Legal Advice on Family Problem : ఒక జంటకు పెళ్లి అయ్యి రెండేళ్లు. అయితే, అమ్మాయి అమ్మనాన్నలకు మగ సంతానం లేరు. ఇద్దరూ ఆడపిల్లలే. కాబట్టి, పెళ్లిచూపుల్లోనే పేరెంట్స్‌ని చూసుకోవాల్సిన బాధ్యత తనదేనని భర్త, అత్తమామలకు చెప్పింది. అప్పుడు వారు అందుకు ఒప్పుకొన్నారు. కానీ, ఆ సమయంలో ఇందుకోసం అగ్రిమెంట్లు ఏమీ రాసుకోలేదు. కొన్ని రోజులు అంతా సాఫీగానే సాగింది. కానీ, ప్రస్తుతం మాత్రం తన జీతం, ఖర్చులు అన్నింటి మీద ఆంక్షలు పెడుతున్నారు.
పుట్టింటి వారికి ఏ విధంగానూ సాయం చేయనివ్వడం లేదు. పైగా తన వాళ్లను(అమ్మాయి పేరెంట్స్) తన మీద ఆధారపడి బతుకుతున్నారంటూ అందరిలోనూ హేళన చేస్తున్నారు. "ఇది తనకు నచ్చడం లేదని.. ఆడపిల్లలకు అమ్మనాన్నలను చూసుకునే బాధ్యత లేదా? అని న్యాయ నిపుణులు సలహా కోరుతున్నారు ఓ సోదరి. మరి, ఈ సమస్యకు ప్రముఖ న్యాయవాది జి. వరలక్ష్మి ఎలాంటి ఆన్సర్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.
దంపతుల మధ్య తగాదాలకూ ఇవే కారణం!
వివాహిత సొంతంగా సంపాదించిన ఆస్తి ఆమెకు మాత్రమే చెందుతుంది. అయితే, మన హిందూ సంప్రదాయంలో భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తున్నప్పుడు ఇంటి పోషణ భారం అవ్వకుండా ఇద్దరూ కలిసి చూసుకోవాలనే ఒప్పందంతో నడుచుకుంటున్నారు. ఒకరి సంపాదన సరిపోనప్పుడు రెండో వారి ఆదాయం మీద ఆధారపడుతున్నారు. అదంతా భవిష్యత్తు భద్రత కోసం జరుగుతోంది. అయితే, ప్రస్తుతం కుటుంబ అవసరాల్లో ఏసీలు, ఫ్రిజ్.. అన్ని భాగమయ్యాయి. అవి తలకు మించిన భారమై ఇద్దరి సంపాదన కూడా సరిపోని పరిస్థితుల్ని నెలకొంటున్నాయి. ఇవే దంపతుల మధ్య తగాదాలకూ కారణం అవుతున్నాయని చెబుతున్నారు న్యాయ నిపుణురాలు జి. వరలక్ష్మి.
"వయసు మళ్లిన తల్లిదండ్రుల పోషణ బాధ్యత వారి సంతతిదేనని.. హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్‌లోని సెక్షన్ 25 చెబుతుంది. ఇందులో కొడుకు, కూతురు అనే భేదం లేదు. భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్144 ప్రకారం కుమారుడు లేని పక్షంలో.. కుమార్తె సంపాదనపరురాలైతే ఆమె దగ్గర నుంచి కూడా మెయింటెనెన్స్ పొందవచ్చు. అలాగే, ఒకవేళ బిడ్డలు మరణిస్తే.. వారి సంతానం(మనవలు, మనవరాళ్లు), కోడలి నుంచి కూడా మెయింటెనెన్స్ కోరవచ్చు."- జి. వరలక్ష్మి, న్యాయవాది
కోర్టు ఆర్డర్ ఉంటే తప్పకుండా ఇవ్వాల్సిందే!
ఇక.. మీ విషయానికి వస్తే తల్లిదండ్రులను చూసుకోవడానికి అగ్రిమెంట్స్ అవసరం లేదు. బాధ్యత మాత్రమే ఉండాలి. అది మీలో స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి, మీ ప్రాబ్లమ్‌ను అత్తమామలకు అర్థమయ్యేలా చెప్పి.. వారికి ఇంత ఇవ్వదలుచుకున్నానని స్పష్టంగా తెలియజేయండి. అలా చెప్పినా కూడా కుదరదంటే పెద్ద మనుషులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా, మీ అక్కను కూడా కొంత బాధ్యత తీసుకోమని చెప్పండి. ఇన్నీ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోతే అమ్మానాన్నలతో మీ ఇద్దరి మీద మెయింటెనెన్స్ కేసు వేయించండి. కోర్టు ఆర్డర్ ఉంటే తప్పకుండా ఇవ్వాల్సిందే కదా! కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోమని న్యాయవాది జి. వరలక్ష్మి సలహా ఇస్తున్నారు.
Note: ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. న్యాయవాదుల సలహాలు, చట్ట ప్రకారం పాటించాల్సిన సూచనల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత న్యాయవాది సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవీ చదవండి :
"బెట్టింగ్‌లో నా భర్త చేసిన అప్పులు నేను తీర్చాలా?"
'నన్ను పెళ్లి చేసుకున్నాడు - ఇప్పుడు ఆమెతో సహజీవనం చేస్తున్నాడు' - చట్టం ఎలాంటి సాయం చేస్తుంది??