Best Tips for Happy Married Life: మీరు పెళ్లికి సిద్ధమవుతున్నారా. అయితే ఓ సారి ఈ టిప్స్ తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో చాలామంది దంపతులు తమ వైవాహిక జీవితంలో చేదు అనుభవాలు చవిచూడాల్సి వస్తుంది. ఇలా జరగకూడదంటే భార్య/భర్త కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవడం మంచిది. ఈ టిప్స్ పాటిస్తే మీ వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోతుంది.
పెళ్లికి ముందు మీరివి తెలుసుకుంటే మంచిది:
- మీరు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారో అనే ఆలోచన లేకుండా రెడీ అయిపోయినట్లే, అవతలి వాళ్లు కూడా అదే విధంగా సిద్ధమవుతారు లేదా వేరే వారి ప్రోత్సాహం వలన అవుతారు.
- మీకెలా అయితే బలాలూ, బలహీనతలూ ఉంటాయో, మీ పార్ట్నర్కి కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరూ వాళ్ల బలాలు, బలహీనతలు మోసుకొస్తారు. వాటిలో అలవాట్లు, అగచాట్లు, పొరపాట్లు, పోగొట్టుకున్నవి, ఆశలు, అత్యాశలు ఇలా ఎన్నో ఉంటాయి. పెళ్లికిముందే అవన్నీ పూర్తిగా తెలుసుకోవడం కష్టం. అలాగే ఇక్కడ ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరిలో ఏవో లోటుపాట్లు ఉంటాయి.
- మీరు చదువు, ఉద్యోగం, ఎత్తు ఇలా ఒక 10 అంశాల లిస్ట్ రెడీ చేసుకుని తిరిగితే అందులో కనీసం 6 ఉన్నవాళ్లని వెంటనే పెళ్లి చేసుకోవాలి. పదికి 10 కావాలి అని పట్టుబడితే పెళ్లికాకుండానే కాటికెళ్లిపోతారు. కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే, మనకి కావాల్సిన పదికి 10 ఉన్నవాళ్లు మనల్నెందుకు పెళ్లి చేసుకుంటారు అనే ఆలోచన వస్తుంది.
- భార్య/భర్త అందం ట్రోఫీ కాదు. దాని గురించి అందరికీ చెప్పుకోవలసిన అవసరం లేదు. మీకు నచ్చితే చాలు అందరికీ నచ్చక్కర్లేదు. అలాగే మీ సంపాదన మీకుంటే మంచిది.
- పెళ్లి కుదిరిన తరువాత, నిశ్చితార్థానికి, పెళ్లికీ మధ్య కొన్ని నెలల సమయం ఉంటే మంచిది. ఎందుకంటే ఆ సమయంలో ఇద్దరూ మాట్లాడుకోవడం, వీలైతే కలిసి బయటికెళ్లటం, సరదాగా తిరగటం, ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం చేయాలి. ఇది బంధాన్ని బలపరచడానికి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోడానికి, అభిరుచులు అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.
రోజులో ఎన్నిసార్లు సెక్స్‌లో పాల్గొంటే గర్భం వస్తుంది? - రీసెర్చ్‌లో ఆసక్తికర విషయం!
- కాబోయే భార్య/భర్తలో మనకి నచ్చని విషయాలు ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. వాటిని అది వారి వ్యక్తిత్వం అని వదిలేస్తారో, లేదంటే సౌమ్యంగా చెప్పి వారిని మారుస్తారో, లేక తాడో పేడో తేల్చుకుంటారో అనేది పూర్తిగా మీ ఇష్టం. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పెళ్లైన చాలా ఏళ్లకి ఇవి పూర్తిగా మారిపోవటం కానీ, లేదా అసలు ఇబ్బంది కలిగించనంతగా అలవాటు పడిపోవడం గానీ జరుగుతుంది.
- పెళ్లైన తర్వాత కచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు జీవితం రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. భయపడకూడదు, అది కూడా ఆనందించాలి. ఆ కల్లోలంలో వైవాహిక జీవితానికి సంబంధించిన నావని దిక్సూచి లేకుండా మీరు ఎలా నడుపుతారో అనే దానిపైనే మీ దాంపత్య జీవితం ఆధారపడి ఉంటుంది.
- పెళ్లికి ముందే అన్ని విషయాలనూ డిసైడ్ చేసి, వాటికి కట్టుబడి ఉండటం అనేది సాధ్యం కాకపోవచ్చు. ఉదాహరణకు, ఎంతమంది పిల్లలు, ఎక్కడ స్థిరపడాలి వంటివి. ఇదేమీ రాసింది రాసినట్లుగా ఎక్సిక్యూట్ అవ్వటానికి సాఫ్ట్వేర్ కోడ్ ఏమీ కాదు.
- ప్రతి వ్యక్తికీ కొన్ని విలువలు, నమ్మకాలు, ఆదర్శాలు, అభిప్రాయాలు ఉంటాయి. అవి మీకు నచ్చకపోవచ్చు లేదా వాటితో విభేదించవచ్చు. దానిని మీరు ఎదుటివారికి వ్యక్తపరచవచ్చు కానీ కాదు, కూడదు అనే అధికారం మీకు లేదు.
- పెళ్లి కోసం ఎన్ని ఎక్కువ సంబంధాలు చూస్తే అంత విసుగొస్తుంది. ప్రతి ఒక్కరికీ పెళ్లికి సంబంధించిన ఒక అనువైన సమయం (వయసు, అందం, కోరిక వంటివి) ఉంటుంది. అది దాటిన తరువాత, పెళ్లి చేసుకున్నా కూడా ఏదో ఒకటి అవ్వగొట్టాం అని అనిపిస్తుంది కానీ అందులో ఆనందం తగ్గిపోతుంది.
మీ భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయా? ఈ సూచనలు పాటిస్తే బంధం స్ట్రాంగ్ అవుతుంది!
- పెళ్లి అనేది ఒక పెద్ద గేమ్ లాంటిది. ఇందులో అనుభవం లేకుండా మీరు ఆడటానికి వెళతారు. ఈ ఆటని గెలవాలి అని కాకుండా ఆనందించాలి. ఎత్తుపల్లాలు చూడాలి. ఎక్కువసేపు ఆడవలసి వస్తుందని రెడీ అయ్యి వెళ్లినవాళ్లే ఇందులో విజయం సాధిస్తారు.
- పెళ్లయ్యాక ఎలా ఉండాలి అని ఎవరూ నేర్పించరు. పెళ్లయ్యాక ఎడాపెడా ఉచిత సలహాలిచ్చేవాళ్లని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. అది అమ్మానాన్నైనా, స్నేహితులైనా, ఇంకెవరైనా. మీ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య వస్తే ముందు మీ ఇద్దరూ మాట్లాడుకోవాలి.
- మీరు బంధంలో ఎప్పుడూ ఒకరిపై మరొకరు పైచేయి కోసం ప్రయత్నించకూడదు. మీ బలహీనతలు మీ పార్ట్నర్కి తెలియజేయడం ద్వారా వారి విశ్వాసాన్ని, తద్వారా వారి మద్దతుని పొందగలరు. మీరేంటో మీ పార్ట్నర్కి తెలీకపోతే వాళ్లు మీకు మానసికంగా దగ్గరకాలేరు.
- పెళ్లిలో శృంగారం అనేది సహజమైనది. ఇందులో ఒకరి కోరికలకు మరొకరు ప్రయారిటీ ఇవ్వటం ముఖ్యం. అసహజం కాని ఏ శృంగార ప్రక్రియనైనా మీరు ఎటువంటి మొహమాటం లేకుండా చెయ్యవచ్చు.
- పెళ్లయ్యాక ఒకరికి ఒకరు, ఇంకా తల్లిచాటు కుమారుడు, తండ్రిభుజాన కుమార్తె అంటే కుదరదు. మీరు ఈ మార్పుని ఎంత త్వరగా గ్రహించి, భర్త/భార్య పాత్రలో ఒదిగిపోతారో అంత త్వరగా మీ బంధం బలపడుతుంది. హక్కుల కంటే బాధ్యతల కోసం పాటుపడేవాళ్లకే ఎక్కువ ఆనందం లభిస్తుంది.
- పెళ్లికి ముందే ఎదుటివారి హింసా ప్రవృత్తిని అంచనా వేయాలి. వంచన, ద్రోహం, గోప్యత, మాటమార్చటం, అబద్ధాలు, దుర్వ్యసనాలు ఇలాంటి విషయాలు అన్నీ ముందే చూసుకోవాలి. ఆస్తులు, డబ్బు ముఖ్యం కాదు. ఆరోగ్యం గురించి కనుక్కోవడంలో తప్పులేదు. అయితే ప్రతి ఒక్కరిలో ఒకటీ అర ఆరోగ్య సమస్యలు ఉంటాయని మీరు గ్రహించాలి. అవేమీ పెళ్లికి అడ్డంకి కాదు. ఒకసారి వైద్యులతో మాట్లాడితే మీ సందేహాలు తీరిపోతాయి.
ఇవీ మీ వైవాహిక జీవితం సాఫీగా సాగేందుకు కొన్ని టిప్స్. ఇంకేముంది చక్కగా సమయానికి పెళ్లి చేసుకోండి, కిందామీదా పడి సరదాగా కొట్టుకోండి. ఇద్దరూ కలిసి శ్రమించండి, కలిసి సాధించండి, కలిసి ముసలివాళ్లైపోండి.