How To Make Tasty Bellam Paramannam : శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. ఇక చాలా మంది దేవదేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటుంటారు. ఈ క్రమంలోనే ప్రత్యేకమైన నైవేద్యాలు ప్రిపేర్ చేసి దేవుడికి ప్రసాదంగా సమర్పిస్తుంటారు. అలాంటి వాటిలో ముందు వరుసలో ఉంటుంది.. బెల్లం పరమాన్నం. అయితే, చాలా మందికి పరమాన్నాన్ని సరైన రుచి వచ్చే విధంగా తయారు చేసుకోవడం రాదు. అలాంటి వారికోసం పక్కా కొలతలతో ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా టెంపుల్ స్టైల్ 'బెల్లం పరమాన్నం' రెసిపీ పట్టుకొచ్చాం. టేస్ట్ అద్దిరిపోతుంది! దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- బియ్యం - ఒక కప్పు
- పెసరపప్పు - అర కప్పు
- వాటర్ - 6 కప్పులు
- నెయ్యి - 6 టేబుల్స్పూన్లు
- డ్రైఫ్రూట్స్ - పావుకప్పు
- ఎండుకొబ్బరి తురుము - 2 టేబుల్స్పూన్లు
- లవంగాలు - 5
- బెల్లం - 2 కప్పులు
- యాలకుల పొడి - 2 టీస్పూన్లు
- పచ్చ కర్పూరం - కాస్తంత
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో బియ్యం, ఇంకో గిన్నెలో పెసరపప్పు(Pesarapappu) తీసుకొని శుభ్రంగా కడిగి.. రెండింటిని అరగంట పాటు నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు మీరు పరమాన్నం చేసుకోవాలనుకుంటున్న గిన్నెను తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలి. ఆపై దాన్ని స్టౌపై పెట్టుకొని హీట్ చేసుకోవాలి. అయితే, ఇక్కడ మీరు బియ్యం ఏ కప్పుతో తీసుకున్నారో.. అదే కప్పుతో వాటర్ తీసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- అనంతరం నానబెట్టుకున్న పెసరపప్పును వడకట్టి అందులో వేసుకొని 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరీ, మెత్తగా కాకుండా పప్పు కాస్త పలుకుగా ఉండేలా ఉడికితే సరిపోతుంది.
- ఆవిధంగా పప్పు ఉడికిందనుకున్నాక.. నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అనంతరం మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ మిశ్రమంలోని నీళ్లు దగ్గరపడే వరకు మెత్తగా ఉడికించుకోవాలి.
- అలా మిశ్రమాన్ని ఉడికించుకున్నాక అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఆ గిన్నెను స్టౌపై నుంచి దించి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టౌ మీద.. మరో గిన్నె పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి బాగా వేడెయ్యాక.. జీడిపప్పు, బాదం, కిస్మిస్ వంటి డ్రైఫ్రూట్స్ వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఆపై ఎండు కొబ్బరి తురుము, లవంగాలు వేసి మరికాసేపు ఫ్రై చేసుకొని నెయ్యితో సహా ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- ఆ తర్వాత అదె గిన్నె స్టౌపై పెట్టుకొని బెల్లం, అర కప్పు వాటర్ వేసుకొని.. బెల్లం పాకాన్ని రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి.
- అనంతరం అందులో యాలకుల పొడి, కాస్త పచ్చ కర్పూరం వేసి కలుపుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసుకొని మరో రెండు నిమిషాల పాటు కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఆవిధంగా ఉడికించుకున్నాక పాకం గిన్నెను స్టౌపై నుంచి పక్కకు దించుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై.. అన్నం గిన్నెను పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆపై బెల్లం పాకాన్ని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అనంతరం మిశ్రమాన్ని కలుపుతూ రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టౌ ఆఫ్ చేయాలి.
- తర్వాత గిన్నెపై మూతపెట్టి 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఆపై మూతతీసి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా టెంపుల్ స్టైల్ పరమాన్నం రెడీ! దీన్ని కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి అద్దిరిపోతుంది!
ఇవీ చదవండి :
సగ్గుబియ్యంతో పసందైన వంటలు - టేస్ట్ సూపర్! తింటే వదిలిపెట్టరు!
ఛాయ్ చేసినంత సులువుగా అద్దిరిపోయే "పనీర్ ఖీర్" - ఇలా ప్రిపేర్ చేసుకోండి!