Navratan Pulao Recipe in Telugu: రకరకాల పులావ్‌లు తినాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ చేసుకోవడం రాదు. దీంతో ఎప్పుడూ చేసుకునే చికెన్, మటన్‌తో పులావ్‌లు చేసుకుని తింటుంటారు. అయితే అలాంటి వారికోసం నాన్‌వెజ్‌లో మాత్రమే కాకుండా వెజ్‌లో అదిరిపోయే రెసిపీని తీసుకువచ్చాం. ఇది ఉత్తర భారతదేశంలో సాధారణమే అయినా.. దక్షిణాదిలో మాత్రం రెస్టారెంట్ లేదా పార్టీల్లో మాత్రమే ఎక్కువగా చేస్తుంటారు. 9 రకాల పండ్లు, కూరగాయలతో దీని టేస్ట్ మిక్స్డ్ ఫ్లేవర్‌తో ఉంటుంది. దీంతో ఏదైనా పనీర్ కర్రీ, మెతి చమన్ కర్రీతో తింటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఎక్కువ శాతం రెస్టారెంట్లో మాత్రమే లభించే ఈ రెసిపిని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ పులావ్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
- 2 టేబుల్ స్పూన్ల నెయ్యి
- 4 టేబుల్ స్పూన్ల నూనె
- ఒక బిర్యానీ ఆకు
- 4 యాలకులు
- 4 లవంగాలు
- ఒక ఇంచున్నర దాల్చిన చెక్క
- 2 అనాస పువ్వులు
- ఒక నల్ల యాలక
- ఒక టేబుల్ స్పూన్ షాజీరా
- పావుకప్పు ఉల్లిపాయ ముక్కలు
- 2 పచ్చిమిరపకాయ ముక్కలు
- అర కప్పు క్యారెట్ ముక్కలు
- పావు కప్పు బీన్స్
- అర కప్పు కాలీ ఫ్లవర్ ముక్కలు
- పావు కప్పు బంగాళ దుంప ముక్కలు
- ఒక టేబుల్ స్పూన్ అల్లం వెలుల్లి పేస్ట్
- 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు
- కొద్దిగా కొత్తిమీర తరుగు
- కొద్దిగా పుదీనా తరుగు
- ఒక టీ స్పూన్ పంచదార
- రుచికి సరిపడా ఉప్పు
- ఒక కప్పు బాస్మతి బియ్యం
- కొన్ని గులాబీ రేకులు లేదా టీ స్పూన్ రోజ్ వాటర్
- రెండు టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీలు
- 2 టేబుల్ స్పూన్ల మొక్క జొన్నలు
- 7 పైనాపిల్ ముక్కలు
- 8 యాపిల్ ముక్కలు
- పావు కప్పు పనీర్ ముక్కలు
- కుంకుమ పువ్వు నానబెట్టిన పాలు
తయారీ విధానం
- ముందుగా స్టౌ ఆన్ చేసుకుని కాస్త అడుగు మందం ఉన్న గిన్నె పెట్టి అందులో నెయ్యి, నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఇప్పుడు ఇందులోనే బిర్యానీ ఆకును తుంచి వేసి.. ఆ తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వులు, నల్ల యాలక, షాజీరా, ఉల్లిపాయ ముక్కలు వేసి సుమారు నిమిషం పాటు వేయించుకోవాలి.
- ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు, క్యారెట్, కాలీ ఫ్లవర్, బీన్స్, అలూగడ్డల ముక్కలు వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలి.
- రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టే వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
- అనంతరం జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి వేయించుకోవాలి.
- ఇప్పుడు ఇందులోనే ఒకటిన్నర కప్పు వేడి నీరు, పంచదార, ఉప్పు వేసి బాగా మరగనివ్వాలి. (హై ఫ్లేమ్‌లో పెట్టి వేడి చేయాలి)
- ఆ తర్వాత గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి బాగా కలిపి ఎండిపోయిన గులాబీ రేకులు లేదా రోజ్ వాటర్ వేసి సుమారు 8 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి.
- ఇప్పుడు పచ్చి బఠానీలు, మొక్కజొన్నలు, పైనాపిల్, యాపిల్, పనీర్ ముక్కలు వేసి బాగా కలిపాలి.
- వెచ్చటి పాలలో చిటికెడు కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకున్న పాలు పోసి కలిపి దమ్ బయటికి పోకుండా మూత పెట్టాలి. (టిష్యూ, విస్తారాకు ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు)
- మూత పెట్టాక 5 నిమిషాలు హై ఫ్లేమ్‌లో మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్‌పై దమ్ ఇచ్చి స్టౌ ఆఫ్ చేయాలి.
- ఇప్పుడు సుమారు 30 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ నవరతన్ పులావ్ రెడీ!