తెల్ల ఇడ్లీతో షుగర్ సమస్యా! - చక్కటి ఆరోగ్యాన్ని అందించే రాగి ఇడ్లీ - ఇలా ప్రిపేర్ చేసుకోండి! - Instant Ragi Idli Recipe in Telugu - INSTANT RAGI IDLI RECIPE IN TELUGU
Instant Ragi Idli Recipe in Telugu: ఇడ్లీ అనగానే అందరికీ తళతళా మెరిసిపోయే తెల్ల ఇడ్లీ మాత్రమే గుర్తొస్తుంది. కానీ.. ఇది పూర్తి ఆరోగ్యం కాదనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే.. మీరు రాగులతో అద్భుతమైన ఇడ్లీ తయారు చేసుకోండి. అంతేకాదు.. అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా దీన్ని ప్రిపేర్ చేసుకోండి. మరి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Instant Ragi Idli Recipe in Telugu (ETV Bharat)

Published : Sep 20, 2024, 9:55 AM IST
Instant Ragi Idli Recipe in Telugu: సమయం లేక కొందరు.. పదే పదే చేయడానికి ఓపిక లేక మరికొందరు.. వారం రోజులకి సరిపడా ఇడ్లీ పిండి రుబ్బి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటారు! అయితే, ఇలా పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా కొన్నిసార్లు పాడైపోతుంది. అందుకే.. రాగి పిండితో ఇన్‌స్టంట్‌గా అచ్చం పులియబెట్టిన ఇడ్లీ లాంటి మెత్తటి ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు అంటున్నారు పాకశాస్త్ర నిపుణులు. దీని వల్ల అటు ఆరోగ్యంతోపాటు ఇటు సమయం కూడా ఆదా అవుతుందని చెబుతున్నారు. మరి.. ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఏంటి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
- ఒక కప్పు బొంబాయి రవ్వ
- ఒక కప్పు రాగి పిండి
- అర టేబుల్ స్పూన్ నూనె
- ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగప్పపు
- ఒక టేబుల్ స్పూన్ మినపప్పు
- అర టీ స్పూన్ ఆవాలు
- అర టీ స్పూన్ జీలకర్ర
- ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు
- ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు తరుగు
- పావు కప్పు క్యారెట్ తరుగు
- రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు
- రెండు కప్పుల పెరుగు
- రుచికి సరిపడా ఉప్పు
- అర టీ స్పూన్ వంట సోడా
- నీళ్లు తగినంత
తయారీ విధానం..
- ముందుగా స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నూనె పోసి వేడి చేసుకోవాలి.
- నూనె వేడయ్యాక పచ్చి శెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి.
- ఆ తర్వాత ఇందులోకి పచ్చిమిర్చీ, కరివేపాకు, క్యారెట్ తరుగు వేసి కాసేపు వేగనివ్వండి.
- ఇవన్నీ బాగా వేగాక ఇందులోకి బొంబాయి రవ్వ వేసుకుని సుమారు 10 నిమిషాలు పాటు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. (రవ్వ బాగా వేగితే ఇడ్లీ టేస్ట్ బాగుంటుంది)
- అనంతరం ఇందులోకి రాగి పిండిని వేసి సుమారు 5 నిమిషాల పాటు వేగనివ్వండి.
- ఆ తర్వాత దించే ముందు కొత్తిమీర తరుగు వేసి బాగా కలిపి స్టౌ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి.
- ఇప్పుడు చల్లారబెట్టిన పిండిలోకి ఉప్పు, పెరుగు వేసి బాగా కలపాలి. (పుల్లటి పెరుగు అయితే ఇడ్లీలు చాలా రుచిగా, మెత్తగా వస్తాయి)
- ఆ తర్వాత అవసరాన్ని బట్టి నీళ్లను కలిపి మూత పెట్టి సుమారు 20 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి.
- అనంతరం మూత తీసి కలిపి అందులో వంట సోడా, నీళ్లు పోసి పిండి మిశ్రమాన్ని కలపాలి (అచ్చం ఇడ్లీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది)
- మరోవైపు స్టౌ ఆన్ చేసి ఇడ్లీ గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి మరగనివ్వాలి.
- ఈ సమయంలోనే ఇడ్లీ మిశ్రమాన్ని పాత్రలోకి పెట్టుకోవాలి. (కాటన్ బట్టలో లేదా పాత్రలకు నేరుగా నెయ్యి రాసి చేసుకోవచ్చు)
- ఆ తర్వాత ఇడ్లీ పాత్రను గిన్నెలో పెట్టి సుమారు 10 నిమిషాలు పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికిస్తే రాగి ఇడ్లీలు రెడీ!