Benefits of Soap Berries : ఒకప్పుడు తలస్నానం చేయడానికి అందరూ కుంకుడు కాయలనే ఉపయోగించేవారు. కానీ, మార్కెట్లోకి రకరకాల షాంపూలు అందుబాటులోకి వచ్చాక వాటి వాడకం బాగా తగ్గిపోయింది. అయితే, కుంకుడు కాయలతో కేవలం జుట్టును శుభ్రపరచుకోవడమే కాకుండా.. ఇతర లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి కుంకుడు కాయలతో ఏ ఉపయోగాలున్నాయో ఇప్పుడు చూద్దాం.
లిక్విడ్ సోప్ చేసేయండిలా.. కుంకుడు కాయలతో లిక్విడ్ సోప్ ప్రిపేర్ చేయడం కోసం గిన్నెలో నీళ్లను తీసుకోండి. ఈ నీటిలో గుప్పెడు కుంకుడు కాయలు వేసి మరిగించండి. కుంకుడు కాయలు మెత్తగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయండి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మీకు నచ్చిన ఫ్లేవర్ అరోమా ఆయిల్‌ని కొన్ని చుక్కలు వేసి కలుపుకోండి. శుభ్రంగా కడిగి పొడిగా ఆరబెట్టుకున్న బాటిల్‌లో మిశ్రమాన్ని పోసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి. స్నానం చేసేటప్పుడు సబ్బుకి బదులుగా ఈ లిక్విడ్ సోప్‌ని వాడుకోవచ్చు.
కిటికీల అద్దాలను మెరిపించడం కోసం.. దాదాపు చాలా మంది ఇంట్లోని కిటికీల అద్దాలు తుడవడానికి మార్కెట్లో దొరికే క్లీనింగ్ లిక్విడ్లను ఉపయోగిస్తుంటారు. అయితే, కుంకుడు కాయలతో తయారుచేసుకున్న లిక్విడ్ సోప్ ద్వారా వీటిని తళతళా మెరిపించవచ్చు. ముందుగా బౌల్లో టేబుల్ స్పూన్ కుంకుడు కాయ లిక్విడ్ సోప్, రెండు టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్, అరకప్పు నీటిని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్లో పోసి బాగా షేక్ చేయాలి. తర్వాత దీన్ని కిటికీ అద్దంపై స్ప్రే చేసి మెత్తటి వస్త్రంతో తుడిచేయాలి. ఇలా చేస్తే కిటికీ అద్దాలపై పేరుకున్న దుమ్ము తొలగిపోయి కొత్త వాటిలా తళతళా మెరుస్తాయి.
పట్టు వస్త్రాలను ఉతకవచ్చు.. సాధారణంగా చాలా మంది పట్టు, ఇతర సున్నితమైన వస్త్రాల్ని షాంపూ వాష్ చేస్తుంటారు. ఆ షాంపూకి బదులుగా కుంకుడు కాయలతో చేసిన మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ఇందుకోసం ముందుగా కొన్ని కుంకుడు కాయలను చల్లటి నీటిలో నానబెట్టి వాటి రసాన్ని తీయాలి. ఈ లిక్విడ్‌తో పట్టు, జరీ వస్త్రాలను ఉతికితే అవి ఎక్కువ కాలం మన్నడంతో పాటు రంగు వెలిసిపోకుండా కాపాడుకోవచ్చు. ఇలా ఖరీదైన పట్టు, జరీ దుస్తుల్ని ఉతకడానికి కుంకుడు కాయలు చాలా బాగా ఉపయోగపడతాయి.
కిచెన్ క్లీన్ చేద్దాం.. అరకప్పు కుంకుడు కాయ రసానికి రెండు చెంచాల వైట్ వెనిగర్, కొద్దిగా వాటర్ కలపాలి. ఈ లిక్విడ్‌ని స్ప్రే బాటిల్లో పోసి బాగా షేక్ చేసుకోవాలి. దీనితో కిచెన్ ప్లాట్‌ఫాం, వాష్‌బేసిన్ లాంటివి క్లీన్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని బాత్‌రూం క్లీనర్‌గా కూడా వాడుకోవచ్చు.
నగలు క్లీన్ చేయొచ్చు.. బంగారం, వెండితో తయారుచేసిన ఆభరణాలను, ఇతర వస్తువులను క్లీన్ చేయడానికి కూడా కుంకుడు కాయల్ని యూజ్ చేయవచ్చు. దీనికోసం కుంకుడుకాయ రసంలో నగలను కొద్దిసేపు నానబెట్టాలి. తర్వాత మెత్తని బ్రష్‌తో మృదువుగా రుద్దితే సరిపోతుంది. కుంకుడుకాయ రసం నేచురల్ లిక్విడ్ కాబట్టి, ఇందులో రసాయనాలు ఉండవు. దీనివల్ల ఆభరణాల రంగు తగ్గిపోతుందన్న భయం ఉండదు.
మీ ఇంట్లో ఎలక్ట్రిక్ కెటిల్ ఉందా ? ఎక్కువ కాలం పాటు పని చేయాలంటే ఇలా చేయాల్సిందే!!
ఇంట్లో కెమికల్ ఫ్రెష్నర్స్ ఎందుకు? - ఈ సహజ పరిమళాలు వెదజల్లండి! - ఆరోగ్యం, ఆనందం మీ సొంతం