How To Make Chaddi Annam: ప్రస్తుత కాలంలో మనందరికీ టిఫెన్ అనగానే.. ఇడ్లీ, బోండా, పూరీ, దోశ.. ఇలా రకరకాల బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్స్ కళ్ల ముందు మెదులుతుంటాయి. కానీ, ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి కావు. అందరూ జొన్నలు, కొర్రలతో చేసిన అన్నం, రాగి సంగటి, అంబలి, చల్ది అన్నం చేసుకుని తినేవారు. ఉదయాన్నే పొలం పనులు చేసేవారికి.. రాత్రి సిద్ధం చేసిన చల్ది అన్నం ఆహారంగా ఉండేది. అయితే, ప్రస్తుత కాలంలోనూ కొంతమంది హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌గా చల్ది అన్నం తింటున్నారు. రోజూ చల్ది అన్నం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎక్కువ మందికి దీనిని ఎలా తయారు చేస్తారో తెలియదు. ఇప్పుడు మనం సింపుల్‌గా చల్ది అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ మీ ముందు ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు :
- అన్నం - 2 కప్పులు
- పాలు - ఒక కప్పు
- వేడినీళ్లు - ఒక కప్పు
- మజ్జిగ -కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 4
తయారీ విధానం :
- చల్ది అన్నం కోసం ముందుగా ఒక బౌల్లో మెత్తగా ఉడికించుకున్న అన్నం తీసుకోండి. (మీరు మట్టి పాత్రని ఉపయోగిస్తే చల్ది అన్నం చాలా బాగుంటుంది.)
- ఇందులో వేడినీళ్లు పోసుకొని కలుపుకోవాలి.
- తర్వాత బాగా మరిగించిన పాలను అందులో పోసుకొని మరోసారి కలుపుకోవాలి.
- కొద్దిసేపటి తర్వాత అంటే.. అన్నం కాస్త వేడి తగ్గాక మజ్జిగను పోసుకొని మిక్స్ చేసుకోవాలి.
- అయితే, ఎక్కువ మంది పెరుగు(Curd) వేసుకొని చల్ది అన్నం ప్రిపేర్ చేసుకుంటారు. కానీ, అలాకాకుండా మజ్జిగతో చేసుకుంటే ఇంకా ఆ టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. (చల్ది అన్నం తయారీలో మీరు పెరుగుకు బదులుగా మజ్జిగను ఉపయోగించడం ఆరోగ్యానికి ఇంకా ఎంతో మంచిది.)
- ఇప్పుడు అన్నంలో కాస్త పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి.
- తర్వాత బౌల్‌పై మూత ఉంచి మిశ్రమాన్ని నైట్ మొత్తం అలానే ఉంచాలి.
- మరుసటి రోజు మూత తీసి చూస్తే ఆ మిశ్రమం పెరుగు తోడుకున్న మాదిరిగా కనిపిస్తుంది.
- ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే 'చల్ది అన్నం' రెడీ!
ఆరోగ్యాన్నిచ్చే "ఓట్స్ పొంగల్" - చిటికెలో చేసుకోండిలా! - బరువు తగ్గాలనుకునేవారికి బెటర్ ఆప్షన్!
హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ కోసం చూస్తున్నారా ? - ఇంట్లోనే "ఓట్స్ ఆమ్లెట్" చేసేసుకోండి - టేస్ట్ సూపర్!