల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకోవాలి. ఆ తర్వాత వాటికి పరిష్కార మార్గాలు చూపించి అధిగమించేలా చేయాలి. ఇలా చేయడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందడంతో పాటు నలుగురితో కలివిడిగా ఉండటానికి ఆసక్తి చూపిస్తారంటున్నారు.
నైపుణ్యాలు పెంపొందించాలి : పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారి ఆసక్తులు, అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత పేరెంట్స్‌దే. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటే చిన్నారులు చురుగ్గా మారతారు. కాబట్టి.. వారిలో నైపుణ్యాలు పెంపొందించే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం.. వంటింటి సామాన్లు తెచ్చేటప్పుడు లిస్ట్‌ను పిల్లలకే అందించి పర్యవేక్షించమనాలి.
ఫ్రెండ్స్‌ను ఇంటికి ఆహ్వానించడానికి, వాళ్లతో కలిసి ఆడుకోవడానికి ప్రోత్సహించాలి. అలాగే .. ఏదైనా బుక్స్ చదివాక వాళ్లు చదివిన కథను తిరిగి చెప్పమనాలి. ఇవన్నీ వాళ్ల ఆలోచనాశైలిని బహిర్గతం చేస్తాయి. తోటి పిల్లలతో కలిసి తోటపని చేయించాలి. ఈ అవకాశాలన్నీ పిల్లల్లో సామాజికపరమైన నైపుణ్యాలు మెరుగుపడటానికి దోహదపడతాయి. అంతేకాదు.. బంధువులకు పిల్లలను గౌరవంగా పరిచయం చేస్తే అది వాళ్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఇవన్నీ వాళ్లకు నలుగురితో కలవడమెలాగో నేర్పుతాయని సూచిస్తున్నారు మానసిక నిపుణులు.
మీ పిల్లలు జీవితంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలంటే - అయితే మీరు ఇలా చేయాల్సిందే!