US Strikes Iran Targets In Syria : జోర్డాన్‌లో తమ క్యాంప్‌పై దాడి చేసిన ఘటనకు సంబంధించి అమెరికా ప్రతీకార దాడులు చేపట్టింది. సిరియా, ఇరాక్‌లోని ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు, ఇరాన్ రివల్యూషనరీ గార్డుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధవిమానాలు దాడి చేశాయి. ఈఘటనలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. మొత్తం 85 స్థావరాలపై దాడులు జరిగాయి. దీర్ఘశ్రేణి బాంబర్లు వైమానిక దాడుల్లో పాల్గొన్నాయి. మరోవైపు, ఇటీవల డ్రోన్ దాడిలో మృతిచెందిన సైనికుల కుటుంబాలను పరామర్శించి, వారికి సంతాపం తెలిపారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు.
"నా ఆదేశాల ప్రకారం అమెరికా బలగాలు ఇరాక్, సిరాయాల్లోని శత్రు స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటాయి. మా స్పందన మొదలైంది. మేము ఎంచుకున్న ప్రదేశాల్లో దాడులు కొనసాగుతాయి. అమెరికా ఎవరితో కూడా వివాదాలు పెట్టుకోదు. కానీ ఎవరైనా మా దేశానికి హానీ కలిగిస్తే మాత్రం తప్పకుండా స్పందిస్తాం."
--జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
అమెరికా దాడులను ఖండించిన ఇరాక్
మరోవైపు అమెరికా దాడులపై ఇరాక్ స్పందించింది. సిరియా, ఇరాక్‌లోని మిలిటరీ స్థావరాలపై అమెరికా దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు ఇరాక్ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా భంగం కలిగించడమే అవుతుందని అభిప్రాయపడింది. ఇరాక్ ప్రభుత్వాన్ని, ప్రజలను బలహీనం చేసేందుకే ఈ దాడులు చేస్తున్నట్లు పేర్కొంది.
డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మృతి
జోర్డాన్‌లో ఇటీవల అమెరికా సైనిక క్యాంప్‌పై డ్రోన్ దాడి జరగడం వల్ల ముగ్గురు అమెరికా సైనికులు మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. ఇరాక్ కేంద్రంగా పనిచేసే ముజాహిదీన్ ఆఫ్ ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూపు ఈ దాడికి పాల్పడిందని అమెరికా వెల్లడించింది. ఈ దాడులపై అగ్రరాజ్యం తీవ్రంగా స్పందించింది. అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు ఇతర మంత్రులు ప్రతికార దాడులు తప్పవని హెచ్చరించారు. దానికి తగ్గట్లు ప్రణాళిక రూపొందిస్తాన్నామని బైడెన్ ఇటీవల పేర్కొన్నారు.