How to Make Palak Dosa Recipe : ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో ఒకటి.. పాలకూర. దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో పుష్కలంగా ఉంటాయి. అయితే, చాలా మంది ఎప్పుడూ పాలకూరతో కూరలు మాత్రమే చేస్తుంటారు. కానీ, పిల్లలు పాలకూరతో(Spinach) చేసిన వంటకాలు కొన్నిసార్లు తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా "పాలకూర దోశలు" వేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇవి చూడ్డానికి బాగుండటమేకాదు.. సూపర్ టేస్టీగానూ ఉంటాయి. పైగా వీటికోసం ఎక్కువగా శ్రమించాల్సిన పనిలేదు. చాలా తక్కువ టైమ్‌లో ఇన్‌స్టంట్‌గా ఈ పాలకూర దోశలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతకీ, ఈ దోశల తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాలకూర దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు :
- గోధుమపిండి - రెండు కప్పులు,
- పాలకూర తరుగు - కప్పు
- బియ్యప్పిండి - పావు కప్పు
- ఉప్మారవ్వ - పావు కప్పు
- ఉల్లి తరుగు - పావు కప్పు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- పచ్చిమిర్చి పేస్ట్ - చెంచా
- అల్లం - చెంచా
- జీలకర్ర - చెంచా
- ఉప్పు - రుచికి సరిపడా
- నూనె - తగినంత
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా తాజా పాలకూర, కొత్తిమీర తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తరుక్కోవాలి. అలాగే ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా కొన్ని పచ్చిమిర్చిని తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా తరిగి పెట్టుకున్న పాలకూర, కొత్తిమీరలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం కాస్త పెద్దగా ఉండే ఒక బౌల్లోకి ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి. ఆపై అందులో గోధుమపిండి, బియ్యప్పిండి, రవ్వ, తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లి, దంచిన పచ్చిమిర్చి పేస్ట్, అల్లం, జీలకర్ర.. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మరోసారి మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలిపి దోశ పిండిలా ప్రిపేర్ చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై దోశ పెనం పెట్టుకోవాలి. అది బాగా వేడి అయ్యాక నూనె అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని దోశ వేసుకోవాలి.
- ఆపై దాని మీద ఉల్లి, క్యాప్సికమ్ స్లైసులతో గార్నిష్ చేసుకుంటే చాలు. అంతే.. నోరూరించే పాలకూర దోశ మీ ముందు ఉంటుంది!
- ఈ పాలకూర దోశలను పల్లీ లేదా కొబ్బరి పచ్చడితో తింటే భలే ఉంటాయి. పైగా వీటిని తినడం ద్వారా శరీరానికి కావాల్సిన కొన్ని పోషకాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. మరి, ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓసారి ఇప్పుడే ఈ దోశలను ట్రై చేయండి!
ఇవీ చదవండి :
డయాబెటిస్ బాధితులు 'సోయా దోశ' తినండి - దెబ్బకే షుగర్ కంట్రోల్! - ఇలా ప్రిపేర్ చేసుకోండి!
ఫ్రిడ్జ్‌లో పెట్టినా ఇడ్లీ/దోశ పిండి పులిసిపోతుందా ? - ఈ టిప్స్ పాటిస్తే సరి - పైగా టేస్టీ కూడా!