How To Make Puri Curry Recipe: పూరీలు అంటే చాలు.. అనేక మందికి నోరూరుతోంది. దీనిని కేవలం టిఫెన్‌గా మాత్రమే కాకుండా పండగలు, ఇతర వేడుకల సందర్భాల్లోనూ చేసుకొని తింటుంటారు. ఇంకొందరైతే చినుకులు పడితే చాలు వేడివేడిగా పూరీలను ఆస్వాదిస్తుంటారు. అయితే, పూరీలను చికెన్, సొరకాయ, పప్పు ఇలా చాలా రకాల కర్రీలతో తింటారు. కానీ ఎన్ని కర్రీలతో తిన్నా సరే.. బొంబాయి చట్నీకి(పూరీ కర్రీ) ఉండే క్రేజ్ వేరు. ఈ క్రమంలోనే చాలా మంది ఇంట్లోనే పూరీ కర్రీ ప్రిపేర్ చేసుకొని తినాలని అనుకుంటారు. కానీ.. ఎలా చేసుకోవాలో తెలియక ఊరుకుంటారు. ఇకపై అలాంటి టెన్షన్ లేకుండా హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా 'పూరీ కర్రీ' రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చాం. ఇంకెందుకు ఆలస్యం? బొంబాయి చట్నీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 2 టీ స్పూన్ల నూనె
- అర టీ స్పూన్ ఆవాలు
- ఒక టీ స్పూన్ శనగపప్పు
- ఒక టీ స్పూన్ మినపప్పు
- ముప్పావు చెంచా జీలకర్ర
- 2 ఎండు మిరపకాయలు
- ఒక రెబ్బ కరివేపాకు
- 2 పచ్చి మిరపకాయలు
- పావుకిలో ఉల్లిపాయ ముక్కలు
- అర టీ స్పూన్ పసుపు
- రుచికి సరిపడా ఉప్పు
- 2 టీ స్పూన్ల శెనగపిండి
- ఒక టీ స్పూన్ అల్లం తరుగు
- ఉడకబెట్టిన బంగాళ దుంప (ఆప్షనల్)
- ఒక టీ స్పూన్ నిమ్మరసం (ఆప్షనల్)
- కొత్తిమీర (ఆప్షనల్)
తయారీ విధానం
- ముందుగా స్టౌ ఆన్ చేసుకుని ఓ గిన్నెలో నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఆ తర్వాత ఆవాలు వేసి చిటపటమనిపించాక మినపప్పు, శెనగపప్పు వేసి వేయించుకోవాలి.
- పప్పులు సగం వేగాక జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఇందులో కరివేపాకు, పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయలు, పసుపు వేసి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. (ఉల్లిపాయలను ఎక్కువగా వేపితే తినేటప్పుడు గుజ్జుగా మారి రుచి చెడిపోతుంది)
- ఆ తర్వాత అర లీటర్ నీళ్లు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి.
- ఇది ఉడుకుతున్న సమయంలో శనగపిండిలో కొద్దిగా 50మిల్లీ లీటర్ల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలపాలి.
- ఇప్పుడు శనగపిండి మిశ్రమం, అల్లం తరుగు, వేసి బాగా కలిపి స్టౌ ఆఫ్ చేసుకోండి అంతే టేస్టీ బొంబాయి చట్నీ రెడీ!
- ఇందులోకి అవసరమైతేనే ఉడకబెట్టిన బంగాళ దుంప, నిమ్మ రసం, కొత్తిమీర వేసి కలుపుకోవచ్చు.
బ్యాచిలర్ బ్రోస్.. వంట తేడా కొట్టేస్తే ఏం చేస్తారు? - ఈ టిప్స్ పాటస్తే నో టెన్షన్! - Cooking Tips