Trump Incident Shooter : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు గురించి కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ స్కూల్లో ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికే ఇష్టపడేవాడని స్నేహితులు వాపోయారు. అంతకుముందు అతడు ఓ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజ కంపెనీ రూపొందించిన ప్రకటనలో నటించినట్లు తెలిసింది. తాజా ఘటనతో అప్రమత్తమైన సదరు సంస్థ ఆ యాడ్‌ను తొలగించింది.
యాడ్‌లో నటించిన క్రూక్స్- తొలగించిన సంస్థ
ప్రపంచ అతిపెద్ద మనీ మేనేజింగ్ సంస్థ 'బ్లాక్ రాక్' 2022లో ఓ యాడ్ రూపొందించింది. పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్ హైస్కూల్‌లో దాన్ని చిత్రీకరించారు. అందులో ఆ స్కూల్‌కు చెందిన కొందరు విద్యార్థులు నటించగా, వారిలో క్రూక్స్ కూడా ఉన్నాడు. ట్రంప్‌పై కాల్పుల ఘటన తర్వాత ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కంపెనీ సదరు ప్రకటనను తమ వెబ్‌సైట్ నుంచి తొలగించింది. అయితే, అధికారులకు వీడియో అందుబాటులో ఉంటుందని బ్లాక్ రాక్ వెల్లడించింది.
ఈ బెతెల్ పార్క్ స్కూల్ నుంచి క్రూక్స్ 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. స్కూల్లో ఉండగా, గణితంలో అతడు చురుగ్గా ఉండేవాడని తెలుస్తోంది. నేషనల్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇనీషియేటివ్ నుంచి అతడు 500 డాలర్ల 'స్టార్ అవార్డు' కూడా అందుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత నుంచి ఓ నర్సింగ్ హోంలో పనిచేస్తున్నాడు.
స్కూల్లో వేధింపులు
స్కూల్లో ఉన్న సమయంలో క్రూక్స్ తోటి విద్యార్థుల నుంచి వేధింపులు ఎదుర్కొన్నాడని అతడి మాజీ క్లాస్‌మేట్ ఒకరు మీడియాకు చెప్పారు. "అతడు ఎప్పుడూ మౌనంగా ఉండేవాడు. ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడేవాడు. రాజకీయాలు, ట్రంప్ గురించి గానీ మాట్లాడటం నేనెప్పుడూ వినలేదు. అయితే, స్కూల్లో కొంతమంది మాత్రం అతడిని చాలా వేధించారు. అతడు వేసుకునే దుస్తులను చూసి గేలి చేసేవారు" అని ఆ క్లాస్‌మేట్ వివరించారు.
దుండగుడి ఫొటో విడుదల
మరోవైపు కాల్పుల ఘటనపై దర్యాప్తు చేపట్టిన ఎఫ్‌బీఐ (FBI) తాజాగా దుండగుడి ఫొటోను విడుదల చేసింది. అందులో క్రూక్స్ కళ్లద్దాలు పెట్టుకొని నవ్వుతూ ఉన్నాడు. మాజీ అధ్యక్షుడి ట్రంప్‌పై కాల్పులు జరపగా, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని మట్టుబెట్టారు. అయితే, క్రూక్స్ ఫొటోను ఎఫ్‌బీఐ విడుదల చేయడానికి ముందే అతడికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మరోవైపు కాల్పులకు ముందు అతడు రికార్డు చేసినదిగా పేర్కొంటున్న ఓ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అందులో 'రిపబ్లికన్ పార్టీని, ట్రంప్‌ను నేను ద్వేషిస్తున్నా'నని అతడు చెబుతున్నట్లుగా ఉంది. క్రూక్స్ పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్‌కు చెందిన వ్యక్తిగా తెలిపింది. ప్రభుత్వ ఓటింగ్ రికార్డుల ప్రకారం అతడు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుగా నమోదు చేసుకున్నాడు. కానీ, అతడు 2021 సంవత్సరంలో 15 డాలర్లను డెమోక్రాట్లకు అనుబంధంగా పనిచేసే ప్రొగ్రెసివ్ టర్న్‌ఔట్ ప్రాజెక్టుకు విరాళంగా ఇచ్చాడు.
మాజీ అధ్యక్షుడిని కాపాడిన 50పేజీల స్పీచ్ పేపర్లు- బుల్లెట్ తగిలినా ఆగని ప్రసంగం! - US Elections
అబ్రహం లింకన్ టు డొనాల్డ్ ట్రంప్- అమెరికాలో నాయకులే లక్ష్యంగా దాడులు! - Attacks On US Presidents