Max Magazine Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న ట్రంప్‌ను పర్సన్ ఆఫ్ ఇయర్-2024గా ఎంపిక చేసింది ప్రతిష్టాత్మక టైమ్ మేగజైన్. ఈ అరుదైన గుర్తింపును పొందడం ఆయనకు ఇది రెండోసారి. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు అప్పుడు కూడా పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.
2024 ఏడాదికి గాను పర్సన్ ఆఫ్ ఇయర్ అవార్డు కోసం 10 మంది పేర్లను షార్ట్ లిస్ట్ చేసింది టైమ్స్ మేగజైన్. డొనాల్డ్ ట్రంప్‌తో పాటు కమలా హారిస్, కేట్ మిడిల్టన్, ఎలాన్ మస్క్, బెంజమిన్ నెతన్యాహు, మార్క్ జుకర్‌బర్గ్, యులియా నవాల్నాయా, జెరోమ్ పావెల్, జో రొగాన్, క్లాడియా షెన్‌బామ్ పేర్లను తుది పరిశీలనకు తీసుకుంది. చివరగా ట్రంప్‌ను ఎంపిక చేసింది.
మరోవైపు, న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రారంభ గంటను కూడా మోగించారు ట్రంప్. బెల్ మోగించడానికి ముందు ఇది చాలా పెద్ద గౌరవమని తెలిపారు. టైమ్ మేగజైన్ నుంచి రెండోసారి గౌరవాన్ని పొందుతున్నానని చెప్పారు. బెల్ మోగించడానికి ముందు ప్రజలు నినాదాలు చేయడం వల్ల పిడికిలి బిగించారు. ఆ సమయంలో అక్కడ ట్రంప్ భార్య మోలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా, వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన JD వాన్స్ సహ పలువురు ఉన్నారు.
మెటా భారీ విరాళం
మరోవైపు, ట్రంప్ పాలనకు ఏర్పాటు చేసిన సహాయనిధికి విరాళాలు భారీగా అందుతున్నాయి. తాజాగా మెటా సంస్థ ట్రంప్‌కు 1 మిలియన్ డాలర్లు (రూ.8 కోట్లకుపైగా) విరాళంగా అందించింది. ఇటీవల ట్రంప్ నివాసంలో మెటా సీఈఓ మాక్ జుకర్‌బర్గ్ భేటీ అయ్యారు. ఆ సమయంలో ఇద్దరూ కలిసి విందు చేసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌నకు ఇంత మొత్తంలో విరాళాలు అందించడం గమనార్హం.
2021లో క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ట్రంప్ ఫేస్బుక్, ఇన్‌స్టా ఖాతాలపై నిషేధం విధించారు. దీంతో ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అనంతరం 2023లో వాటిని పునరుద్ధరించారు. భవిష్యత్తులో ట్రంప్ మళ్లీ ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానా విధిస్తామని మెటా అప్పట్లో పేర్కొంది. అయితే, అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మెటా ఆ ఆంక్షలను ఎత్తివేసింది.
2024 ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పట్ల మరింత సానుకూల వైఖరిని వినిపించారు జుకర్‌బర్గ్. హత్యాయత్నంపై ట్రంప్ స్పందించిన తీరును ఆయన ప్రశంసించారు. జీవితంలో చూసిన అత్యంత అరుదైన దృశ్యం అదేనని, ఒక అమెరికన్‌గా ఎవరైనా ఆ పోరాటంతో భావోద్వేగానికి గురికావాల్సిందేనని పోస్ట్ చేశారు. అందుకేనేమో చాలామంది ఆయనను ఇష్టపడతారని రాసుకొచ్చారు. అలా ట్రంప్, జుకర్ మధ్య సంబంధాలు బలపడ్డాయి.