Ukrainian Soldiers Killed By Russia : తమ దేశ సరిహద్దుల్లోకి చొరబాటుకు యత్నించిన 234 మంది ఫైటర్లను హతమార్చినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా భద్రత బలగాలు ఉక్రెయిన్ ఫైటర్ల చొరబాట్లను సమర్థంగా తిప్పికొట్టాయని పేర్కొంది. 'రష్యా సైన్యం, సరిహద్దు దళాలు దేశ భూభాగంలోకి వచ్చి దాడులకు పాల్పడిన ఉక్రెయిన్ ఫైటర్లను ఆపగలిగాయి. ఉక్రెయిన్ ఫైటర్ల దాడులను నివారించగలిగాయి. ఉక్రెయిన్ ఫైటర్ల ఏడు యుద్ధ ట్యాంకులు, ఐదు సాయుధ వాహనాలను నాశనం చేశాం.' అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడులు
Russia Ukraine War Update : రష్యా అధ్యక్ష ఎన్నికలకు కొద్ది రోజుల ముందు దేశ సరిహద్దుల్లో ఉక్రెయిన్ ఫైటర్లు ఇలాంటి దాడులకు పాల్పడడం క్రెమ్లిన్‌ను కాస్త కలవరపెడుతోంది. మంగళవారం రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో రెండు చమురు శుద్ధి క్షేత్రాలను డ్రోన్లు తాకాయని రష్యా అధికారులు తెలిపారు. తమ దేశంలోని ఎనిమిది ప్రాంతాల్లో డ్రోన్లు పడ్డాయని వివరించారు. మాస్కోపైకి దూసుకొచ్చిన డ్రోన్‌ను కూల్చివేసినట్లు పేర్కొన్నారు.
'అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపేందుకు రష్యా వ్యతిరేకం'
Russia Nuclear Weapons : అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపేందుకు రష్యా పూర్తి వ్యతిరేకమని ఇటీవలే ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. అణ్వస్త్ర ఆధారిత యాంటీ శాటిలైట్ ఆయుధాలను రష్యా అభివృద్ధి చేస్తోందంటూ అమెరికా చేసిన ఆరోపణలను పుతిన్ ఖండించారు. అమెరికాకు సమానంగా అంతరిక్ష సామర్థ్యాలను మాత్రమే తమ దేశం అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. రక్షణశాఖ మంత్రి సెర్గీ షొయిగుతో నిర్వహించిన సమావేశంలో వ్లాదిమిర్ పుతిన్- అమెరికా చేసిన వ్యాఖ్యలపై సమాధానం ఇచ్చారు. అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపడాన్ని రష్యా ఎప్పటికీ సమర్థించదని తెలిపారు. కొన్ని దేశాలు కావాలనే తమను లక్ష్యంగా చేసుకుంటున్నాయని పుతిన్ ఆరోపించారు. అంతరిక్ష రంగంలో మరింత అభివృద్ధి సాధించేందుకు తమతో కలిసి నడవాలని పాశ్చాత్యదేశాలను ఇప్పటికే పలుమార్లు ఆహ్వానించామని, కానీ కొన్నిదేశాలు ముందుకు రాలేదని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి అన్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.