How to Make Pala Puri At Home : పూరీలు అంటే అందరికీ టిఫెన్‌లో తినేవి మాత్రమే గుర్తొస్తాయి. కానీ అందులో కూడా చాలా రకాలే ఉంటాయి. అలాంటి వాటిలో పాల పూరీలు కూడా ఒకటి. పాకం పూరీలు తెలుసు.. ఈ పాల పూరీలు ఏమిటీ అనుకుంటున్నారా? ఒకప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడల్లా వీటిని చేసుకుని తినేవారు అని చెబితే నమ్ముతారా? నిజమేనండీ.. ఎప్పుడు తినాలంటే అప్పుడూ చేసుకునే తినేవారంట. ఎందుకంటే అంత బాగుంటాయి కాబట్టి. ఇక ఆంధ్రాలోని ప్రతి ఇంట్లో పండగల సమయంలో తప్పకుండా ఈ పాల పూరీలు చేస్తుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక ఇందులో ఉపయోగించే పాలను ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటే ఓ మూడు నాలుగు రోజుల పాటు ఎప్పుడంటే అప్పుడు పూరీలు చేసుకుని ఇందులో కలుపుకుని తినొచ్చు. మరి.. వీటిని ఎలా తయారు చేయాలి? పాల పూరీలు పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
పాల పూరీలకు కావాల్సిన పదార్థాలు:
- గోధుమిపిండి - 1 కప్పు
- ఉప్పు - చిటికెడు
- నెయ్యి - 2 టీ స్పూన్లు
- చిక్కటి పాలు - 1 లీటర్
- గసగసాలు - 2 టేబుల్ స్పూన్లు
- బియ్యం పిండి - 2 టీస్పూన్లు
- జీడిపప్పు పలుకులు - పావు కప్పు
- పచ్చికొబ్బరి తురుము - అర కప్పు
- పంచదార - ముప్పావు కప్పు
- యాలకుల పొడి - 1 టీ స్పూన్
- నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం:
- ముందుగా ఓ బౌల్లోకి గోధుమపిండి, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఓ అరగంట సేపు పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి గసగసాలు, బియ్యప్పిండి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులోకి జీడిపప్పు పలుకులు వేసి కొంచెం కూడా బరకగా లేకుండా మిక్సీ పట్టుకోవాలి.
- ఇప్పుడు అందులోకి పచ్చి కొబ్బరి తురుము వేసి వెన్న కన్నా సాఫ్ట్ ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఇక్కడా అన్ని ఒకేసారి వేసుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావొచ్చు. కానీ అన్ని ఒకేసారి వేస్తే మెత్తగా గ్రైండ్ అవ్వదు. అదే ఒక్కొక్కటి వేసుకుంటే చాలా మెత్తగా గ్రైండ్ అవుతుంది.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు, పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని వేసి.. చిక్కటి పాలు పోసుకుని కలుపుకోవాలి.
- స్టవ్‌ను సిమ్‌లో పెట్టి గరిటెతో కలుపుతూ పాలు చిక్కబడే వరకు మరిగించుకోవాలి. ఇలా కావడానికి సుమారు 20 నుంచి 25 నిమిషాల సమయం పడుతుంది.
- అప్పుడు పంచదార, యాలకుల పొడి వేసి కలిపి పంచదార కరిగే వరకు కలుపుతూ మరో 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇది మొత్తం రెడీ అయ్యేవరకు పాలు కలుపుతూనే ఉండాలి. లేకుంటే అడుగు మాడిపోతుంది.
- ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఈలోపు ముందే కలిపిన గోధుమ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- ఇలా చేసుకున్న ఉండలను పొడి పిండి సాయంతో పూరీల్లా వత్తుకోవాలి. ఆపై ఫోర్క్ స్పూన్ సాయంతో పూరీలపై చిన్నగా ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల పూరీలు పొంగవు.
- ఇలా చేసుకున్న పూరీలను కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా అప్పడాల మాదిరి కాల్చుకోవాలి.
- ఇలా కాల్చుకున్న పూరీలను ముందే ప్రిపేర్ చేసుకున్న పాల మిశ్రమంలో వేసి ఓ 15 సెకన్లు ఉంచి వెంటనే తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్నింటిని చేసుకుని పక్కక పెట్టుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన పాల పూరీలు రెడీ.
- వీటిని తినాలనుకున్నప్పుడు పాలతో కలిపి తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయి.
సూపర్ క్రంచీ "పల్లీ కొబ్బరి పట్టిలు"- ఈ విధంగా చేస్తే అద్భుతంగా వస్తాయి!
మరమరాలతో చాట్ రొటీన్ - ఇలా సూపర్ "బర్ఫీ" చేయండి - టేస్ట్ అద్దిరిపోతుంది!