Ukraine Claims To Control 1000 Sq kms Of Russian Territory : రష్యాలోని కస్క్ ప్రాంతంలో దాదాపు 1000 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం తమ నియంత్రణలోకి వచ్చినట్లు ఉక్రెయిన్ సైనిక కమాండర్ జనరల్ ఒలెక్సాండర్ సిర్‌స్కీ తెలిపారు. అలాగే కస్క్‌లో ప్రస్తుత పరిస్థితిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి వివరించారు. ఇరు దేశాల బలగాల మధ్య యుద్ధం సాగుతోందని వెల్లడించారు.
ఫస్ట్ టైమ్
రష్యాలోకి తమ సేనలు అడుగుపెట్టినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మొదటిసారి ధ్రువీకరించారు. కస్క్‌లో పోరాడుతున్న సైనిక సిబ్బందిని ఆయన అభినందించారు. ఆ ప్రాంతంలో మానవతా సహాయం అందిస్తామని తెలిపారు. అటు కీవ్ బలగాల చొరబాటును, ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌లో తమ సైనికులను నిలువరించేందుకు చేసిన ప్రయత్నంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ సేనలతో సాగుతున్న భీకర పోరులో మాస్కో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ ఉన్నత స్థాయి రక్షణ, భద్రతాధికారులతో సమావేశమైన పుతిన్, ఆగస్టు 6న ఉక్రెయిన్ దాడులు మొదలైనట్లు తెలిపారు. భవిష్యత్తులో యుద్ధం ముగింపునకు సంబంధించిన చర్చల్లో మెరుగైన స్థితిలో ఉండేందుకే ఆ దేశం ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.
అణు విద్యుత్ ప్లాంట్‌లో మంటలు
ఇంతకు ముందు ఐరోపాలో అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రాల్లో ఒకటైన ఉక్రెయిన్‌కు చెందిన జపోరిజియాలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఈ ప్లాంట్ ఉంది. అయితే ఈ ప్లాంట్‌లో మాస్కో దళాలే పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. వారు కీవ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్ దళాలు ప్రయోగించిన ఫిరంగి గుండ్ల కారణంగానే మంటలు వ్యాపించాయని రష్యా ప్రత్యారోపణలు చేసింది. అయితే తమ దళాలు వాటిని సోమవారం నాటికి అణు విద్యుత్ కేంద్రంలోని మంటలను పూర్తిగా ఆర్పేశాయని వెల్లడించింది. ప్రస్తుతం జపోరియా అణువిద్యుత్ కేంద్రంలో, అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు చెందిన సిబ్బంది కూడా ఉన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి అణు లీక్ చోటుచేసుకోలేదని వారు చెప్పారు.
ఏథెన్స్‌ను చుట్టుముట్టిన కార్చిచ్చు - ఒకరు మృతి, 15 మందికి తీవ్రగాయాలు