Best Cooking Hacks to Save Time: ఓ వైపు ఇంటి పని, మరోవైపు ఉద్యోగం, ఇంకోవైపు పిల్లల్ని చూసుకోవడం.. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలంటే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆడవారికి కత్తి మీద సామే! అన్నింటికంటే ముఖ్యంగా చాలా మంది మహిళలు రోజూ చేసే పనే అయినా.. వంట అనగానే నీరసించి పోతారు. అబ్బా.. ఈ ఒక్క పూటకి ఎవరైనా వండి పెడితే బాగుండు అని అనుకునే వారూ లేకపోలేదు. అయితే, వంట పని విషయంలో మరీ ఒత్తిడిగా ఫీలవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్నపాటి టిప్స్ పాటిస్తే.. వంట త్వరగా పూర్తి కావడమే కాకుండా టైమ్ ఆదా అవుతుందని, శ్రమ తగ్గి కాస్త విశ్రాంతి కూడా దొరుకుతుందంటున్నారు నిపుణులు. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చపాతీలు ఇలా చేసుకుంటే మస్త్ టైమ్ ఆదా : చపాతీలను అప్పటికప్పుడు చేసుకోవాలంటే చాలా టైమ్ పడుతుంది. అదే.. ఒకేసారి ఎక్కువమొత్తంలో చేసుకుందామంటే చల్లారిపోయి తినాలనిపించదు.. పైగా గట్టిపడతాయి కూడా! కాబట్టి, ఈసారి అలాకాకుండా ఒకేసారి ఎక్కువమొత్తంలో చేసుకోవాలనుకున్నప్పుడు సెమీ-కుక్‌డ్ రోటీస్ తయారుచేసి పెట్టుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. అంటే.. చపాతీలు(Chapati) ప్రిపేర్ చేసుకొని పూర్తిగా కాల్చకుండా ఇరువైపులా పది సెకన్ల పాటు కాల్చుకొని రూమ్ టెంపరేచర్ వద్ద నిల్వ చేసుకోవాలి. వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు పూర్తిగా కాల్చుకొని వేడివేడిగా తినేయొచ్చు. ఒకవేళ వీటిని ఫ్రిజ్‌లో పెట్టినా గది ఉష్ణోగ్రతకు వచ్చాకే కాల్చుకోవడం బెటర్ అంటున్నారు.
కటింగ్ అంతా ముందు రోజే : వంట టైమ్ ఆదా కావాలంటే మీరు చేయాల్సిన మరో పని.. కూరగాయల్ని ముందురోజే కట్ చేసుకోవాలి. అయితే.. క్యారట్స్, బీన్స్, చిక్కుడు, బీట్‌రూట్, బెండకాయ.. వంటివి ముందురోజు కట్ చేసి పెట్టుకుంటే పర్లేదు. కానీ, వంకాయ, బంగాళాదుంప.. వంటివి రాత్రి కట్ చేసుకుంటే నెక్ట్ డేకి పాడైపోతాయి. కాబట్టి.. ఇవి కాకుండా మిగతా కాయగూరల్ని కట్ చేసి ఫ్రీజర్ బాక్స్‌లు లేదా జిప్పర్ బ్యాగ్స్‌లో పెడితే రెండు మూడు రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయంటున్నారు నిపుణులు.
ఆకుకూరల విషయంలో : కొత్తిమీర, పుదీనా, మెంతి.. వంటివి కట్ చేసుకొని పెట్టుకునే టైమ్ ఉండచ్చు.. ఉండకపోవచ్చు! ఇలాంటి సందర్భంలో.. మట్టి ఉన్నంత వరకు వాటి కాడలు కట్ చేసి.. ఓ గ్లాస్ నీటిలో కాడలు మునిగేలా ఉంచి ఫ్రిజ్‌లో ఉంచండి. లేదంటే హెర్బ్ సేవర్స్‌ని యూజ్ చేయొచ్చు. తద్వారా కొన్ని రోజుల పాటు అవి ఫ్రెష్‌గా ఉంటాయి. ఎప్పుడంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత కూరల్లో తరిగి వేసుకుంటే సరిపోతుంది!
నాన్‌వెజ్ విషయంలో : మాంసంతో చేసే కొన్ని రకాల వంటకాల కోసం వాటిని సన్నటి స్లైసుల్లా చేసుకోవడం సహజమే! ఈ క్రమంలో వాటిని కట్ చేసే ముందు ఓ అరగంట పాటు ఫ్రీజర్‌లో ఉంచితే మంచిది. ఇలా చేయడం ద్వారా అవి జారిపోకుండా, చక్కగా కట్ అవుతాయంటున్నారు నిపుణులు. అలాగే.. కాస్త ఎక్కువసేపు ఉడికిన గుడ్లపై(Eggs) పెంకులు తొలగించడం కష్టమే! అలాంటి టైమ్‌లో గుడ్లను ఉడికించేటప్పుడే ఆ నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా లేదంటే వెనిగర్ వేస్తే పెంకులను తీయడం ఈజీ అవుతుందంటున్నారు.
దోసె/ఇడ్లీ పిండిని ఇలా స్టోర్ చేసుకోండి : చాలా మంది వారానికి లేదంటే మూడు రోజులకు సరిపడా దోసె/ఇడ్లీ పిండి తయారుచేసుకొని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటుంటారు. అయితే.. ఇలా స్టోర్ చేసుకునేటప్పుడు మొత్తం పిండిలో ఉప్పు కలపవద్దు. అప్పుడే అది ఫ్రెష్‌గా ఉంటుంది. డైలీ కావాల్సినంత పిండి తీసుకొని తగినంత ఉప్పు/బేకింగ్ సోడా/ఇతర పదార్థాలు కలుపుకొని వాడుకుంటే సరిపోతుందంటున్నారు.
ఇవేకాకుండా.. జ్యూసులు, స్మూతీస్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రతిసారీ పండ్లను ముక్కలుగా కట్ చేసుకోవడం వీలుకాకపోవచ్చు. అందుకే.. ముందే ఏ పండుకా పండు ముక్కలు చేసుకొని.. వాటిని సెపరేట్‌గా ఫుడ్ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్/ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకోవాలి. అవసరమున్నప్పుడు ఫ్రెష్‌గా ఉపయోగించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
ఇవీ చదవండి :
ఈ టిప్స్ పాటిస్తే - స్టెయిన్లెస్ స్టీల్ గృహోపకరణాలకు మెరుపు గ్యారంటీ!
మరకలు పడి గ్యాస్ స్టవ్ జిడ్డుగా మారిందా? - ఈ టిప్స్‌తో కొత్తదానిలా తళతళా మెరిసిపోద్ది!