Coconut Junnu Recipe in Telugu : మీరు ఇప్పటి వరకు పచ్చి కొబ్బరితో ఎన్నో రకాల స్వీట్ రెసిపీలు ప్రయత్నించి ఉంటారు. కానీ, ఎప్పుడైనా "కొబ్బరి జున్ను" ట్రై చేశారా? లేదు అంటే మాత్రం ఓసారి తప్పక ట్రై చేయాల్సిందే. సూపర్ టేస్టీగా ఉండే ఈ రెసిపీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు! పైగా దీన్ని కేవలం మూడే మూడు పదార్థాలతో పదే పది నిమిషాల్లో సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు! మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలేంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పచ్చి కొబ్బరి ముక్కలు - రెండు కప్పులు
- వాటర్ - రెండు కప్పులు
- కార్న్ ఫ్లోర్ - 4 టేబుల్ స్పూన్లు
- పంచదార - అర కప్పు
తయారీ విధానం :
- ముందుగా పచ్చి కొబ్బరి చిప్పల బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ పార్ట్‌ను తొలగించుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చికొబ్బరి ముక్కలను వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆవిధంగా గ్రైండ్ చేసుకున్నాక అందులో ఒక కప్పు వాటర్ పోసుకొని కలిపి మరోసారి మిక్సీ పట్టుకోవాలి. అయితే, ముందుగానే నీళ్లు ఎక్కువ వేసి గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి సరిగ్గా మెదగదు. కాబట్టి, ముందుగా ఒక కప్పు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత.. మరో కప్పు వాటర్ వేసుకొని ఇంకోసారి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
- ఈవిధంగా గ్రైండ్ చేసుకోవడం ద్వారా కొబ్బరి మెత్తగా అవ్వడమే కాకుండా కొబ్బరిపాలు కూడా చిక్కగా, చాలా బాగా వస్తాయి.
- ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో స్టెయినర్(జాలీ గంటె) సహయంతో మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. స్టెయినర్లో ఉన్న సన్నని కొబ్బరి తురుముని గరిటెతో వత్తుకోవాలి. అప్పుడే కొబ్బరిపాలు పూర్తిగా ఫిల్టర్ అవుతాయి.
- ఆవిధంగా కొబ్బరిపాలను పూర్తిగా ఫిలర్ట్ చేసుకున్నాక.. కొన్ని పాలను మిక్సింగ్ బౌల్లో ఉంచి మిగతా వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో తీసుకున్న పాలలో కార్న్‌ఫ్లోర్(మొక్కజొన్న పిండి) వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
- తర్వాత ఈ కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని మరో గిన్నెలో తీసుకున్న కొబ్బరిపాలలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అనంతరం అందులో పంచదార వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద ఆ గిన్నెను ఉంచి లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్‌లోకి మంటను అడ్జస్ట్ చేసుకుంటూ మిశ్రమాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి.
- అయితే, ఇందులో కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మిశ్రమం గట్టి పడడానికి ఎక్కువ టైమ్ పట్టదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే దగ్గరే ఉండి కలుపుతూ వేడి చేసుకోవాలి. అవసరమైతే లో ఫ్లేమ్ మీద మిశ్రమాన్ని ఉడికించుకోవడం బెటర్.
- ఇక మిశ్రమం ఎప్పుడైతే మీడియం థిక్‌నెస్‌తో చిక్కగా వస్తుందో అప్పుడు స్టౌ ఆఫ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకొని దింపుకోవాలి.
- తర్వాత దాన్ని గాజు గిన్నె లేదా స్టీల్ బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి.
- ఆవిధంగా చల్లార్చుకున్నాక దానిపై మూత ఉంచి సుమారు 1 నుంచి 2 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచాలి.
- అనంతరం ఆ బౌల్‌ని ఒక ప్లేట్లోకి రివర్స్లోకి తిప్పి తీసుకోవాలి. ఇక చివరగా దానిపై కొన్ని డ్రై ఫ్రూట్స్ పలుకులతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో కమ్మగా, టేస్టీగా ఉండే నోట్లో వేసుకుంటే కరిగిపోయే "కొబ్బరి జున్ను" రెడీ!
ఇవీ చదవండి :
ఉసిరికాయతో జ్యూసీ స్వీట్ చేసుకోండి- ఏడాది పాటు హాయిగా తినండి!
ఇంట్లో పాలు, పంచదార ఉంటే చాలు- ఎంతో రుచికరమైన "పాలకోవా" ఈజీగా చేసుకోవచ్చు!