Chilli Chicken Recipe in Telugu : పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినే నాన్‌వెజ్ ఐటమ్ చికెన్. అయితే, ఎప్పుడూ చికెన్‌తో రొటిన్‌గా ఫ్రై, కర్రీ, బిర్యానీ వంటివి తిని బోరింగ్‌గా అనిపించొచ్చు. కాబట్టి, ఈసారి కాస్త డిఫరెంట్‌గా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో "చిల్లీ చికెన్" ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది! ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తినడమే కాదు మళ్లీ మళ్లీ కావాలంటారు. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానమేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
చికెన్ మారినేషన్ కోసం :
- బోన్‌లెస్ చికెన్ - 300 గ్రాములు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - ముప్పావుటీస్పూన్
- గరంమసాలా - పావుటీస్పూన్
- కారం - అరటీస్పూన్
- ఉప్పు - కొద్దిగా
- ఎగ్ - 1
- మైదా - 2 టేబుల్‌స్పూన్లు
- కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్‌స్పూన్లు
కర్రీ కోసం :
- నూనె - తగినంత
- వెల్లుల్లి - 4(సన్నగా తరుక్కోవాలి)
- పచ్చిమిర్చి - 3
- సన్నని ఉల్లిపాయ తరుగు - 2 టీస్పూన్లు
- క్యాప్సికం - 1(చిన్న సైజ్ది)
- చిన్న ఉల్లిపాయ - 1
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - అరటీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- గరంమసాలా - అరటీస్పూన్
- కారం - తగినంత
- మిరియాల పొడి - అరటీస్పూన్
- వైట్ పెప్పర్ పౌడర్ - ముప్పావుటీస్పూన్
- అజినోమోటో - పావుటీస్పూన్
- గ్రీన్/రెడ్ చిల్లీసాస్ - 2 టేబుల్‌స్పూన్లు
- డార్క్ సోయాసాస్ - 1 టేబుల్‌స్పూన్
- వెనిగర్ - 1 టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
"చికెన్ లెగ్ పఫ్స్" తిన్నారా? - ఇలా ట్రై చేయండి - టేస్ట్ కిర్రాక్ అంతే!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా బోన్‌లెస్ చికెన్‌ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో కాస్త ఉప్పు వేసుకొని అరగంటపాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్‌ని వాటర్ లేకుండా వడకట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
- ఆపై అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్, గరంమసాలా, కారం, ఉప్పు వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బాగా బీట్ చేసుకున్న 2 టీస్పూన్ల ఎగ్ మిశ్రమాన్ని వేసి మరోసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం మైదా, కార్న్‌ఫ్లోర్, కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముక్కలకు పట్టేలా బాగా కోట్ చేసుకోవాలి. చికెన్ పకోడీకి పట్టినట్లు ముక్కలకు పిండి పట్టాలని గుర్తుంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక మారినేట్ చేసుకున్న చికెన్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా, క్రిస్పీగా మారేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత స్టౌపై పాన్ పెట్టుకొని 3 టేబుల్స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ తరుగు, క్యాప్సికం ముక్కలు, పెద్ద సైజ్ ఉల్లి ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలి. ముక్కలు కాస్త మగ్గాయనుకున్నాక ముప్పావు కప్పు వాటర్, అల్లంవెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలిపి తెర్ల కాగనివ్వాలి.
- అనంతరం అందులో ఉప్పు, గరంమసాలా, కారం, మిరియాల పొడి, వైట్ పెప్పర్ పౌడర్, అజినోమోటో, గ్రీన్/రెడ్ చిల్లీసాస్, డార్క్ సోయాసాస్ యాడ్ చేసుకొని కలుపుతూ హై ఫ్లేమ్ మీద మిశ్రమాన్ని కాస్త చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. అలా మగ్గించుకునేటప్పుడే వెనిగర్ వేసుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా టాస్ చేసుకోవాలి.
- సాస్‌ల మిశ్రమం చికెన్ ముక్కలన్నింటికీ పట్టేలా బాగా టాస్ చేసుకున్నాక చివర్లో కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. నోరూరించే స్ట్రీట్ ఫుడ్ స్టైల్ "చిల్లీ చికెన్" రెడీ!
నోరూరించే రెస్టారెంట్ స్టైల్ "చికెన్ మలై టిక్కా" - ఇంట్లోనే సులువుగా చేసేయండిలా!