Fruit Peel Cleaning Tips: తాజా పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలిసిందే. వీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ వంటివి పలు రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా మనల్ని రక్షిస్తాయి. అయితే, పండ్లే కాకుండా వాటి తొక్కలు కూడా ఉపయోగపడతాయని మీకు తెలుసా ? కొన్ని రకాల పండ్ల తొక్కలను ఇంటి పరిశుభ్రత కోసం వాడవచ్చని నిపుణులంటున్నారు. సరైన విధంగా తొక్కలను ఉపయోగించుకోవాలే కానీ.. ఇంటి క్లీనింగ్‌లో రసాయనాల ద్రావణాలను వినియోగించాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. అదేలాగో ఇప్పుడు చూద్దాం.
ఆల్‌పర్పస్ క్లీనర్ ఇలా చేసేయండి.. నిమ్మ, నారింజ పండ్లలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. దీంతో వీటి తొక్కలు క్లీనింగ్ ఏజెంట్‌గా మురికిని ఇట్టే మాయం చేస్తాయి. ఇందుకోసం.. ఈ పండ్ల తొక్కలను గుప్పెడు తీసుకుని ఓ ప్లాస్టిక్ బాక్స్‌లో వేయాలి. ఆపై ఇందులో ఆరు చెంచాల వైట్ వెనిగర్ వేసి బాగా కలిపి మూతపెట్టాలి. ఈ లిక్విడ్‌ని రెండు లేదా మూడువారాలు నాననివ్వాలి. అనంతరం దీన్ని వడకట్టి సమపాళ్లలో నీటిని కలిపితే ఆల్‌పర్పస్ క్లీనర్ రెడీ అవుతుంది. లిక్విడ్‌ని స్ప్రేబాటిల్లో నింపి తలుపులు, కిటికీలు, టీపాయి అద్దాలు, పొయ్యి చుట్టుపక్కల దిమ్మ, వంటింట్లోని సింక్ వంటివాటిపై స్ప్రేచేసి 10 నిమిషాల తర్వాత తుడిస్తే చాలు. మురికి తొలగిపోయి తళతళా మెరుస్తాయి.
అద్దాల కోసం.. చాలా మంది అరటిపండు తిన్న తర్వాత తొక్కని చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ, ఈ తొక్కలు అద్దాలు క్లీన్ చేయడానికి ప్రత్యేక క్లీనర్‌గా పనిచేస్తాయి. ఇందుకోసం.. మురికి ఉన్న చోట ఈ పండు తొక్క లోపలివైపుతో మృదువుగా కాసేపు రుద్దాలి. అనంతరం మెత్తని వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. అరటిపండు తొక్కలోని స్టార్చ్ మురికిని, మచ్చలను మాయం చేస్తుంది.
మైక్రోవేవ్ ఓవెన్‌ను క్లీన్ చేసేద్దాం.. రోజూ ఆహార పదార్థాలు వేడి చేసే క్రమంలో.. ఇందులో కొన్ని అవశేషాలు ఉండిపోయి వేడికి ఎండిపోతాయి. వాటిని సాధారణంగా శుభ్రం చేయడం కష్టమవుతుంది. ఇలాంటప్పుడు గుప్పెడు నిమ్మతొక్కల ముక్కలను వాటర్ నింపిన బౌల్లో వేసి 5 నిమిషాలపాటు మైక్రోవేవ్‌లో ఉంచి వేడిచేయాలి. దీంతో నిమ్మరసం ఆవిరి లోపలంతా వ్యాప్తి చెందుతుంది. తర్వాత మెత్తని వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. ఎండిపోయి ఓవెన్‌కి పట్టేసిన పదార్థాలన్నింటినీ ఇలా తేలికగా తుడిచేయొచ్చు.
ఫర్నిచర్.. టీపాయి, డైనింగ్ టేబుల్, సోఫా వంటి చెక్క ఫర్నిచర్‌పై దుమ్ము ఎక్కువగా పేరుకుంటుంది. దీనిని శుభ్రం చేయకపోతే క్రమంగా మరకలుగా మారుతుంది. కొన్నిసార్లు ఆయిల్ జిడ్డు అంటుకుని ఎంత క్లీన్ చేసినా పోదు. ఇటువంటి మరకలను తొలగించడానికి పండ్ల తొక్కలు చాలా ఉపయోగపడతాయి. నిమ్మ, నారింజ లేదా అరటి పండు తొక్క లోపలివైపుతో మరకలున్నచోట మృదువుగా కాసేపు రుద్దాలి. ఆపై మెత్తని వస్త్రంతో తుడిస్తే సరిపోతుంది. చెక్క ఫర్నిచర్‌పై దుమ్ము తొలగిపోయి అందంగా కనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి:
పనికిరానివని పడేస్తున్నారా? ఇవి బాత్రూంలో పెడితే ఎప్పుడూ సువాసనే!
డల్ స్కిన్, డార్క్ సర్కిల్స్‌కు చెక్- ఈ 7 కూరగాయల తొక్కలతో ఇన్ని లాభాలా?