Trump Kamala Harris Debate : యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్ష అభ్యర్థుల డిబేట్ వాడీవేడిగా జరిగింది. పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ వేదికగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. డిబేట్‌కు ముందు ఇరువురు పలకరించుకుని షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ, అక్రమ వలసల, గర్భవిచ్ఛత్తి, రష్యా, ఇజ్రాయెల్ యుద్ధాలు తదితర కీలక అంశాలపై హోరాహోరీగా చర్చలు జరిపారు.
Candidates Kamala Harris and Donald Trump shake hands as they take the stage in their first presidential debate. https://t.co/8QKnKeEq44 #ABCDebate pic.twitter.com/ddD1McR2ys
— ABC News Live (@ABCNewsLive) September 11, 2024
'దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు'
ఆరంభంలోనే దేశ ఆర్థిక వ్యవస్థ గురించి హారిస్, ట్రంప్ మధ్య చర్చ జరిగింది. అమెరికాను నంబర్‌వన్‌గా నిలపడమే తన లక్ష్యమని, కరోనా సమయంలోనూ సమర్థంగా పనిచేశానని ట్రంప్ అన్నారు. 'కరోనా కాలంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టా. నా హయాంలో అమెరికాలో ద్రవ్యోల్బణం లేదు. బైడెన్ అధికారంలోకి వచ్చాక అమెరికాను చైనా చీల్చిచెండాడుతోంది. కమలా హారిస్ పెద్ద మార్క్సిస్ట్. బైడెన్ -హారిస్ అనుమతిచ్చిన అక్రమ వలసదారులు దేశాన్ని నాశనం చేస్తున్నారు. అమెరికన్ల ఉద్యోగాలను లాక్కుంటున్నారు. అందుకే అక్రమ వలసదారులను దేశం నుంచి త్వరగా వెళ్లగొట్టాలి. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థను కూడా నాశనం చేశారు. ఇప్పుడు అది అన్ని వర్గాలకు విపత్తుగా మారింది' అని ట్రంప్ విమర్శించారు.
దేశాన్ని చైనాకు అమ్మేశారు
దీనికి కమలా హారిస్ బదులిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ చిన్నాభిన్నం చేశారని అన్నారు. 'ఆయన హయాంలో దేశం ద్రవ్యలోటును ఎదుర్కొంది. ట్రంప్ తప్పిదాలను బైడెన్, నేను సరిచేశాం. ఆయన వద్ద పారదర్శకత లేదు. దేశ అభివృద్ధిపై ప్రణాళికలు లేవు. దేశాన్ని చైనాకు ట్రంప్ అమ్మేశారు. మేము చిరు వ్యాపారులు, కుటుంబాలకు సాయం చేస్తాం. బిలియనీర్లు, కార్పొరేట్లకు ట్రంప్ పన్నులు తగ్గిస్తారు. దీంతో అమెరికాకు 5 ట్రిలియన్ డాలర్ల లోటు ఏర్పడుతుంది. స్టార్టప్‌ల కోసం పన్నులు తగ్గించేందుకు మా వద్ద ప్రణాళిక ఉంది' అని హారిస్ వివరించారు.
అబార్షన్లపై ఇలా
గర్భవిచ్ఛిత్తి అంశంపై ఇరువురు వాడీవేడిగా వాదించారు. మహిళల అభివృద్ధి అంటే ట్రంప్‌నకు గిట్టదని, అబార్షన్లపై నిషేధం విధించాలనుకుంటున్నారని హారిస్ అన్నారు. 'అత్యాచారాల వంటి కేసుల్లోనూ మహిళలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలనుకోవడం లేదు. ఇది మహిళలను అవమానించడమే. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైతే జాతీయ అబార్షన్ల నిషేధంపై సంతకం చేస్తారు. గర్భవిచ్ఛిత్తిపై మహిళలే నిర్ణయం తీసుకోగలరు. సరైన నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం వారికి ఉంటుంది. అమెరికా ప్రజలు స్వేచ్ఛాప్రియులు' అని హారిస్ అన్నారు.
దీనికి ట్రంప్ ఘాటుగా బదులిచ్చారు. 'కమలా హారిస్ అబద్ధం చెబుతున్నారు. గర్భవిచ్ఛిత్తిపై నిషేధానికి నేను అనుకూలం కాదు. ఆ బిల్లుపై సంతకం చేయను. అయితే, ఎనిమిది, తొమ్మిది నెలల్లో గర్భవిచ్ఛిత్తి ఎలా చేస్తారు? దానికి మాత్రం తాను అనుకూలం కాదు' అని స్పష్టంచేశారు.
#WATCH | US Presidential Debate between Vice President Kamala Harris and former US President Donald Trump in Philadelphia
— ANI (@ANI) September 11, 2024
US Vice President and Democratic Party's presidential nominee, Kamala Harris says, " donald trump hand-selected three members of the supreme court with the… pic.twitter.com/5ET82tbt3o
ఇజ్రాయెల్, రష్యా యుద్ధాలపై చర్చ
ఇజ్రాయెల్-హమాస్, రష్యా- ఉక్రెయిన్ యుద్ధాల గురించి ట్రంప్, హారిస్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. తమను తాము రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది కమలా హారిస్ స్పష్టంచేశారు. కానీ అమాయకులైన ఎంతోమంది పాలస్తీనియన్లు మృతి చెందారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ యుద్ధం తక్షణమే ముగియాలని ఆకాంక్షించిన హారిస్ ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరాలని చెప్పారు. నియంతలను ట్రంప్ ఆరాధిస్తారని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో ట్రంప్ ప్రేమలేఖలు ఇచ్చిపుచ్చుకున్నారని హారిస్ ఎద్దేవా చేశారు. ఒకవేళ ట్రంప్ అధికారంలో ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ కీవ్ (ఉక్రెయిన్ రాజధాని)లో కూర్చునేవారు. తాము ఇచ్చిన మద్దతు వల్లే ఉక్రెయిన్ ఇంకా స్వేచ్ఛగా ఉందని అన్నారు. అమెరికా ప్రజలు విభజించేందుకు ఆయన విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.
ఇజ్రాయెల్ అంటే హారిస్‌కు నచ్చదని, ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికైతే రెండేళ్లలో ఇజ్రాయెల్ కనుమరుగవుతుందని ట్రంప్ అన్నారు. కమలా హారిస్‌కు అరబ్ ప్రజలు అంటే ద్వేషమని ట్రంప్ ఆరోపించారు. కమల హయాంలో ఆ ప్రదేశం మొత్తం పేలిపోతుందని, ఇజ్రాయెల్ కూడా ఉండదని ట్రంప్ వ్యాఖ్యానించారు. బైడెన్ విధానాల కారణంగా అటు ఉక్రెయిన్‌లోనూ లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. తాను అధికారంలోకి వస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగేలా చేస్తా అని ట్రంప్ అన్నారు.