Rasam Rice Recipe in Telugu: బ్యాచిలర్స్ వంటింటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆ మాటకొస్తే.. ఇంట్లో సమయానికి కూరగాయలు లేనివారంతా ఆ పూటకు బ్యాచిలక్స్ అవస్థలు అనుభవించాల్సిందే. దీంతో.. చాలా మంది బయట కర్రీ పాయింట్లను ఆశ్రయిస్తుంటారు. కానీ.. అక్కడ్నుంచి తెచ్చే కర్రీలో క్వాలిటీ ఎంత ఉంటుందో.. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు.
అందుకే మీకోసం "రసం రైస్" రెసిపీ తీసుకొచ్చాం. దీనిని ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పెళ్లిలలో స్పెషల్‌గా వడ్డిస్తుంటారు. ఇంకా హోటళ్లలో కూడా సర్వ్ చేస్తుంటారు. ఇలాంటి స్పెషల్ రసం రైస్‌ను ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- ఒక కప్పు బియ్యం
- పావు టీ స్పూన్ పసుపు
- 2 టేబుల్ స్పూన్ల పెసర పప్పు
- 2 టేబుల్ స్పూన్ల కంది పప్పు
- ఒక టమాటా ముక్కలు
- 50 గ్రాముల చింతపండు(పావు కప్పు రసం)
- ఒకటిన్నర టేబుల్ స్పూన్ రసం పొడి
- రుచికి సరిపడా ఉప్పు
- 2 టేబుల్ స్పూన్ల నెయ్యి
- 2 చిటికెల ఇంగువా
- ఒక టీ స్పూన్ ఆవాలు
- 2 ఎండు మిరపకాయలు
- ఒక టీ స్పూన్ జీలకర్ర
- 2 పచ్చి మిరపకాయలు
- ఒక రెబ్బ కరివేపాకు
- కొద్దిగా కొత్తిమీర
తయారీ విధానం
- ముందుగా బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి సుమారు గంటపాటు నానబెట్టి పక్కకుపెట్టుకోవాలి.
- అనంతరం పెసరపప్పు, కంది పప్పును కడిగి సుమారు ఓ గంట పాటు నానబెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టౌ వెలిగించి కుక్కర్లో నానబెట్టిన బియ్యం, పసుపు, పెసరపప్పు, కంది పప్పు, టమాటా ముక్కలు, నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్‌లో 4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకుని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
- ఇప్పుడు మరో గిన్నెలో చింతపండు పులుసు, రసం పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
- అనంతరం కుక్కర్ మూత తీసి ఉడికిన అన్నంలో ఈ మిశ్రమం, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలపాలి.
- మరోసారి స్టౌ ఆన్ చేసి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి లో ఫ్లేమ్‌లో కాసేపు ఉడికించుకుని దించేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌ పై మరో గిన్నె పెట్టుకుని తాళింపు కోసం నెయ్యి వేసి వేడిచేసుకోవాలి.
- ఆ తర్వాత ఇంగువా, ఆవాలు వేసి కాసేపు చిటపటలాడించాలి.
- ఇందులోనే ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాళింపును ఎర్రగా వేయించుకుని అన్నంపై పోయాలి.
- ఇప్పుడు కొత్తిమీర తరుగు వేసి తాళింపును బాగా కలిపి సర్వ్ చేసుకుంటే వేడి వేడి రసం రైస్ అద్దిరిపోతుంది.
సొరకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి - వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది! - Sorakaya Pachadi