How To Make Pepper Rice Recipe : ఎక్కువ మంది మమ్మీలు పిల్లల లంచ్ బాక్స్‌లోకి రోజూ రొటీన్ అన్నం పెడుతుంటారు. వైట్ రైస్ తో ఏదోక కర్రీ పెట్టి పంపిస్తుంటారు. దీంతో.. స్కూల్లో ఇలాంటి భోజనం తినడానికి పిల్లలు అంతగా ఇష్టపడరు. అందుకే.. కొన్నిసార్లు అన్నం కొంచెం తిని, మిగిలి బాక్స్ మొత్తం అలాగే ఇంటికి పట్టుకొస్తుంటారు. అందుకే.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఎప్పుడూ వివిధ రకాల వెరైటీ రెసిపీలను పెడుతుండాలి. ఇలాంటి ఒక లంచ్ బాక్స్ రెసిపీని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం. అదే పెప్పర్ రైస్. ఒక్కసారి ఈ విధంగా చేశారంటే పిల్లలు ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు. సింపుల్‌గా.. నిమిషాల్లోనే ఈ రైస్‌ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
పెప్పర్ రైస్ కోసం కావాల్సిన పదార్థాలు :
- బియ్యం - గ్లాసు
- నూనె - తగినంత
- ఉల్లిపాయ -1
- ఎండుమిర్చిలు-2
- టేబుల్‌స్పూన్ మిరియాలు
- జీలకర్ర- అర టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు-10
- కరివేపాకు-1
- టమాటా-1
- పసుపు-అరటీస్పూన్
- ఇంగువ- చిటికెడు
- జీడిపప్పులు-కొద్దిగా
పెప్పర్ రైస్ తయారీ విధానం..
- ముందుగా బియ్యం రెండు మూడుసార్లు కడిగి, నానబెట్టకుండా అన్నాన్ని పొడిపొడిగా వండుకోండి.
- ఇప్పుడు పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మీకు నచ్చితే ఈ రైస్ చేయడానికి నెయ్యిని కూడా వాడుకోవచ్చు.
- తర్వాత గిన్నెలో ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర వేసి వేపండి. ఎండుమిర్చి, మిరియాలు వేగిన తర్వాత వాటిని తీసి కచ్చాపచ్చాగా దంచుకోండి.
- అదే పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేయండి. వెల్లుల్లి గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ఇంగువ, జీడిపప్పులు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి.
- అలాగే టమాటాలు వేసి కొద్దిగా ఉడకనివ్వండి. తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేపండి.
- ఇప్పుడు ఉడికించుకున్న అన్నం, కచ్చాపచ్చాగా దంచుకున్న ఎండుమిర్చి, మిరియాల పొడి వేసి బాగా కలపండి.
- రైస్ దింపుకునే ముందు కాస్త కొత్తిమీర చల్లి దింపుకుంటే సరిపోతుంది.
- అంతే.. ఇలా సింపుల్‌గా చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోనే మీ ముందు వేడివేడి పెప్పర్ రైస్ ఉంటుంది.
- ఈ రైస్ టేస్ట్ ఒక్కసారి చూశారంటే, తప్పకుండా మళ్లీ ప్రిపేర్ చేసుకుంటారు.
- నచ్చితే మీరు కూడా ఇంట్లో ఈ రైస్ తయారు చేసేయండి.
ఇవి కూడా చదవండి :
పిల్లలు లంచ్ బాక్స్ తినకుండా తెస్తున్నారా? - ఇలా 'ఆలూ రైస్' చేసి పెట్టండి! - బాక్స్ మొత్తం ఖాళీ చేస్తారు