How to Make Vankaya Bajji Curry in Telugu: "రాయలసీమ వంకాయ బజ్జీ కర్రీ".. పేరు వినగానే ఏదో స్నాక్ అనుకున్నారా? కాదండి ఇది అన్నంలో వేసుకుని తినే టేస్టీ కూర. మీరు ఇన్నాళ్లూ వంకాయ ఫ్రై, బజ్జీ, బిర్యానీ వంటివి చేసుకుని ఉంటారు. ఇప్పుడు మాత్రం వంకాయ బజ్జీ కర్రీని ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే.. మళ్లీ మళ్లీ ఇదే రెసిపీ ట్రై చేస్తారు. అంత అద్భుతంగా ఉంటుందీ కూర. అంతేకాదు.. ఈ కూరను చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి.. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఏంటి? అన్నది ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
- పావు కేజీ వంకాయలు(వీలైతే పెద్దవి తీసుకోవాలి)
- రెండు పెద్ద ఉల్లిపాయలు
- ఒక పెద్ద టమాటా
- 10 పచ్చిమిరపకాయలు
- రుచికి సరిపడా ఉప్పు
- 2 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు
- అర టీ స్పూన్ పసుపు
- నూనె
తాళింపు కోసం..
- 2 టేబుల్ స్పూన్ల నూనె
- ఒక టేబుల్ స్పూన్ ఆవాలు
- ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు
- ఒక టేబుల్ స్పూన్ మినపప్పు
- ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర
- కరివేపాకు రెబ్బలు
తయారీ విధానం..
- ముందుగా వంకాయను తీసుకుని దానిపై నూనె రాసుకుని స్టౌ ఆన్ చేసి మంటపై నల్లగా అయ్యేవరకు కాల్చుకోవాలి (ఇంకా నిప్పులపై కాల్చితే సూపర్ టేస్ట్ ఉంటుంది)
- ఆ తర్వాత రెండు ఉల్లిపాయలు, టమాటాకు కూడా నూనె రాసి నల్లగా అయ్యేవరకు కాల్చుకోవాలి.
- అనంతరం పచ్చిమిరపకాయలను కూడా నల్లగా అయ్యేవరకు లో-ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి.
- ఆ తర్వాత కాల్చి పెట్టుకున్న వంకాయ, టమాటా పై పొరలను తీసేసి చేతితో మెత్తగా రుబ్బుకోవాలి. (వీటన్నింటిని చేతితో కలిపితే టేస్ట్ బాగుంటుంది లేదంటే స్మాషర్తో చేసుకోండి)
- అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలను వేసుకోవాలి.
- ఆ తర్వాత ఉప్పు, చింతపండు గుజ్జు, పసుపు వేసి బాగా కలపాలి.
తాళింపు విధానం..
- ముందుగా స్టౌ ఆన్ చేసుకుని కడాయి వేడి చేసుకుని నూనె పోసుకోవాలి.
- ఆ తర్వాత శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి.
- ఇవన్నీ కాస్త వేగాక ముందుగా చేసుకున్న వంకాయ బజ్జీ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి.
- ఇలా రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే టేస్టీ వంకాయ బజ్జీ కర్రీ రెడీ!
- దీనిని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది. సో.. తప్పకుండా ట్రై చేయండి.