How to Make Chicken Leg Puffs: చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎక్కువ మంది ఇష్టపడి తినే స్నాక్ ఐటమ్‌లో పఫ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో బయటకు వెళితే ఎక్కువ మంది వీటిని ట్రై చేస్తుంటారు. ఇక పఫ్స్ అంటే వెజ్, ఎగ్, చికెన్, పనీర్.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాలుగా మనకు లభిస్తాయి. వీటిని బయట తినడం మంచిది కాదని చాలా మంది ఇంట్లో తయారు చేస్తుంటారు. అయితే.. ఎక్కువ మంది ఇంట్లో కేవలం ఎగ్ లేదా వెజ్ పఫ్స్ మాత్రమే ప్రిపేర్ చేస్తుంటారు. ఈసారి చికెన్ లెగ్ పఫ్స్ ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతాయి. చేయడం కూడా ఈజీనే. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
మారినేట్ కోసం:
- చికెన్ లెగ్స్ - 6
- కారం - 2 టేబుల్ స్పూన్లు
- పసుపు - అర టీ స్పూన్
- ఉప్పు - 1 టీ స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- కసూరీ మేథీ - కొద్దిగా
- పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
- నిమ్మకాయ - అర చెక్క
పిండి కోసం
- మైదా - 2 కప్పులు
- బటర్ - 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - 1 టీ స్పూన్
స్టఫింగ్ కోసం:
- ఉల్లిపాయలు - 3
- పచ్చిమిర్చి - 4
- కరివేపాకు - 2 రెమ్మలు
- పసుపు - అర టీ స్పూన్
- కారం - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర పొడి - 1 టేబుల్ స్పూన్
- మిరియాల పొడి - 1 టీ స్పూన్
- గరం మసాలా - 1 టీ స్పూన్
- ఉప్పు - 1 టీ స్పూన్
తయారీ విధానం:
- ముందుగా చికెన్ లెగ్స్ స్కిన్ తీసేసి శుభ్రంగా కడిగి గాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ ప్లేట్లోకి కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరీ మేథీ, పెరుగు, నిమ్మరసం వేసి బాగా కలిపాలి. ఇప్పుడు ఆ మసాలా పేస్ట్‌లో చికెన్ లెగ్స్ వేసి మసాలాలు బాగా పట్టేలా కలిపి ఓ అరగంట సేపు పక్కన పెట్టాలి.
- ఇప్పుడు ఓ బౌల్లోకి మైదా పిండి, బటర్, ఉప్పు వేసి కలిపి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్‌గా కలుపుకుని పక్కన పెట్టాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి అందులో మారినేట్ చేసుకున్న చికెన్ వేసి స్టవ్‌ను మీడియంలో పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న వాటిని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు మరో పాన్‌లో చికెన్ ఫ్రై చేసుకున్న నూనెను కొద్దిగా వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
- ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పసుపు, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టమాట సాస్ వేసి కలిపి ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు ముందుగానే కలుపుకున్న మైదా పిండి ముద్దను మరోసారి కలిపి కొంచెం పెద్ద ఉండలుగా చేసుకోవాలి.
- తర్వాత ఓ ఉండ తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత దానిని ఫోల్డ్ చేయాలి. మళ్లీ ఇంకోసారి ఫోల్డ్ చేయాలి. అలా రెండు మూడు సార్లు చేసి మరికొంచెం పొడి పిండి చల్లుతూ కొంచెం మందంగా ఒత్తుకోవాలి.
- ఇప్పుడు దానిని దీర్ఘచతురస్రాకారంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న షీట్లో ప్రిపేర్ చేసిన ఉల్లిపాయ మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి ఫ్రై చేసిన చికెన్ లెగ్‌ను పెట్టి నాలుగు మూలలు మధ్యలోకి వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అన్ని షీట్స్ ప్రిపేర్ చేసుకుని అందులోకి స్టఫింగ్ పెట్టుకోవాలి. అయితే.. ఈ షీట్స్ చేయడం రాకపోతే మార్కెట్లో పఫ్ షీట్స్ అందుబాటులో ఉంటాయి. వాటిని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు.
- ఆ తర్వాత ఓ బౌల్లోకి గుడ్డు వేసి గిలక్కొట్టాలి. ఈ గుడ్డు మిశ్రమాన్ని బ్రష్ సాయంతో ప్రిపేర్ చేసుకున్న పఫ్స్పై అప్లై చేసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై ఒక లోతుగా ఉండే గిన్నె పెట్టుకొని అందులో ఒక స్టాండ్ ఉంచి ఐదు నిమిషాల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి.
బేకింగ్ కోసం..
- బేకింగ్ బౌల్ లేదా ప్లేట్ తీసుకొని దానికి కాస్త ఆయిల్ లేదా బటర్ అప్లై చేసి.. ప్రిపేర్ చేసుకున్న చికెన్ లెగ్ పఫ్స్ అందులో ఉంచి ప్రీ హీట్ చేసుకొన్న గిన్నెలో పెట్టుకోవాలి.
- అయితే.. ఇక్కడ బేకింగ్ కోసం స్టీల్ పాత్రలను వాడొద్దనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అల్యూమినియం పాత్రలు బెస్ట్
- ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 30 నుంచి 35 నిమిషాల పాటు పఫ్స్ను బేక్ చేసుకోవాలి.
- ఆ తర్వాత.. వాటిని రెండో వైపు తిప్పుకొని మరో 5 నుంచి 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి.
- ఆ విధంగా బేక్ చేసుకున్నాక స్టౌ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే చాలు.
- క్రిస్పీగా ఎంతో రుచికరంగా ఉండే "చికెన్ లెగ్ పఫ్స్" రెడీ. వీటిని టమాటా సాస్‌తో కలిపి తింటే కిర్రాక్‌గా ఉంటాయి. నచ్చితే మీరూ ఓ సారి వీటిని ట్రై చేయండి.
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే "బ్రెడ్ రోల్స్" - ఈ స్టైల్లో చేస్తే ఒక్కటి కూడా విడిచి పెట్టరు!
నోట్లో వేసుకుంటే కరిగిపోయే "బనానా బర్ఫీ" - ఈజీగా చేసుకోండిలా! - తింటే ఆహా అనాల్సిందే!