House Cleaning Tips in Telugu: మరికొన్ని రోజుల్లో దసరా, దీపావళి పండగలు రాబోతున్నాయి. ఈ క్రమంలో ఇళ్లను శుభ్రం చేసేందుకు మహిళామణులు సిద్ధమవుతున్నారు. అయితే ఇంట్లో పేరుకుపోయిన అనవసరమైన వస్తువుల్ని తొలగించడమంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇక వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉండే మహిళల గురించి అయితే, స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. ఇందుకోసం సమయం కూడా కేటాయించలేకపోతారు. ఫలితంగా ఇల్లంతా చిందరవందరగా మారిపోతుంది. అలాగని దాన్ని అలా చూస్తూ ఉండలేక.. క్లీన్ చేసేందుకు సమయం లేదని బాధ పడుతుంటారు. అయితే, ఇలాంటి వారికి ఇంట్లోని చెత్తను తొలగించి ఈజీగా క్లీన్ చేసుకునేందుకు 10-10-10 రూల్ చక్కగా ఉపకరిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ నియమంతో పని ఈజీగా, త్వరగా పూర్తవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంతకీ 10-10-10 రూల్ అంటే ఏంటి? తెలుసుకుందాం రండి.
ఇంటిని క్లీన్ చేయడానికి ఎక్కువగా సమయం కేటాయించలేని వారు రోజుకో గది చొప్పున శుభ్రం చేస్తుంటారు. కొంతమందికైతే ఈ సమయం కూడా దొరకదు. అయితే, ఇలాంటి వారికి 10-10-10 రూల్ చక్కగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లోని 10 ప్రాంతాల్ని ఎంచుకొని.. ఒక్కో ప్రదేశం నుంచి అనవసరమైన 10 వస్తువుల్ని తొలగిస్తూ.. ఒక్కో ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి 10 నిమిషాలు కేటాయించాలని వివరిస్తున్నారు.
ఏంటా 10 ప్రదేశాలు?: మన రోజువారీ జీవితంలో ఇంటి పనులు, ఆఫీస్ సమయం పోగా.. మిగిలిన ఆ కాస్త సమయంలోనో లేదంటే వీకెండ్లో కొన్ని ప్రదేశాల్ని క్లీన్ చేస్తుంటాం. ఉదాహరణకు కిచెన్‌లో మనం ఎక్కువ సమయం గడుపుతాం కాబట్టి అక్కడ ఉండే అల్మరాలు, కిచెన్ క్యాబినెట్స్ వంటివి సమయం దొరికినప్పుడల్లా క్లీన్ చేసుకుంటుంటాం. అదే మనం ఎక్కువగా ఉపయోగించని వస్తువుల్ని, ప్రదేశాల్ని నెలల తరబడినా శుభ్రం చేయకుండా అలానే ఉంచేస్తాం. అయితే, 10-10-10 రూల్‌లో భాగంగా మనం ఎంచుకునే 10 ప్రదేశాలు ఎక్కువగా చెత్త పేరుకుపోయినవి ఎంచుకోవడం బెటర్. అది ఒక చిన్న డ్రా/ర్యాక్, డ్రస్సింగ్ టేబుల్, అల్మరా కావచ్చు లేదంటే మొత్తం గదైనా క్లీన్ చేయవచ్చట.
ఆ 10 వస్తువులు! ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న 10 ప్రదేశాల్లో నుంచి ఒక్కో ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. వీటిలో పాతబడిపోయినవి, అనవసరమైన వస్తువులు, ఎక్కువగా వాడనివన్నీ ఉంటాయి. అవి పుస్తకాలు, దుస్తులు, కిచెన్ సామగ్రి.. ఏదైనా కావచ్చు. ఇలా ఒక్కో ప్రదేశం నుంచి 10 వాడని వస్తువుల్ని సెలెక్ట్ చేసుకొని తీసివేయాలి. ఫలితంగా ఆ ప్రదేశంలో సగం చెత్త తొలగిపోయి నీట్‌గా కనిపించడమే కాకుండా.. చిన్న స్థలమైనా విశాలంగా మారిపోతుంది.
10 నిమిషాలు చాలు!: ఇలా అనవసరమైన వస్తువులన్నీ తొలగించిన తర్వాత మనకు అవసరమైన వస్తువులేంటి? ఏయే వస్తువుల్ని క్లీన్ చేయాలో ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఒక్కో ప్రదేశానికి గరిష్టంగా 10 నిమిషాల సమయం కేటాయించుకుని గబగబా శుభ్రం చేసేసుకోవాలట. అలా అని సమయాన్ని సాగదీయకుండా కేవలం 10 నిమిషాల్లో పనిని పూర్తి చేయాలని సూచించారు. ఇందుకోసం కావాలంటే అలారం/టైమర్ సెట్ చేసుకోవాలని తెలిపారు. దీనివల్ల అలసట లేకుండానే సులభంగా ఇంటిని శుభ్రం చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
ఇలా శుభ్రం చేసుకున్న వస్తువుల్ని నీట్‌గా అమర్చుకుంటే ఇల్లు కళగా కనిపిస్తుందని తెలిపారు. ఇంటిని క్లీన్ చేయాలనుకున్న ప్రతిసారీ ఇదే రూల్ను పాటిస్తే.. తక్కువ సమయంలోనే ఎక్కువ వస్తువుల్ని శుభ్రం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పని కూడా ఈజీగా పూర్తవుతుందని వివరించారు. మీరూ ఈసారి ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ట్రై చేసి చూడండి!