How to Make Peanut Rice Recipe : చాలా మంది తల్లులకు ఉదయాన్నే పిల్లలకు లంచ్ బాక్స్ రెడీ చేసివ్వడం కష్టమైన పని. ఎందుకంటే, ఇంటి పని పూర్తి చేసిన తర్వాత వంట చేయడానికి ఎక్కువగా టైమ్ ఉండదు. ఈలోపు స్కూల్ బస్సు వస్తుందని లేదా టైమ్ అవుతోందని ఎంతో హడావుడిగా ఉంటుంది. ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ కావడానికి మీ కోసమే కేవలం పది నిమిషాల్లో రెడీ అయ్యే సూపర్ లంచ్‌బాక్స్ రెసిపీని తీసుకొచ్చాం. అదే "కమ్మటి పల్లీల రైస్". ఈ విధంగా రైస్ చేసి పిల్లల లంచ్‌బాక్స్‌లో పెడితే మెతుకు మిగల్చకుండా పూర్తిగా తింటారు. అలాగే ఈ రైస్ హెల్దీ కూడా. ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఈ విధంగా పల్లీల రైస్ చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఎంతో రుచికరమైన టేస్టీ పల్లీల రైస్ ఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
- అన్నం- పెద్ద కప్పు
- పల్లీలు-పావు కప్పు
- ఎండుమిర్చి-6
- పచ్చి కొబ్బరి -అర కప్పు
- నువ్వులు -పావు కప్పు
- ఉప్పు రుచికి సరిపడా
తాలింపు కోసం..
- నూనె -2 టేబుల్‌స్పూన్లు
- ఆవాలు-అరటీస్పూన్
- శనగపప్పు-టీస్పూన్
- మినప్పప్పు-టీస్పూన్
- కరివేపాకు-2
తయారీ విధానం..
- ముందుగా స్టౌపై కడాయి పెట్టి పల్లీలు దోరగా వేయించుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
- అదే కడాయిలో ఎండుమిర్చి వేసుకుని వేపుకుని పక్కకు పెట్టుకోండి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు వేసి దోరగా ఫ్రై చేయండి. కొద్దిసేపటి తర్వాత నువ్వులు వేసి కాస్త వేయించండి.
- ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయించిన పల్లీలు, ఫ్రై చేసిన మిర్చి, కొబ్బరి, నువ్వుల మిశ్రమాన్ని వేసుకుని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి.
- ఇప్పుడు తాలింపు చేసుకోవాలి. అందుకోసం కడాయిలో ఆయిల్ పోయండి. నూనె వేడైన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. తాలింపు మగ్గిన తర్వాత ఇందులోకి అన్నం, రుచికి సరిపడా ఉప్పు, గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి.
- ఒక రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసుకుంటే.. వేడివేడిగా ఎంతో రుచిగా ఉండే పల్లీల రైస్ రెడీ. దీనిపై గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుకున్నా టేస్ట్ బాగుంటుంది. అంతేకాదు పల్లీలను నూనెలో వేయించి కూడా ఈ రైస్‌లో కలుపుకోవచ్చు.
- నచ్చితే మీరు కూడా ఇలా పల్లీల రైస్ ట్రై చేయండి. ఇంట్లో వాళ్లందరూ ఎంతో ఇష్టంగా లాగించేస్తారు.
క్షణాల్లో అద్దిరిపోయే "మినప్పప్పు ఫ్రైడ్ రైస్"- ఒక్కసారి ఇలా చేయండి- రుచి అస్సలు మర్చిపోరు!
రాత్రి మిగిలిన అన్నం పొద్దున ఎవ్వరూ తినట్లేదా? - ఇలా పుదీనా పులావ్ చేయండి - మెతుకు మిగిలితే అడగండి!