Legal Advice on Family Matters : ప్రతీ ఒక్కరి లైఫ్లో పెళ్లి అనేది చాలా కీలకమైన ఘట్టం. ఇద్దరు మనుషుల మధ్య.. అలాగే రెండు కుటుంబాల మధ్య అనుబంధాన్ని, అప్యాయతని పెంచుతుంది. మరి ఇంత అందమైన అనుబంధాన్ని కలకాలం నిలుపుకోవాల్సి ఉంటుంది. కానీ, కొంతమంది వివిధ కారణాల వల్ల ఇతరుల పట్ల ఆకర్షణకు లోనై వివాహేతర సంబంధాలను కొనసాగిస్తుంటారు. కొన్నాళ్ల తర్వాత భాగస్వామికి విషయం తెలియడంతో కుటుంబంలో విబేధాలు తలెత్తుతుంటాయి. సేమ్ ఇలాంటి పరిస్థితే ఓ మహిళకు ఎదురైంది.
ఇదీ సమస్య..
ఒక జంటకు పెళ్లి అయ్యి పదిహేనేళ్లు. గత కొంత కాలంగా భర్త మరో వివాహితతో కలిసి ఉంటున్నారు. ఆ వివాహిత తన భర్త, పిల్లలకు దూరంగా ఉంటోంది. ఈ విషయం తెలిసిన భార్య.. భర్తను నిలదిస్తే ఇష్టపూర్వకంగా ఇలా కలసి ఉండటం తప్పేం కాదని వాదిస్తున్నాడు. దీంతో నిస్సహాయ స్థితిలో ఆ మహిళ విడాకులు తీసుకోకుండా ఇలా కలసి ఉండడం సరైనదేనా? చట్టం తనకు ఎలాంటి సాయం చేస్తుందని న్యాయ నిపుణుల సలహా కోరుతున్నారు. మరి.. ఈ సమస్యకు ప్రముఖ న్యాయవాది 'జి. వరలక్ష్మి' ఎలాంటి ఆన్సర్ ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో సమాజంలో ఇలాంటి సంఘటనలు మనం చాలా చూస్తున్నాం. అయితే, హిందూ వివాహ చట్టం ప్రకారం.. భార్య ఉండగా మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని డైవోర్స్ తీసుకోవడానికి ఓ కారణంగా చూపించొచ్చు. ఒక జంట చాలా కాలం పాటు ఎటువంటి వివాహబంధం లేకుండా కలిసి జీవించడాన్నే సహజీవనంగా పరిగణిస్తారు. ఇలాంటి బంధంలో ఉన్న జంటలకు చట్టపరమైన హక్కులు ఏమీ ఉండవు.
"సుప్రీంకోర్టు సహజీవనం తప్పుకాదు.. అని ఇచ్చిన తీర్పు కేవలం అవివాహితులకే చెల్లుతుంది. వివాహమై విడాకులు తీసుకోకుండా మరొకరితో కలిసి జీవించడం చట్టబద్ధం కాదు. అలాంటివారికి పుట్టిన పిల్లలకు వారసత్వ హక్కులు రావు. కానీ, ఈ స్త్రీలు, వారి బిడ్డలు.. గృహహింస రక్షణచట్టం కింద మెయింటెనెన్స్‌లకు అర్హులు. అంతేకాదు, భాగస్వాములు సంపాదించుకున్న ఉమ్మడి ఆస్తుల్లో తమ భాగాన్ని కూడా పొందవచ్చు."-జి. వరలక్ష్మి(న్యాయవాది)
భార్య బతికి ఉండి, డైవోర్స్ తీసుకోకుండా వేరొకరితో సహజీవనం చేయడం, సెక్షన్ 494/495 ప్రకారం బైగామి అఫెన్స్ అవుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఉన్న వారు భర్త నుంచి విడాకులు కోరుతూ కేసు వేయొచ్చు. డైవోర్స్ వద్దనుకుంటే.. గృహహింస చట్టం ప్రకారం మనోవేదనకు గురిచేస్తున్నారని నిరూపించవచ్చు. దీనిద్వారా మీకు కావాల్సిన రక్షణ, భరణం, పరిహారం అన్నీ ఈ చట్టం కింద పొందవచ్చు. అయితే, ముందు త్వరగా ఓ లాయర్ని సంప్రదించి వివరాలన్నీ ఇవ్వండి. తప్పక న్యాయం జరుగుతుందని జి. వరలక్ష్మి చెబుతున్నారు.
Note: ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. న్యాయవాదుల సలహాలు, చట్ట ప్రకారం పాటించాల్సిన సూచనల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత న్యాయవాది సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
పాపం.. భర్త చనిపోయాడు - అత్తగారు రాసిచ్చిన భూమిని అడ్డుకుంటున్నారు! - న్యాయ నిపుణుల సమాధానం ఇదే