US Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. 47వ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు మంగళవారం ఓటింగ్ జరగనుంది. ముందస్తు ఎన్నికల్లో భాగంగా, ఆదివారం వరకు 7.5 కోట్లకుపైగా అమెరికన్లు ఓటు వేశారు. ఈసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య నువ్వా-నేనా అనే విధంగా పోటీ నెలకొంది. కొన్ని దశాబ్దాల తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంత భీకరమైనపోరు జరగటం ఇదే మొదటిసారి అనే అభిప్రాయం వినిపిస్తోంది. అంతేకాకుండా ఓ కేసులో ట్రంప్ దోషిగా తేలడం, బైడెన్‌పై సొంత పార్టీ వ్యతిరేకతతో కమలా హారిస్ బరిలోకి దిగడం వరకు ఎన్నికలకు ముందు అనేక అనూహ్య పరిణామాలు జరిగాయి.
జనవరి 20నే బాధ్యతలు
యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఓటింగ్ జరగనుంది. ఇక మంగళవారం జరిగే పోలింగ్ కోసం అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. మూడోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున పోటీచేస్తుండగా, జేడీ వాన్స్ ఆయన రన్నింగ్ మేట్‌గా ఉన్నారు. డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ బరిలో ఉండగా టీమ్ వాల్జ్ ఆమె రన్నింగ్ మేట్‌గా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందినవారు వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా 47వ అధ్యక్ష, 50వ ఉపాధ్యక్షులుగా పగ్గాలు చేపట్టనున్నారు.
స్వింగ్ రాష్ట్రాలపైనే దృష్టి
అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లు ఉండగా, అందులో 270 ఓట్లు సాధించిన అభ్యర్థి అమెరికాకు తదుపరి ప్రెసిడెంట్ కానున్నారు. అమెరికాలోని ప్రతి రాష్ట్రంతో పాటు డిస్ట్రిక్ ఆఫ్ కొలంబియా ఓటర్లు ఎలక్టోరల్ కాలేజీకి చెందిన ఎలక్టర్లను ఎన్నుకోనున్నారు. వారు తదుపరి నాలుగేళ్ల కాలానికి అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ఏడు స్వింగ్ రాష్ట్రాలు ప్రభావితం చేయనుండగా, అందులో పెన్సిల్వేనియా అత్యంత కీలకంగా మారింది. అక్కడ అత్యధికంగా 19 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. 16 ఓట్లతో నార్త్‌కరోలినా, జార్జియా తర్వాత స్థానాల్లో నిలిచాయి. మిషిగన్‌లో 15, ఆరిజోనా 11, విస్కాన్సిన్ 10, నెవడాలో 6 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్నాయి. అందుకే పోలింగ్‌కు కొన్నిరోజుల ముందు నుంచి అధ్యక్ష అభ్యర్థులు ఈ స్వింగ్ రాష్ట్రాలపైనే దృష్టి పెట్టారు. సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించారు.
ఎన్నికలకు ముందు అనూహ్య పరిణామాలు
మునుపెన్నడూ లేనివిధంగా అమెరికా ఎన్నికలకు ముందు అనూహ్య పరిణామాలు జరిగాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హష్‌మనీ కేసులో దోషిగా తేలారు. కానీ ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఆ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన ట్రంప్ ఆ తర్వాత పుంజుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్‌తో జరిగిన తొలి బిగ్ డిబేట్‌లో పైచేయి సాధించారు. దీంతో పడిపోయిన రిపబ్లికన్ల గ్రాఫ్ మళ్లీ పుంజుకుంది. ఇక తొలి డిబేట్‌లో వైఫల్యంతో పాటు ఇతర కారణాలతో బైడెన్ రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కమలా హారిస్ రాకతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.
ఎన్నికల రణరంగంలోకి దిగిన కమలాహారిస్ క్రమంగా పుంజుకొన్నారు. పలు సర్వేలు ఈ విషయాన్ని వెల్లడించాయి. సెప్టెంబర్ 10న జరిగిన రెండో బిగ్ డిబేట్‌లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌పై పైచేయి సాధించినట్లు ప్రచారం జరగటం వల్ల కమల గ్రాఫ్ భారీగా పెరిగిపోయింది. ఈ దెబ్బతో మళ్లీ ఆమెతో ముఖాముఖి చర్చకు ట్రంప్ విముఖత ప్రదర్శించారు. డెమొక్రటిక్ పార్టీకి విరాళాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. జో బైడెన్ పోటీలో ఉన్నప్పుడు తన గెలుపు నల్లేరు మీద నడకగా భావించిన ట్రంప్‌నకు కమల రాక ఆందోళనకు గురి చేసింది. రెండో డిబేట్‌లో కమల పైచేయి సాధించినట్లు ప్రచారం జరగటం వల్ల ఆమెతో మరోసారి ముఖాముఖి చర్చకు ట్రంప్ నిరాకరించారు. ఆ తర్వాత ఆమెను లక్ష్యంగా చేసుకొని ప్రచారంలో తీవ్రమైన ఆరోపణలు చేశారు.