How To Make Soya Chunks Cutlet Recipe : స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకైనా, ఆఫీసుల నుంచి వచ్చిన పెద్దలకైనా.. సాయంత్రం పూట ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తుంది. ఈ క్రమంలో చాలా మందికి ఈవెనింగ్ స్నాక్స్ అనగానే.. ఎక్కువగా పునుగులు, బజ్జీలు, నూడుల్స్, మంచూరియా వంటివి గుర్తుకొస్తాయి. ఎప్పుడూ అవే తిని బోరింగ్ ఫీల్ వస్తుందా? అయితే, మీకోసం అద్దిరిపోయే స్నాక్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. మీల్ మేకర్ కట్లెట్స్. సూపర్ టేస్టీగా ఉంటాయి! ఎంతలా అంటే.. మీల్ మేకర్స్ తినడానికి ఇష్టపడని వారూ ఎంతో ఇష్టంగా తినేస్తారంటే నమ్మండీ! మరి, ఇంకెందుకు ఆలస్యం ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే సోయా కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- మీల్ మేకర్ - 1 కప్పు
- బియ్యపిండి/కార్న్ ఫ్లోర్ - 2 టీస్పూన్లు
- మైదాపిండి - పావుకప్పు
- ఆలుగడ్డలు - 2
- ఉల్లిపాయ - 1
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- పసుపు - పావు టీస్పూన్
- కారం - తగినంత
- ధనియాల పొడి - అర టీస్పూన్
- గరం మసాలా - ముప్పావు టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - తగినంత
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- వేడినీళ్లు - 2 కప్పులు
- తురిమిన బ్రెడ్ పొడి - కొంచెం
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో వేడి నీరు తీసుకొని అందులో కొంచెం ఉప్పు, మీల్ మేకర్లు(Meal Maker) వేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
- ఈలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. అదేవిధంగా బంగాళదుంపలను మెత్తగా ఉడికించి ముద్దలా చేసుకోవాలి.
- ఇప్పుడు బాగా నానిన మీల్ మేకర్లను వేడినీటి నుంచి సపరేట్ చేసుకొని వాటర్ పిండి మరో బౌల్లో వేసుకోవాలి. ఆపై వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని మిశ్రమంలా బ్లెండ్ చేసుకోవాలి.
- తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మీల్ మేకర్ పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరంమసాలా, ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
- అనంతరం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముద్ద, బియ్యపిండిని కూడా అందులో యాడ్ చేసుకొని మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు అందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ కట్లెట్ షేప్‌లో వత్తుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ విధంగా పిండి మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- తర్వాత ఒక చిన్న బౌల్లో మైదాపిండి తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక ప్లేట్లో తురిమిన బ్రెడ్ పొడిని పోసుకొని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కట్లెట్లు ఫ్రై చేసుకునేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి.
- ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్లెట్లను ఒక్కొక్కటిగా మైదా పిండి మిశ్రమంలో ముంచి తీసి తురిమిన బ్రెడ్ పొడిని వాటికి అన్ని వైపులా పట్టించుకొని ప్లేట్లో ఉంచుకోవాలి.
- అనంతరం స్టౌ పై పాన్ పెట్టుకొని వేయించడానికి తగినంత ఆయిల్ పోసుకోవాలి. అది హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ముందుగా ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకున్న కట్లెట్లను వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి.
- ఆపై వాటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే సోయా/మీల్ మేకర్ కట్లెట్లు రెడీ!
ఇవీ చదవండి :
అన్నం మిగిలిపోయిందా? - చీజ్ రైస్ కట్లెట్ చేసేయండి - అద్దిరిపోద్దంతే!